మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nizamabad - Aug 05, 2020 , 01:58:57

వరి పంటలో ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి

వరి పంటలో ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి

 • lఎక్కువగా వాడితే   చీడపీడల ముప్పు
 • lభూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వాడుకోవాలి
 • lవ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

వరిసాగులో ఎరువుల యాజమాన్యమే కీలకం. అయితే ఎరువుల వాడకంపై రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించకుండా తోటి రైతులను చూసి తమ పొలంలోనూ అవసరం ఉన్నా లేకున్నా ఎడాపెడా ఎరువులను చల్లి ఖర్చు పెంచుకుంటున్నారు. ఎరువుల యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

ఎల్లారెడ్డి రూరల్‌ :  ఎరువుల వినియోగంలో రైతులకు సరైన అవగాహన లేక అటు ఆర్థికంగా, ఇటు దిగుబడుల పరంగా నష్టపోతున్నారు. నీటి యాజమాన్యంతోపాటు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంలో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలి. వరిసాగులో రసాయన ఎరువులపై రైతులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. భూసార పరీక్షలు చేయించినపుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్‌ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకుమించి వాడితే పొలంపై తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉంది.

మూడు విడుతలుగా యూరియా చల్లుకోవాలి

వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. నత్రజనిని కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో గానీ, యూరియా రూపంలో గానీ వాడొచ్చు. దీనిని మూడు దఫాలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో, అంకురం ఏర్పడే దశలో నత్రజనిని  అందించే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు పట్టు పెంచుకోవాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియాను పొలంలో చల్లుకోవాలి. దీనిని మూడు సమభాగాలుగా విభజించి చల్లుకోవాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకుంటే అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడొచ్చు. లేదంటే 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని గానీ కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. యూరియా అధిక వినియోగంతో అనేక అనర్థాలు ఎదురవుతాయి. యూరియా ఎక్కువైతే వరి మొక్కల ఆకుల్లో పత్రహరితం అధికంగా ఉంటుంది. ఫలితంగా పురుగులు దాడి చేస్తాయి. అగ్గితెగులు, ఆకుముడత తెగులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. 

భాస్వరం సకాలంలో అందించాలి..

మొక్కల వేర్ల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగపడుతుంది. దీనిని నాటు వేసే ముందు దమ్ములో లేదా నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్‌ ఎరువుగా వాడాల్సి ఉంటుంది.

జింకు ధాతు లోపం..

సాధారణంగా జింకులోపం చలికాలంలో, చౌడు పొలాల్లో, మురుగు సమస్య ఉన్న చేలలోనూ కనిపిస్తుంది. వరి నాటిన 2, 4 వారాల్లో జింకు లోపం కనిపిస్తుంది. ముదురు ఆకు చివరన తుప్పు మచ్చలు ఏర్పడి, ఆకులు పెళుసుగా తయారవుతా యి. జింకు లోపం నివారణకు 20 కిలోల జింకు సల్ఫేటు, ఎకరానికి చివరి దమ్ములో వేయాలి. లేకుంటే 0.2 శాతం జింకు సల్ఫేటును, నాలుగైదు రోజుల కొకసారి రెండు, మూడు పర్యాయాలు పైరు ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. జింకు సల్ఫేటును ఎలాంటి పురుగు, తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయరాదు. జింకు సల్ఫేటు పిచికారీ చేసిన తర్వాత 25 నుంచి 30 కిలోల యూరియా ఎకరానికి పైపాటుగా వేయాలి.

పచ్చిరొట్ట పైరులు..

 • జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలైన పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. ఇలా కలియ దున్నడం ద్వారా చాలా లాభాలున్నాయి.
 • nరసాయనిక ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవచ్చు
 • nసూక్ష్మ పోషక లోపాలను అరికట్టవచ్చు
 • nపైరుకు చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది
 • nభూమిలో ఎక్కువ తేమ నిలువ ఉంచవచ్చు. కలుపును నివారించవచ్చు.
 • nపంట నాణ్యత పెరుగుతుంది
 • nపశువుల ఎరువు ఎకరానికి నాలుగు టన్నులు వేయాలి
 • nభూసార పరీక్షను బట్టి సిఫారసు చేసిన ఎరువులను నిర్ధారించాలి
 • nవేయాల్సిన నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి మొదటిభాగం చివరి దమ్ములో, 2వ భాగం పిలక కట్టేదశలో, చివరి 3వ భాగం అంకురమేర్పడే దశలో వేయాలి. భాస్వరం, పొటాష్‌లను చివరి దమ్ములో వేయాలి.
 • nభాస్వరం, భాస్వరం కలిగిన కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా వేయరాదు.
 • nనత్రజని ఎరువులు బురద పదనులో వేసి తర్వాత నీరు పెట్టాలి. యూరియా చల్లిన 48 గంటల తర్వాత పొలంలో తప్పనిసరిగా నీరు పెట్టాలి.

రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి

రైతులు ప్రతి రోజూ తమ వ్యవసాయక్షేత్రానికి వెళ్లి ఎప్పటికప్పుడు పంట పరిస్థితిని పరిశీలించాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించి వారి సలహాపై తగిన మందులను వాడి సమస్యను తొలగించుకోవాలి. వరి పంటలకు పైన సూచించిన సమస్యలు కాకుండా ఇనుము లోపం కూడా రావొచ్చు. సాధారణంగా మెట్ట నారుమళ్లలోనూ, మెట్ట వరిలోనూ కనిపిస్తాయి. ఆకు, ఈనెల మధ్య పత్రహరితం లోపించి తెల్లగా మారుతుంది. నివారణకు 20 నుంచి 30 గ్రాముల అన్నభేది చూర్ణము, లేదా మూడు గ్రాముల నిమ్మ ఉప్పు లీటరు నీటిలో కలిపి పైరు బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.

-సంతోష్‌కుమార్‌, వ్యవసాయాధికారి, ఎల్లారెడ్డిlogo