శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Aug 03, 2020 , 00:21:58

శానిటైజర్లతో జాగ్రత్త

శానిటైజర్లతో జాగ్రత్త

కోటగిరి :కరోనా వైరస్‌ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్‌ రాసుకోవడం, సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా మారింది. స్నేహితులు, సన్నిహితులను కలిసి రాగానే చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం సాధారణంగా మారింది. పిల్లల చేతులను సైతం శానిటైజర్‌తో శుభ్రం చేస్తున్నారు. వంట చేసే సమయంలోనూ శానిటైజర్‌ రాసుకోవడం మరిచిపోవడం లేదు. అయితే శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం ఉందనే విషయాన్ని గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు.

మండే స్వభావం..

శానిటైజర్‌లో 50-90 శాతం ఆల్కాహాల్‌ కలిసి ఉంటాయి. అదే క్రిముల్ని చంపేస్తుంది. ఈ మిశ్రమానికి వంద డిగ్రీల కన్నా తక్కువ వేడిలోనూ మండే స్వభావం ఉంటుంది. ఇది చేతికి రాసుకున్న వెంటనే వంట గదిలోకి వెళ్లి గ్యాస్‌స్టౌ వెలిగిస్తే నిప్పు అంటుకునే అవకాశం ఉంది. దీంతో గృహిణులు చేతికి శానిటైజర్‌ రాసుకుని ఆరిన తరువాత వంట గదిలోకి వెళ్లి వంట పనులు చేయడం ఉత్తమం.

సబ్బుతో మేలు..

శానిటైజర్ల వినియోగంపై విస్తృత ప్రచారంతో పలు రకాల నాసిరకం శానిటైజర్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి వినియోగం ఎక్కువగానే ఉండడంతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. వాటి ధరలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. సబ్బు అయితే తక్కువ ధరలో లభ్యమవుతుంది. చేతులు పూర్తి స్థాయిలో శుభ్రమవుతాయి. వైద్యులు సైతం సబ్బుతోనే చేతులను శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.

శానిటైజర్లు ఎందుకంటే..?

బిజీబిజీగా గడిపే జీవితంలో చేతులు శుభ్రం చేసుకోకుండా కొన్నిసార్లు ఆహార పదార్థాలు తింటుంటారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ప్రతిరోజూ మన చేతిలో క్రిములు ఉంటాయి. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సారీ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది శానిటైజర్లను వినియోగించడం ఎక్కువైంది. ఈ హ్యాండ్‌ శానిటైజర్లని వాడిన తరువాత నీరు అవసరం లేదు. సాధారణ సబ్బు, నీరు లేకుండానే చేతులను శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడంతో చేతుల్లోని క్రిములు చాలా వరకు నశిస్తాయి. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో వీటి వాడకం మరింత ఎక్కువైంది.

పిల్లల విషయంలో..

శానిటైజర్ల వినియోగం ద్వారా సమస్యలు వస్తాయని అంతర్జాతీయ పరిశోధన సంస్థ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రీ వెన్షన్‌ సెంటర్‌ నివేదికలు సూచిస్తున్నాయి. పదేండ్లలోపు పిల్లలు శానిటైజర్‌ వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేండ్లలోపు వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి శానిటైజర్లు మేలు..

  • జిగురు, నురుగ మాదిరి కన్నా ద్రావణంగా ఉండే శానిటైజర్లు మంచివి.
  • చేతుల్లో వేసుకొని రుద్దుకున్న తర్వాత ఒక్క నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకొని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.  
  • శానిటైజర్లలో 60-90 శాతం ఆల్కాహాల్‌ ఉండాలి. అంతకన్నా తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా కొత్త సమస్యలు వస్తాయి.
  • 20-30 సెకన్లపాటు చేతులు రుద్దుకోవాలి.


logo