మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Aug 04, 2020 , 02:33:25

పండుగ వేళ విషాదం

పండుగ వేళ విషాదం

  • l అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తూ ఒకరు మృతి
  • l  భర్త చేతిలో మరొకరు హతం

అన్నాచెళ్లెల్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పూర్ణమి రోజున విషాదం చోటు చేసుకుంది. సోదరుడికి రాఖీ కట్టేందుకు బయలుదేరిన ఓ సోదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తన అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్తానని అడిగిన భార్యను ఉరివేసి చంపాడు భర్త. ఈ  రెండు ఘటనలు నిజాంసాగర్‌ మండలంలో చోటు చేసుకున్నాయి. 

నిజాంసాగర్‌: అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన చెల్లెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన వివరాలు... పెద్దకొడప్‌గల్‌ మండలం విఠల్‌వాడి తండాకు చెందిన రాథోడ్‌ రేణుక తన అన్న శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు భర్తతో కలిసి తాడ్వాయి మండలం నందివాడకు సోమవారం ఉదయం బైక్‌పై బయల్దేరింది.  నిజాంసాగర్‌ మండలంలోని పెద్దపూల్‌ సమీపంలో ప్రధాన రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎల్లారెడ్డి వైపు నుంచి పిట్లం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా ఢీ కొట్టింది. రేణుక లారీ వెనుక టైర్లకింద పడడంతో ఆమె తల నుజ్జునుజ్జయ్యి మృతి చెందింది. ఈ ఘటనలో రేణుక భర్త శివాజీ, రెండు నెలల కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. రేణుక మృతదేహం వద్ద భర్త శివాజీ కన్నీరుమున్నీరయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై రాజలింగం తెలిపారు. 

రోడ్డుపై గుంతల కారణంగానే ప్రమాదం.. 

భారీ వర్షాలు కురవడంతో పెద్దాపూల్‌ సమీపంలో పిట్లం వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. 

రోడ్డు గుంతలమయం కావడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. 

భార్యను ఉరేసి చంపిన భర్త 

నిజాంసాగర్‌: మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో భార్యను భర్త ఉరేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనకు సంబంధించిన వివరాలు.. గ్రామానికి చెందిన ద్యానబోయిన సవిత తన అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తానని భర్త సాయిలును ఆదివారం అడిగింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. నీకు వివాహేతర సంబంధం ఉందని, పుట్టింటికి పంపించనని గొడవపడ్డాడు. అయినప్పటికీ సవిత వెళ్తానని అనడంతో ఆదివారం రాత్రి ఆమెను చీరతో దూలానికి ఉరేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు. 


logo