బుధవారం 05 ఆగస్టు 2020
Nizamabad - Aug 01, 2020 , 03:33:45

పెద్ద చెరువుకు సొబగులు

పెద్ద చెరువుకు సొబగులు

  • ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
  • రూ.2.85 కోట్లతో పనులు
  • కట్టపై రెయిలింగ్‌, మెటల్‌ రోడ్డు నిర్మాణం పూర్తి
  • మత్తడిపై ‘మినీ బ్రిడ్జి’.. బోటింగ్‌ కోసం ప్రతిపాదనలు
  • పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న ధర్పల్లి చెరువు

మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో పలు చెరువులను ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు విడుతలుగా రూ.2.85 కోట్లు మంజూరు చేసి పనులు చేపడుతున్నారు. మొదటి విడుత పనులు పూర్తి కాగా, రెండో విడుత పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 

జిల్లాలో పలు చెరువుల ఎంపిక

రూరల్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి పెద్ద చెరువు, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో రఘునాథ  చెరువు, బోధన్‌ నియోజకవర్గ పరిధిలో జాన్కంపేట్‌ చెరువుతోపాటు పట్టణ శివారులోని చెరువు, బాల్కొండ నియోజకవర్గంలో భీమ్‌గల్‌ రథం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. 

మొదటి విడుత పనులు పూర్తి

రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కృషితో మిషన్‌ కాకతీయ మొదటి విడుతలో రూ.99.70 లక్షలు, రెండో విడుతలో రూ.1.86 కోట్లు కేటాయించారు. మొదటి విడుత నిధులతో కట్ట బలోపేతం, బతుకమ్మ ఘాట్‌ నిర్మాణం, పూడికతీత, తూముల మరమ్మతు తదితర పనులు పూర్తి చేశారు. రెండో విడుత మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా కట్ట వెడల్పు, చిన్న తూము సైడు మరో బతుకమ్మఘాట్‌, కట్టపై నుంచి వాహనాలు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. కట్టపైన ఉన్న గంగమ్మ ఆలయం వద్ద పార్కింగ్‌ స్థలం ఏ ర్పాటు చేశారు. కట్టపైకి వెళ్లేందుకు మిగులు నీరు ప్రవహిం చే కాలువపై మినీ బ్రిడ్జి, కట్ట ఎక్కేందుకు రోడ్డుకు సిమెంట్‌ గోడ నిర్మాణం, ఇరిగేషన్‌ కెనాల్‌ నిర్మాణం, ఫీడర్‌ చానల్‌ ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణం తదితర పనులు చేపట్టారు.  కట్టపైన విద్యుత్‌ స్తంభాలను సైతం ఏర్పాటు చేసి లైట్లు బిగించారు. దీంతో కట్ట నూతన శోభతో కళకళ లాడుతోంది.

500 ఎకరాలకు సాగునీరు

ఇది వరకే చెరువు మరమ్మతులు చేపట్టడంతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో చెరువు కింద 500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ధర్పల్లి గ్రామం మురికి నీరంతా వచ్చి చెరువులో కలిసేది. దీంతో చెరువు నీరంతా కలుషితంగా మారేది. ప్రస్తుతం మురికి కాలువను ఏర్పాటు చేయడంతో చెరువునీరు పరిశుభ్రంగా ఉంటుంది. 

ముమ్మరంగా పనులు

ప్రస్తుతం కట్టకు రివిట్‌మెంట్‌ (కట్ట బలోపేతం కోసం రాతి ఫెన్సింగ్‌), కట్టను 6.5 మీటర్ల వెడల్పు చేస్తున్నారు. కట్టపై చెరువు నీళ్ల వైపు రెయిలింగ్‌ (కంచె) ఏర్పాటు, పర్యాటకులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు, కట్ట అలుగుపై నుంచి వాహనాల రాకపోకలు కొనసాగేలా బ్రిడ్జి నిర్మాణం కోసం అదనపు  నిధులు కావా లని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. బ్రిడ్జి నిర్మా ణం, చెరువులో బోటింగ్‌ ఏర్పాటుతో పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనున్నది.  


logo