శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 01, 2020 , 03:28:50

గాలిలో ప్రాణాలు

గాలిలో ప్రాణాలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సరిగ్గా పది రోజుల క్రితం బోధన్‌ డివిజన్‌ పరిధిలోని కోటగిరి సబ్‌ స్టేషన్‌కు వచ్చే 11కేవీ విద్యుత్‌ వైర్ల మరమ్మతులు పనులు జరిగాయి. స్థానిక లైన్‌మన్‌ లేదా జూనియర్‌ లైన్‌మన్‌ మాత్రమే ఈ  హైవోల్టేజీ విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కి పనులు చేపట్టాలి. కానీ, ఎన్పీడీసీఎల్‌ నిబంధనలకు విరుద్ధం గా క్యాజువల్‌ కూలీలను ప్రమాదకరమైన  స్తంభా న్ని ఎక్కించి పనులు చేయించారు. ఓ వ్యక్తి విద్యుత్‌ తీగలను సరి చేస్తున్నప్పుడు ఎల్‌సీ తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది. కరెంట్‌ స్తంభంపై అన్‌మ్యాన్‌ వ్యక్తి ఉన్న సమయంలోనే కరెంట్‌ సరఫరా జరిగింది. అంతే... ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ తగలడంతో క్యాజువల్‌ కూలీ స్తంభం పైనుంచి కింద పడి విలవిల్లాడిపోయాడు. జూలై 22న జరిగిన ఈ ఘటన ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌ రావు దృష్టికి వెళ్లింది. అక్రమంగా అన్‌మ్యాన్‌ వ్యక్తులతో ప్రమాదకరమైన పనులు చేయిస్తున్న సంఘటనపై ఆయ న తీవ్రంగా స్పందించి మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. సీఎండీ ఆదేశాలిచ్చి వారం రోజులు గడిచిందో  లేదో పరిస్థితి  మొదటికొచ్చింది. డీఈ, ఏఈలు ఇచ్చే ఆదేశాలతో జేఎల్‌ఎం, లైన్‌మెన్‌లు చేయాల్సి న పనులన్నీ క్యాజువల్‌ కూలీలే బిక్కుబిక్కు మం టూ చేస్తుండడం, సీఎండీ ఆదేశాలనే బేఖాతరు చేయడం విడ్డూరంగా మారింది.

ఎవరీ అన్‌మ్యాన్‌??

రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్‌ వ్యవస్థ బలోపేతమైం ది. ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను సర్కారు భర్తీ చేసింది. 24 గంటల కరెంట్‌ సరఫరాలో అంతరా యం ఉండకూడదని  రూ.వేల కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామానికి ఎన్పీడీసీఎల్‌  ద్వారా జేఎల్‌ఎం, లైన్‌మన్‌ పోస్టులను భర్తీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో సాంకేతికంగా అక్కడక్కడ ఖాళీలుండగా చిన్నపాటి రిపేర్లు చేయించేందుకు, ప్రజల వెసులుబాటు కోసం ఎన్పీడీసీఎల్‌ ద్వారా అన్‌మ్యాన్‌ లేదా క్యాజువల్‌ కూలీలను సం స్థ నియమించుకుంది. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.8వేలు వేతనం అందిస్తున్నారు. వీరికి కేటాయించిన గ్రామాల్లో ఎంతటి క్లిష్ట పరిస్థితులు దాపురించినా... స్తంభాలు మాత్రం ఎక్కకూడదనే ది ఒప్పందంలోనే స్పష్టంగా ఉంది. జేఎల్‌ఎం, లైన్‌మెన్‌లు స్తంభాలు ఎక్కిన సమయంలో క్యాజువల్‌ వర్కర్స్‌ సహాయకారిగానే వ్యవహరించాలి తప్ప వాళ్ల పని వీరు చేయకూడదు. అన్‌మ్యాన్‌ వ్యక్తులెవ్వరూ ఎన్పీడీసీఎల్‌ ఉద్యోగులు కారు. అవసరం ఉన్నన్ని రోజులు సంస్థతో అనుబంధంగా ఉంటూ పని చేస్తుంటారు.  

