గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 30, 2020 , 03:19:19

నీటి బొట్టు.. ఒడిసి పట్టు

నీటి బొట్టు.. ఒడిసి పట్టు

ప్రతి వానాకాలం వాగుల నుంచి గోదావరి నదిలో వృథాగా కలుస్తున్న నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు, పెద్దవాగుపై మొత్తం 23 చెక్‌డ్యాములు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే తొమ్మిది చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తికాగా.. మిగతా వాటి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే 33 గ్రామాల పరిధిలోని 40 వేల ఎకరాలకు సాగునీరు లభించనున్నది. భూగర్భ జలాలు కూడా పెరుగడంతో బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. - వేల్పూర్‌ 

వేల్పూర్‌ : బాల్కొండ నియోజక వర్గం మధ్య నుంచి ప్రవహిస్తున్న కప్పలవాగు, పెద్దవాగు చెక్‌ డ్యాముల నిర్మాణంతో జీవం పోసుకోనున్నాయి. నియోజకవర్గంలో ఈ రెండు ప్రధాన వాగుల వెంట 40 వేల ఎకరాల్లో రైతులకు మేలు జరుగనున్నది. ఇప్పటికే తొమ్మిది చెక్‌ డ్యాముల నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి బోర్లు తడారిపోకుండా నిత్యం నీళ్లు పోస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. దీంతో లిఫ్టులు, ప్రాజెక్టులు, కాలువలు, ఎత్తిపోతల పథకాల పంపు హౌజుల ఆధునీకరణ ఉన్నాయి. వీటితో పాటు వాగుల వెంబడి గొలుసుకట్టుగా షేక్‌ హ్యాండ్‌ చెక్‌ డ్యాముల నిర్మాణాలు కీలకం కానున్నాయి.

రూ.60కోట్లతో చెక్‌డ్యామ్‌ పనులు.. 

దశాబ్దాలుగా ప్రతి వానకాలం వాగుల్లో నిండుగా వచ్చే వరద వృథాగా గోదావరిలో కలుస్తున్నది. దీంతో మిగతా కాలమంతా ఎడారిలా మారిపోతుండేవి. ఈ వాగుల్లో బొట్టు బొట్టునూ ఒడిసి పట్టి రైతులకు అందించాలన్న తపనతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భారీగా చెక్‌ డ్యాములు మంజూరు చేయించారు. వాటిలో తొమ్మిది చెక్‌ డ్యాములు పూర్తి కాగా మరో పది చెక్‌ డ్యాములకు మంత్రి సీఎం కేసీఆర్‌కు విన్నవించి రూ.60 కోట్లు మంజూరు చేయించారు. వాటి పనులను గత నెల 13న మంత్రి వేముల ప్రారంభించారు.

చెక్‌డ్యామ్‌ నిర్మాణాలతో 40వేల ఎకరాలకు సాగునీరు..

చెక్‌డ్యామ్‌ నిర్మాణాలతో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో 40వేల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుంది. కప్పలవాగులో మూడు చెక్‌డ్యాములు మంజూరు కాగా.. మండలంలోని అక్లూర్‌-బడా భీమ్‌గల్‌, అక్లూర్‌-మోతె, మోతె గ్రామ శివారులోని వాగుపై చెక్‌డ్యామ్‌ పనులు కొనసాగుతున్నాయి. పెద్దవాగుపై వేల్పూర్‌ మండలం కొత్తపల్లి-పచ్చలనడ్కుడ, వెంకటాపూర్‌, కుకునూర్‌, రామన్నపేట్‌, మోర్తాడ్‌ మండలం సుంకెట్‌, పాలం గ్రామాల సమీపంలోని వాగులపై చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. వీటి పనులు పూర్తయితే వాగుల పక్కన ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరగనున్నాయి. ఏడాదికి మూడు చొప్పున ఇప్పటి వరకు కప్పల వాగు, పెద్దవాగుల్లో మొత్తం తొమ్మిది చెక్‌డ్యామ్‌ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పూర్తి చేయించారు.ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. దీంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు వివరించి మరో పది చెక్‌డ్యాములకు రూ.60కోట్ల నిధులు మంజూరు చేయించారు.

23 చెక్‌డ్యాములు నిర్మాణమే లక్ష్యం.. 

కప్పలవాగు, పెద్ద వాగుపై ఇది వరకే తొమ్మిది చెక్‌డ్యామ్‌లు నిర్మాణం పూర్తికాగా మరో పది చెక్‌ డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పాతవి తొమ్మిది, కొత్తవి పది కలుపుకొని మొత్తం చెక్‌డ్యామ్‌ సంఖ్య 19కి చేరనుంది. మరో నాలుగు చెక్‌డ్యాముల మంజూరు కోసం ప్రభుత్వానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా మంజూరైతే మొత్తం రెండు వాగులపై 23 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయించడానికి మంత్రి కృషి చేస్తున్నారు. కప్పల వాగు, పెద్ద వాగుల్లో చెక్‌ డ్యామ్‌ పనులు పూర్తయితే వరద నీరు నిలుస్తుంది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లో బోర్లలో నీరు పెరుగుతుంది. వేల్పూర్‌, భీమ్‌గల్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని వివిధ గ్రామాలకు ఈ చెక్‌డ్యాములతో ప్రయోజనం కలుగుతుంది.

33 గ్రామాలకు లబ్ధి..    

బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు, పెద్దవాగు 45 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్నాయి. వీటికి ఇరువైపులా 33 గ్రామా లు ఉన్నాయి. 23 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పనులు పూర్తయితే రెండు వాగులు నీటితో నిండుతాయి. రెండు వాగుల్లో ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చెక్‌డ్యాముల నిర్మాణంతో గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో సమృద్ధిగా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. 33 గ్రామాలకు సాగునీటి లభ్యత చేకూరనున్నది.

మా గ్రామాలకు ఎంతో మేలు.. 

పెద్దవాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌తో మా గ్రామానికి ఎంతో మేలు కలుగుతుంది. భూగర్భ జలాలు పెరగడంతో తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుకునూర్‌ పెద్దవాగుపై ఇప్పటికే లిఫ్ట్‌ను నిర్మించారు. దీంతో వర్షాకాలంలో చెరువులను నింపుకొంటున్నాం. చెక్‌డ్యామ్‌ పూర్తయితే బోర్లకు ఢోకా ఉండదు.  - నవీన్‌, రైతు, కోమన్‌పల్లి. 


logo