బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Aug 02, 2020 , 00:45:20

బిచ్కుంద కాలేజీ పీవీ పుణ్యమే!

బిచ్కుంద కాలేజీ పీవీ పుణ్యమే!

బిచ్కుంద: పీవీ నరసింహారావుకు కామారెడ్డి జిల్లా బిచ్కుందతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నత విద్యకోసం దారులు పరిచారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి ఉన్న సమయంలో పీవీ నరసింహా రావు ఆయన మంత్రి వర్గంలో విద్యాశాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ సమయంలో జుక్కల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సామల విఠల్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో 1970 సంవత్సరానికి ముందు పీయూసీ విద్యావిధానం అమలులో ఉండేది.

అయితే విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా పీయూసీ విద్యావిధానం రద్దుచేసి దాని స్థానంలో రెండేండ్ల ఇంటర్మీయెట్‌ విద్యావిధానం అమలులోకి తెచ్చింది అప్పటి ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఎమ్మెల్యే సామల విఠల్‌రెడ్డి కళాశాల సాధనకు నడుం బిగించారు. ఆయనకు అప్పట్లో బిచ్కుంద సర్పంచ్‌గా ఉన్న డాక్టర్‌ అనిల్‌ మల్లికార్జునప్ప షెట్కార్‌, పెద్ద కొడప్‌గల్‌ న్యాయవాది గోపాల్‌రావు అండగా నిలిచారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావును కలిసి వెనుకబడిన ప్రాంతంగా ఉన్న జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి వినతి పత్రం సమర్పించారు. కళాశాల మంజూరు చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. కళాశాల కోసం ఎమ్మెల్యే పడుతున్న తపనను పీవీ తెలుసుకున్నారు. బిచ్కుందకు కళాశాల మంజూరు చేస్తున్నట్లు పీవీ అధికార ప్రకటన చేశారు. 1970 మార్చి 3వ తేదీన విద్యాశాఖ మంత్రి హోదాలో పీవీ నరసింహారావు బిచ్కుందకు వచ్చి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించారు. కళాశాలను మంజూరు చేయడమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించడంతో అందరి మదిలో నిలిచిపోయారు.

మా అభ్యర్థనను మన్నించారు..

అప్పట్లో సర్పంచ్‌గా ఉన్న డాక్టర్‌ అలీ పెద్ద కొడప్‌గల్‌ అడ్వకేట్‌ గోపాల్‌రావు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి జూనియర్‌ కళాశాల కోసం కృషి చేశారు. 1970లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీని కలిసి కళాశాల మంజూరు చేయాలని కోరాం. మా అభ్యర్థనను ఆయన మన్నించి కళాశాల మంజూరు చేశారు. పీవీకి బిచ్కుంద ఎల్లకాలం రుణపడి ఉంటుంది.  

-మల్లికార్జునప్ప షెట్కార్‌,   కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు.


నేను చదివిన కళాశాలకు 50 ఏండ్లు

బిచ్కుందలో నేను చదివిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల 50 ఏండ్లు పూర్తిచేసుకోవడం ఆనందంగా ఉంది. 1970లో బిచ్కుందలో కళాశాల ప్రారంభించారు. నేను మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. అప్పట్లో సర్పంచ్‌గా ఉన్న మానాన్న  డాక్టర్‌ అలీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సహకారంతో జూనియర్‌ కళాశాలను సాధించడంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం నేను పిల్లల డాక్టర్‌గా హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం దేశానికే గర్వకారణం.

-షేక్‌ కలీద్‌ బహిమీద్‌, పిల్లల వైద్యుడు


logo