నిబంధనలకు విరుద్ధంగా...

విద్యుత్‌కు సంబంధించిన పనులన్నీ కన్ను మూసి తెరిచే లోపే భారీ నష్టాన్ని మిగులుస్తాయి. ప్రతీ క్షణం అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ మరపాటు అస్సలే పనికిరాదు. సుశిక్షితులైన ఎన్పీడీసీఎల్‌ ఉద్యోగులు మాత్రమే స్తంభాలు ఎక్కి తీ గలు సవరించాలి. నిబంధనలు ఇలా ఉంటే... ని జామాబాద్‌ జిల్లాలో పరిస్థితి భిన్నంగా మారింది. ప్రతీ చిన్న పనికి క్యాజువల్‌ వర్కర్లను వాడుకుంటుండడంతో తరచూ విద్యుత్‌ సేవల్లో అనేక లోపా లు తలెత్తుతున్నాయి. నిష్ణాతులైన జూనియర్‌ లైన్‌మెన్‌, లైన్‌మెన్‌లు అంతరాయం కలిగిన విద్యుత్‌ సమస్య జోలికే వెళ్లడం లేదు. డీఈ, ఏఈలు సైతం వారికి వత్తాసు పలుకుతుండడంతో ఏమీ తెలియని అమాయకులు బలవుతున్నారు. వేలకు వేలు జీతా లు తీసుకుంటున్న జేఎల్‌ఎం, లైన్‌మెన్‌లు మిన్నకుంటూ కాలం గడుపుతున్నారు.  బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

అత్యవసర సేవలపై నిర్లక్ష్యం...

విద్యుత్‌ సేవలు అత్యవసర విభాగంగా పరిగణిస్తుంటారు. ఇందులోని ఉద్యోగులంతా 24గంటల పాటు ప్రజా సేవలో నిమగ్నమై ఉండాల్సి ఉం టుంది. ఎన్పీడీసీఎల్‌లో చేరే ముందే ఫీల్డ్‌ స్టాఫ్‌ అందరూ పోస్టింగ్‌ ఉన్న చోటనే నివాసం ఏర్పర్చుకోవాలనే నిబంధనను నిర్ధేశించారు. కానీ, ఏ ఒక్క రూ స్థానికంగా నివాసం ఉండకపోవడంతో ఇటు ప్రజలకు విద్యుత్‌ అంతరాయాల సమయంలో తీ వ్రమైన ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఎస్‌ఈ స్థాయి అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తే ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉం టుంది. పర్యవేక్షణ లేమి మూలంగా కింది స్థాయి లో అంతా ఇష్టారాజ్యంగా మారింది. డీఈలు, ఏ ఈలు సైతం విధులకు సరిగా రాకపోవడంతో   జేఎల్‌ఎం, లైన్‌మెన్‌లకు జవాబుదారీతనం లేకుం డా పోయింది. ఫలితంగా అన్‌మ్యాన్‌ వంటి చిరుద్యోగులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

స్తంభాలు ఎక్కించడం ముమ్మాటికీ తప్పే : సుదర్శన్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ

అన్‌మ్యాన్‌ కూలీలతో విద్యుత్‌ స్తంభాలు ఎక్కించడం నిబంధనలకు విరుద్ధం. అనేక చోట్ల ఈ పరిస్థితులున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పక తగు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే కోటగిరిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్‌మెన్‌ను సస్పెండ్‌ చేశాం. జూనియర్‌ లైన్‌మెన్‌లు, లైన్‌మెన్‌లు గ్రామాల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి.  చిరుద్యోగులతో ఇష్టమొచ్చినట్లు పనులు చేయించినట్లుగా తేలితే మాత్రం ఊరుకునేది లేదు. కఠిన చర్యలుంటాయి.


logo