గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Aug 01, 2020 , 03:24:23

దసరాలోపే రైతువేదికలు

దసరాలోపే రైతువేదికలు

ఆర్మూర్‌ : రైతును రాజుగా చేయడమే లక్ష్యం గా  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గత సీమాంధ్ర పాలకులు దండుగా అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం, రైతు బీమా అమలు చేస్తున్నది. తాజాగా పంట ల రక్షణకు, దిగుబడుల అమ్మకాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రైతులు వారి సమస్యలను తెలుపుకునేందుకు ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి.  జూలై ఆరంభంలో నిజామా బాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, భీమ్‌గల్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాల్లో రైతువేదికల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. వేదికల నిర్మాణ పనులు  శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రైతువేదికల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ప్రత్యేక కార్యాలయం ఉండేలా అధికారులు డిజైన్‌ చేశారు. వ్యవసాయ సమగ్ర సమాచారం కోసం జిల్లాలోని క్లస్టర్లలో, క్లస్టర్‌ కేంద్రాల్లో రైతువేదికల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.  జిల్లావ్యాప్తంగా 106 రైతువేదికల నిర్మాణానికి  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ఒక్కో రైతువేదిక నిర్మాణానికి   రూ.22లక్షల నిధులను మంజూరు చేసింది. జిల్లాలోని 106 రైతువేదికలకు మొత్తం రూ.23.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, జిల్లాలోని  ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌ గుప్తా, మహ్మద్‌ షకీల్‌ ఆదేశాలతో ఈ ఏడాది దసరా వరకు రైతువేదికలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీని కోసం  కలెక్టర్‌ నారాయణరెడ్డి, వ్యవసాయాధికారి గోవింద్‌ జిల్లాలోని ఇతర అధికారులను పనులు వేగిరం చేసేలా పర్యవేక్షిస్తున్నారు.   logo