బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 03, 2020 , 00:21:52

అనుబంధాల రక్షాబంధన్‌

అనుబంధాల రక్షాబంధన్‌

విద్యానగర్‌ :ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలను చాటేది రాఖీ పండుగ. అనురాగ బంధాన్ని చాటుతూ ఈ పండుగ జరుపుకొంటారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ నిర్వహిస్తారు. ఇదే రోజు వేద సంరక్షణ కోసం మహావిష్ణువు హయగ్రీవ రూపంలో అవతరించిన రోజు కావడంతో హయగ్రీవ జయంతిని నిర్వహిస్తారు. రాఖీ పండుగను చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకొంటారు. 

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక..

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్‌ అని అంటారు. దీనినే సంస్కృతంలో రక్షికా పౌర్ణిమ అంటారు. రక్ష అంటే సంరక్షణ అని అర్థం. రక్షాబంధనంతోపాటు జంధ్యధారణకు ప్రత్యేకత ఉంది. ఈరోజున నూతన జంధ్యాన్ని ధరించడం ద్వారా దివ్యమైన తేజస్సు లభిస్తుందని నమ్ముతారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, అనుబంధాన్ని చాటి చెప్పే రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ రోజున సోదరీమణులు, తమ సోదరులకు రాఖీ కట్టి ఆత్మీయతను చాటిచెబుతారు. రాఖీని కట్టుకున్న తర్వాత సోదరీమణులకు బహుమతులను అందించి ప్రేమను చాటుతారు.

రాఖీ పండుగ విశిష్టత..

ఇతిహాసాల ప్రకారం.. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. దీన్ని గమనించిన ద్రౌపది తన చీర కొంగును చించి వేలికి కడుతుంది. దీనికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి అభయమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం దుశ్శాసనుడి దురాగతం నుంచి ద్రౌపదిని కాపాడుతాడు. భవిష్య పురాణంలోనూ ఈ పండుగ ప్రస్తావన ఉంది. దేవతల చేతిలో రాక్షసులు ఓడిపోతారు. తమ గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి విషయాన్ని వివరిస్తారు. దేవతల చేతికి రక్షాబంధనం ఉండడంతోనే వారు విజేతలయ్యారని కారణాన్ని తెలుసుకుంటారు. మరో పురాణగాథ ప్రకారం.. రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడు తన పరివారంతో అమరావతి వెళ్లి తలదాచుకుంటాడు. తన భర్త నిస్సహాయతను గమనించి శచీదేవి తగిన ఉపాయాన్ని ఆలోచిస్తున్న సమయంలో రాక్షసులు అమరావతిని కూడా ఆక్రమిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి తన భర్త ఇంద్రుడిని సమరోత్సాహానికి పురిగొల్పుతుంది. సరిగ్గా అదే రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులను పూజించి తన భర్త చేతికి కంకణాన్ని కడుతుంది. ఇంద్రుడు రాక్షసులను ఓడించి మూడు లోకాల ఆధిపత్యాన్ని పొందుతాడు. ఆ నాడు శచీదేవి ప్రారంభించిన రక్షా బంధనమే నేడు రాఖీ పండుగగా జరుపుకొంటున్నాం. మన దేశంలో మొగలాయి రాజులు సామ్రాజ్య పాలన ప్రారంభం నుంచి ఈ పండుగ వ్యాప్తిలోకి వచ్చింది.  

అందుబాటులో పలు రకాల రాఖీలు 

కోటగిరి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాఖీ దుకాణాలు వెలిశాయి. ఈ సంవత్సరం మార్కెట్‌లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. చిన్నారులను ఆకట్టుకునేలా గణపతి, దూదితో తయారు చేసిన రాఖీలు, రంగు రంగుల రాఖీలు, బాలు, చోటాభీమ్‌, స్పైడర్‌మాన్‌తో పాటు వివిధ రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాఖీలు విక్రయించే దుకాణాలు తగ్గాయి. మరో పక్క రాఖీలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడంలేదు. కోటగిరి మండలంలో చాలా తక్కువ సంఖ్యలో రాఖీల దుకాణాలు వెలిశాయి. 

రాఖీలకు తగ్గిన గిరాకీ

భీమ్‌గల్‌ : కరోనా వైరస్‌ ప్రభావం రాఖీల కొనుగోలుపై పడింది. గతంలో వారం రోజులు రాఖీల కొనుగోళ్లతో సందడిగా ఉండే భీమ్‌గల్‌ మండల కేంద్రం ఆదివారం కొనుగోలుదారులు లేక బోసి పోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కరోనా కారణంగా బయటికి రావడానికి జంకుతుండడంతో మార్కెట్‌ వెలవెల బోయింది.



logo