మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Aug 10, 2020 , 01:37:16

మన ఊరిబండి మార్పు తెచ్చేనండి..

 మన ఊరిబండి మార్పు తెచ్చేనండి..

పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 523 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సజావుగా సాగాలంటే ప్రతి గ్రామ పంచాయతీకి సొంత ట్రాక్టర్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని గ్రామ పంచాయతీలు వందశాతం డబ్బులు చెల్లించి ట్రాక్టర్లను కొనుగోలు చేయగా, మరికొన్ని జీపీలు బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేశాయి. 2019 డిసెంబర్‌ 13న రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 89 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ట్రాక్టర్లు రావడంతో గ్రామాల్లో పరిస్థితి మారింది. ప్రతిరోజూ చెత్తసేకరణ, డంపింగ్‌యార్డులకు చెత్త తరలింపు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ట్రాక్టర్‌కు ట్రాలీ, ట్యాంకర్‌, ఫ్రంట్‌ బ్లేడ్‌ ఉండడంతో ఒక్క ట్రాక్టర్‌తో ఎన్నో పనులు పూర్తవుతున్నాయి.  ఏర్గట్ల మండలం దోంచంద, మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ గ్రామాల్లో ఇటీవల అగ్నిప్రమాదాలు సంభవించగా ఫైరింజన్‌ కోసం ఎదురుచూడకుండా గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో మంటలను ఆర్పివేశారు. 

ఆదాయం సమకూరుస్తున్న ‘ఉపాధి’ 

ఒకప్పుడు ట్రాక్టర్లకు అద్దె చెల్లించిన గ్రామ పంచాయతీలకు ఇప్పుడు సొంత ట్రాక్టర్లతో ఆదాయం సమకూరుతున్నది. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్లతో నీటిని పడుతుండడంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి డబ్బులు చెల్లిస్తున్నారు. ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పట్టడం ద్వారా ఒక్కో గ్రామపంచాయతీకి నెలకు రూ.10 వేలకు పైగా ఆదాయం వస్తున్నది. ఈ డబ్బులను ప్రతి నెలా డీజిల్‌కు వెచ్చిస్తున్నారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిలో డ్రైవింగ్‌ రాని వారు ఉంటే ప్రైవేటు డ్రైవర్లను నియమించి వారికి జీతం చెల్లిస్తున్నారు. 

ఒక్క ట్రాక్టర్‌.. చేసే పనులెన్నో..

 • గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం సమకూరుస్తున్న ట్రాక్టర్లకు ట్రాలీ, ట్యాంకర్‌, ఫ్రంట్‌ బ్లేడ్‌ ఉండడంతో గ్రామాల్లో ఎన్నో పనులు చకచకా సాగుతున్నాయి.  
 • చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. 
 •  అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఫైరింజన్‌ కోసం ఎదురు చూడకుండా మంటలు ఆర్పుతున్నారు.
 • ట్యాంకర్‌తో దోమల మందు పిచికారీ చేస్తున్నారు. 
 • ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను ఫ్రంట్‌ బ్లేడ్‌  సహాయంతో తొలగిస్తున్నారు. 
 • రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు మొరం తరలిస్తున్నారు. 
 • మురికి కాలువలను శుభ్రం చేసిన తరువాత చెత్తను తరలిస్తున్నారు.
 • పైపులైన్‌ ద్వారా నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 
 • లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ కోసం అద్దెకు  ఇస్తున్నారు. 
 • హరితహారం నిర్వహణ సమయంలో నర్సరీల నుంచి మొక్కలను తరలిస్తున్నారు. 
 • మొక్కల సంరక్షణ కోసం ట్యాంకర్‌ ద్వారా నీటిని పడుతున్నారు.

ట్రాక్టర్ల పంపిణీ ఇలా..

నిజామాబాద్‌ జిల్లాలోని 523 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఇందులో 103 గ్రామపంచాయతీల వారు వందశాతం డబ్బులు చెల్లించి ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. మిగతా జీపీల వారు బ్యాంకు రుణాల ద్వారా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే 15 జీపీలకు ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పటికి 515 ట్రాలీలు గ్రామపంచాయతీలకు చేరగా, మరో 15 ట్రాలీలు గ్రామపంచాయతీలకు చేరాల్సి ఉంది. 523 జీపీలకు వాటర్‌ట్యాంకర్లు చేరగా మరో 7 జీపీలకు ట్యాంకర్లు చేరాల్సి ఉంది. త్వరలోనే వీటిని సమకూర్చేందుకు అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి.


logo