సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Aug 04, 2020 , 02:33:27

ఆరోగ్యరక్ష!

ఆరోగ్యరక్ష!

  • lకొవిడ్‌-19 చికిత్సకు ప్రభుత్వం సకల వసతులు
  • lమంత్రి చొరవతో సమకూరుతున్న సదుపాయాలు
  • lజీజీహెచ్‌లో మొత్తం పడకలకు త్వరలో ఆక్సిజన్‌ సదుపాయం
  • lశరవేగంగా సాగుతున్న పనులు... రూ.68లక్షల  మంజూరుకు మంత్రి వేముల హామీ
  • l  అదనంగా 45 వెంటిలేటర్లు.. 70కి చేరనున్న సంఖ్య
  • lకరోనా చికిత్స కోసం నాలుగు ప్రైవేటు దవాఖానలకు అనుమతి

రానున్న రెండునెలలు కరోనా నియంత్రణకు కీలకం కానున్న నేపథ్యంలో.. ప్రజలకు ఆరోగ్యరక్ష కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచిన ప్రభుత్వం.. దవాఖానల్లో కొవిడ్‌-19 చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతం 25 వెంటిలేటర్లు ఉండగా వాటికి అదనంగా 45 వెంటిలేటర్లు తెప్పించారు. 200 పడకలకు రెండు రోజుల్లో ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. దవాఖానలోని అన్ని బెడ్లకూ ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన రూ.68లక్షల నిధుల మంజూరు కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కరోనా చికిత్సను  ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు నిజామాబాద్‌లోని నాలుగు ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ మనదేశంలోనూ వేగంగా వ్యాపిస్తున్నది. ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వచ్చే రెండు నెలల కాలం ఎంతో కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెబుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర  ప్రభుత్వం ప్రత్యేక వసతుల కల్పనతో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు సిద్ధమవుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ఎలాంటి లోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు జిల్లా వైద్యాధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. జిల్లా యంత్రాంగంతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వైద్య సేవల్లో, ఔషధాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ చికిత్సకు కావాల్సిన అవసరాలను స్వయంగా తెలుసుకుని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడుతూ సదుపాయాల మంజూరుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో కొద్ది రోజుల్లోనే మొత్తం బెడ్‌లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించనున్నారు.  రెండు రోజుల్లో 200 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులోకి రానుండగా, మిగిలిన వాటికోసం రూ.68లక్షల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు మంత్రి వేముల కృషి చేస్తున్నారు.

త్వరలో అన్ని బెడ్లకూ ఆక్సిజన్‌...

జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతం 25 వెంటిలేటర్లు ఉండగా వాటికి అదనంగా 45 వెంటిలేటర్లు తెప్పించారు. మొత్తం 70వెంటిలేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు ఆక్సిజన్‌ ఐసోలేషన్‌ బెడ్లు 149, ఐసీయూ బెడ్లు 48 అందుబాటులో ఉన్నాయి. వాటిని 450కి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వెంటనే రూ.68లక్షలు మంజూరు చేయించనున్నట్లు అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాకు కొవిడ్‌ చికిత్స కోసం అత్యవసర మందులైన ఫాబిఫ్లూ ఔషధాన్ని 500 స్ట్రిప్పులు, 150 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు, 20 మల్టీ మానిటరింగ్‌ మీటర్స్‌, 35 ఐసీయూ ఫోల్డర్‌ కాట్స్‌ వెంటనే పంపాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి వేముల ప్రత్యేకంగా కోరారు. మంత్రి చొరవతో జిల్లాకు మంగళవారం కొవిడ్‌ అత్యవసర మందులు చేరుకోనున్నాయి. ఇది వరకే మంత్రి వేముల జిల్లా ప్రభుత్వ దవాఖానకు కొవిడ్‌ మందులు అవసరమైతే రాత్రి వేళలో సొంత వాహనం ఏర్పాటుచేసి జిల్లాకు పంపించి పెద్ద మనసు చాటుకున్నారు. నిత్యం జిల్లా యంత్రాంగంతో టచ్‌లో ఉంటూ ఏ అవసరం వచ్చినా ఇట్టే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇబ్బందులను క్షణాల్లో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

మెరుగైన సేవలు...

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో రోజురోజుకూ కొవిడ్‌ 19 చికిత్స విధానం మెరుగైన ఫలితాలు ఇస్తున్నది. వైద్యులు, సిబ్బంది రాత్రి, పగలు కష్టపడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా  కొద్దీ వసతుల కల్పనపై సర్కారు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొదట్లో పరిమిత సంఖ్యలోనే బెడ్‌లను ఏర్పాటు చేయగా... రోజురోజుకూ వీటి సామర్థ్యాన్ని పెంచడంతో చికిత్సకు ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. ఆక్సిజన్‌ సౌకర్యం సైతం క్రమంగా అన్ని పడకలకు ఏర్పాటు చేస్తుండడంతో  లక్షణాల తీవ్రతను బట్టి  వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కోలుకుని ఇంటికి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉండగా దవాఖానలో కొవిడ్‌ పాజిటివ్‌తో చేరిన వారు అనవసరమైన ఆందోళనకు గురవుతూ వైద్యులకు తిప్పలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయి 98 శాతం వరకు ఉన్న వారు తమకు ఆక్సిజన్‌ పెట్టాలంటూ వెంటపడుతున్నట్లు సమాచారం. ఆక్సిజన్‌ స్థాయి పరీక్షించి ఫలితాలను చూపిస్తున్నప్పటికీ కొంత మంది వినడం లేదని పలువురు వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

ప్రైవేటు దవాఖానల్లోనూ కొవిడ్‌ చికిత్స

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రైవేటు దవాఖానలకు కొవిడ్‌ చికిత్సకు అనుమతులు మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు దవాఖానలకు సైతం కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు గాను అనుమతులు మంజూరైనట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకోవడానికి ఆర్థిక స్థోమత కలిగిన వారి కోసం నాలుగు ప్రైవేటు దవాఖానలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఇందులో తిరుమల, హోప్‌, మనోరమ, ప్రతిభ దవాఖానలు ఉన్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కొవిడ్‌ చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొవిడ్‌ నియంత్రణకు, కరోనా చికిత్సకు  ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని భరోసా కల్పించారు. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడే వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.


logo