బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 06, 2020 , 02:40:35

అయోధ్యలో మందిరం.. జిల్లాలో సంబురం

అయోధ్యలో మందిరం.. జిల్లాలో సంబురం

  • nఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • nశ్రీరాముడి చిత్రపటాలతో శోభాయాత్ర

నమస్తే తెలంగాణ యంత్రాంగం: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శుభసందర్భంగా జిల్లా ప్రజలు బుధవారం సంబురాలు జరుపుకొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. శ్రీరాముడి చిత్రపటాలతో శోభాయాత్రలు నిర్వహించారు. 

రెంజల్‌ మండలంలోని దండిగుట్ట, కందకుర్తి రామాలయాల్లో శ్రీరామ స్ర్తోత్రం, కీర్తన, భజన, కార్యక్రమాలు నిర్వహించారు. దండిగుట్ట రామాలయం నిర్మించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 42 అడుగుల జెండాను ఆవిష్కరించి సంబురాలు జరుపుకొన్నారు. కందకుర్తి రామాలయంలో శ్రీరామ రక్షా స్ర్తోత్రం, రామనామ పారాయణం చేశారు. మోపాల్‌ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయంలో రామనామ జపాలు నిర్వహించిన అనంతరం మహిళలు దీపారాధన చేశారు. ఠాణాకుర్దూ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వీడీసీ సభ్యులు, భక్తులు యజ్ఞం నిర్వహించారు.  ఇందల్వాయి మండలం గన్నారం, నల్లవెల్లి, సిర్నాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, ఇందల్వాయి తదితర గ్రామాల్లో రాముడి చిత్రపటానికి పూజలు చేసి రామనామ జపం చేశారు. చరిత్ర కలిగిన ఇందల్వాయి రామాలయంలో అర్చకుడు రాజగోపాలాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవీపేట మండలం నాళేశ్వర్‌ గ్రామంలో శ్రీరాముడి చిత్ర పటాన్ని ఊరేగించారు. అనంతరం హనుమాన్‌ మందిరం ఆవరణలో మేడి మొక్కను నాటారు. 1116 లడ్డూలను గ్రామంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. డిచ్‌పల్లి బస్టాండ్‌ వద్ద ఉన్న శివాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుద్దపల్లి గ్రామంలోని హనుమాన్‌ మందిరం నుంచి శ్రీరాముడి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించి రామాలయంలో పెట్టారు.  ఆర్మూర్‌లో విశ్వహిందూ పరిషత్‌ పిలుపు మేరకు బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఇండ్లపై కాషాయ జెండాలను ఎగురవేసి స్వీట్లు తినిపించుకున్నారు. బీజేపీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాంనగర్‌ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  బోధన్‌ పట్టణంలోని శ్రీరాధాకృష్ణ మందిరం, అంకు టవర్స్‌ వద్ద  బీజేపీ నాయకులు, విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ ప్రతినిధులు సంబురాలు నిర్వహించారు. శక్కర్‌నగర్‌లోని రామాలయం నుంచి ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. బసవతారకనగర్‌లో శివసేన ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు,  పటాకులు కాల్చి సంబురాలు చేశారు. ముప్కాల్‌లో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జైశ్రీరాం నినాదాలతో ఈ ర్యాలీ కొనసాగింది. చందూర్‌లో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు రామాలయంలో పూజలు నిర్వహించి మిఠాయిలు పంచి పెట్టారు.  మోస్రా రామాలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. రుద్రూర్‌ విఠలేశ్వరాలయంలో లోక కల్యాణార్థం రామనామ జపం, రామరక్ష, హనుమాన్‌ చాలీసా పారాయణం, రుద్రాభిషేకం, సాయంత్రం దీపారాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసినట్లు అర్చకుడు రామశర్మ తెలిపారు.  భీమ్‌గల్‌ మండలం మెండోరా, పిప్రి గ్రామాల్లో యువకులు కాషాయ జెండాలు, రాముడి చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు.  భీమ్‌గల్‌ పట్టణంలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో అంగడి బజార్‌ హనుమాన్‌ ఆలయం వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు.  

జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు

నిజామాబాద్‌ సిటీ: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా జిల్లాలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. వెయ్యి మందికి పైగా బలగాలను మోహరించారు. పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షించారు. బోధన్‌తోపాటు నగరంలోని నెహ్రూపార్కు, అర్సపల్లిరోడ్డు, గాజుల్‌పేట్‌, మాలపల్లి తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం నుంచి పెట్రోలింగ్‌ నిర్వహించారు. 


logo