శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Nizamabad - Aug 08, 2020 , 03:08:54

స్వచ్ఛందంగా గ్రంథాలయం ఏర్పాటు

స్వచ్ఛందంగా గ్రంథాలయం ఏర్పాటు

మోపాల్‌ : యువకుల ఉత్సాహానికి గ్రామాభివృద్ధి కమిటీ సంపూర్ణ సహకారం అందించడంతో విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మోపాల్‌ మండలం బోర్గాం(పి) గ్రామంలోని యువకులు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు కలిసి వివేకానందుడి పేరిట లైబ్రరీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో పాడుబడ్డ పాతభవనాన్ని గ్రంథాలయం కోసం గ్రామాభివృద్ధి కమిటీ కేటాయించింది. దానికి మరమ్మతులు చేయించి సున్నం వేయించి అందంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయం ఏర్పాటుకు గ్రామంలోని యువత నిధులు సమకూర్చుకున్నారు. యువకుల ఉత్సాహానికి గ్రామాభివృద్ధి కమిటీ సంపూర్ణ సహకారం అందించడంతో పాత భవనానికి మరమ్మతులు చేయించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని నిరుద్యోగ యువత ఇక్కడికి వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పాఠకుల కోసం అవసరమైన అన్ని సౌకార్యలు కల్పించారు. గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు.

విజ్ఞానం..  వినోదం.. సమాచారం

ఈ గ్రంథాలయాన్ని నామమాత్రంగా నిర్వహించకుండా అన్నిరకాల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సమాచారాన్ని అందించే అన్ని రకాల దినపత్రికలను ప్రతిరోజూ పాఠకులకు అందిస్తున్నారు. వినోదాన్ని పంచే కథలు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. భవనంలోని రెండు గదులను పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు కేటాయించారు. ఈ భవనంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీటి కోసం వచ్చే నిరుద్యోగ యువకులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా గదుల్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పాఠకులకు అవసరమైన బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. దాతలు, వీడీసీ సహకారంతో మున్ముందు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిరుద్యోగ యువత, గ్రామాభివృద్ధి కమిటీ ఏకమై గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంపై పలువురు అభినందిస్తున్నారు.


logo