శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Aug 05, 2020 , 01:58:57

పంటలకు తెగుళ్ల ముప్పు

పంటలకు తెగుళ్ల ముప్పు

ఏర్గట్ల ప్రస్తుత వానకాలం సీజన్‌లో రైతులు వివిధ రకాల పంటలను విరివిగా సాగు చేస్తున్నారు. వరి, మక్కజొన్న, సోయా, పసుపు, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పంటలకు చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

వరిలో కాండం తొలుచు పురుగు

ప్రస్తుతం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. వరి నాటే ముందు వరి నారు కొనలను తుంచి నాటు వేసుకోవాలి. వరిలో కాండం తొలుచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నివారించుకోవడానికి నాట్లు వేసే ముందు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్ల ఉత్తర, దక్షిణ దిశల్లో కాలిబాట వదులుకోవాలి. వరి నాటిన 30 రోజుల్లోపు వరిలో కాండం తొలుచు పురుగు ఆశిస్తే కార్బోప్యూరాన్‌ గుళికలు చల్లుకోవాలి. అంతేకాక వరి పంటలో సూక్ష్మపోషక లోపాలు కనిపిస్తాయి. నివారణకు మైక్రో నేచురల్‌నట్స్‌ పిచికారీ చేసుకోవాలి. 

సోయాలో..

జిల్లాలో సోయా పంటను ఎక్కువ సాగు చేస్తారు. బెట్ట వాతావరణ పరిస్థితులు, ఆలస్యంగా విత్తిన సోయా పంటల్లో కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. రైతులు అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే ఈ పురుగు ఉధృతిని అరికట్టాలి. గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు కాండంలోకి చేరి తినడంతో మొక్కలు వాడిపోయి పూర్తిగా ఎండిపోతాయి. దీని నివారణకు 1.5 గ్రాముల ఎసిఫెట్‌ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా 2.5 మిల్లీ లీటర్లు క్లోరోపైరిపాస్‌, ఒక మిల్లీ లీటరు డైక్లోరోపాస్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల లార్వాల ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యూరన్‌ 3 జీ గుళికలు ఐదు కిలోలు వేయాలి. 

మక్కజొన్నలో కత్తెర పురుగు

మక్కజొన్న పంట విడిగా లేదా పసుపులో అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఆలస్యంగా విత్తుకున్న మక్కజొన్నలో ప్రస్తుతం పచ్చరంగు, కాండం తొలిచే పురుగు, కత్తెర పురుగు ఆశిస్తుంది. మక్కజొన్న పంటలో రైతులు పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి. మక్కజొన్న పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోపాస్‌ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు నివారణకు రెండు గ్రాముల సోడియంబెంజోమెట్‌ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.