బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jul 30, 2020 , 03:13:37

అజాగ్ర‌త్త వ‌ద్దు... హైరానా ప‌డ‌వ‌ద్దు

అజాగ్ర‌త్త వ‌ద్దు... హైరానా ప‌డ‌వ‌ద్దు

కొవిడ్‌ గురించి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అజాగ్రత్త అసలే పనికిరాదు. హైరానా అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు. రోజువారీ పనులు ఎప్పటిలా చేసుకోవచ్చు. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ ఉన్న వాళ్ల నుంచి వైరస్‌ చాలా తక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఫోకస్‌ చేయాల్సిందీ కేవలం లక్షణాలున్న వాళ్లనే. 80 శాతం మందికి లక్షణాలు ఉండట్లేదు. 15 శాతం మందికే స్వల్ప లక్షణాలు ఉంటున్నాయి. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారు 5శాతం మంది మాత్రమే. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాదు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు.. -సి.నారాయణరెడ్డి (నిజామాబాద్‌ కలెక్టర్‌)

కరోనాపై పోరులో జిల్లా స్థిరంగా, మెరుగ్గా ప్రయత్ని స్తున్నదని కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పష్టంచేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు. జిల్లా దవాఖానలో సంపూర్ణ వైద్యసాయం అందుతున్నదని, పాజిటివ్‌ వచ్చినా తగిన చికిత్స స్థానికంగానే పొందవచ్చని తెలిపారు. 42కేంద్రాల్లో కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను అందుబాటులో ఉంచామని, ఆక్సిజన్‌తోకూడిన పడకలను 600వరకు సిద్ధంచేశామని తెలిపారు. జిల్లా దవాఖానలో సేవాలోపాలున్నాయంటూ ప్రచారంలోకి వచ్చిన ఓ సెల్ఫీ వీడియో సత్యదూరమని, అలాంటివి నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు సూచించారు.

నిజామాబాద్‌  : రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష తర్వాత కొవిడ్‌ నియంత్రణలో జిల్లా మెరుగైన పనితీరును కనబరుస్తోందని నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి చెప్పారు. మీడియా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. జీజీహెచ్‌లో 60 బెడ్లకు ఐసీయూ ప్రతిపాదనలు పంపగా రెండు రోజుల్లో మంజూరయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని బెడ్ల ఏర్పాటుకు ఆర్డర్‌ పెట్టినట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం పంపిన 40 పరికరాలకు తోడుగా ఆక్సిమీటర్‌, మల్టీమీటర్లు అత్యవసరంగా తెప్పిస్తున్నట్లు వివరించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఓ కొవిడ్‌ 19 బాధితుడి సెల్ఫీ వీడియో సత్యదూరమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఆర్మూర్‌లో కొవిడ్‌ కోసం ఉన్న 30 పడకల సౌకర్యాన్ని మున్ముందు వంద పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. వైరస్‌ సోకి ఇంట్లోనే ఉన్న వారందరికీ రెండు రోజుల్లో ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, పారాసిటమాల్‌, దగ్గు మందు, అజిత్రోమెసిన్‌, విటమిన్‌ సీ, విటమిన్‌ డీ, జింక్‌ టాబ్లెట్స్‌ ఇందులో ఉన్నాయన్నారు. ర్యాపిడ్‌ టెస్టులు మరిన్ని పెంచబోతుండగా... ప్రస్తుతం 32 పీహెచ్‌సీల్లోనే జరుగుతోన్న ర్యాపిడ్‌ పరీక్షలను జిల్లాలోని 10 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. కలెక్టర్‌ తెలిపిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఆందోళన వద్దు.. 

కొవిడ్‌పై జిల్లా ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అజాగ్రత్త అసలే పనికి రాదు. జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం ఉండదు. హైరానా అవసరం లేదు. రోజువారీగా పనులు చేసుకోవచ్చు. జాగ్రత్తల్లో మూడు రకాలు. త్రీ లేయర్‌ మాస్కుతో చాలా ప్రొటెక్షన్‌ లభిస్తుంది. రిస్కీ ఏరియాలో ఎన్‌95 మాస్కు వాడాలి. భౌతికదూరం పాటించాలి. సెల్ఫ్‌ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు పాటుపడాలి. వాకింగ్‌ చేయడం, ఉఛ్వాస, నిఛ్వాసలను క్రమపద్ధతిలోకి తెచ్చుకునేలా ప్రయత్నించాలి. ప్రాణాయామం, యోగాసనాలు చేయాలి. వేడి నీళ్లు, విటమిన్‌ సీ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. పొద్దున్నే ఎండలో ఉంటూ విటమిన్‌ డీ పొందాలి. జింక్‌ ఉన్న ఫుడ్‌ తీసుకోవాలి. గుడ్డులోని పచ్చి సొనలో విటమిన్‌ డీ ఉంటుంది. ఇవీ పాటిస్తే రెగ్యూలర్‌గా పని చేసుకోవచ్చు. భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళా వైరస్‌ సోకినా చిన్నపాటి లక్షణాలతో బయటపడొచ్చు. ప్రాణాపాయం ఉండబోదు.

భయం చాలా చెడ్డది.. 

కొవిడ్‌ 19 నియంత్రణకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాము. వారి పరిశోధన వివరాల మేరకు పని చేస్తున్నాము. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్‌ ఉన్న వాళ్ల నుంచి వైరస్‌ చాలా తక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఫోకస్‌ చేయాల్సిందీ కేవలం లక్షణాలున్న వాళ్లనే. వంద మందిలో 80 మందికి లక్షణాలు ఉండవు. 15 శాతం మందికే చిన్నపాటి లక్షణాలు ఉంటున్నాయి. మిగిలిన వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాదు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. భయం చాలా చెడ్డది. వాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలందరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు సాగుదాం. ఆశవర్కర్లు భయాన్ని పక్కన పెట్టి పని చేస్తున్నారు. వాళ్లందరి సేవలను కొనియాడాల్సిన అవసరం ఉంది. వైరస్‌ సోకిన వారు ప్రభుత్వం చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ కాదు.

వైరస్‌తోనే పోరాటం..

చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇంటి పక్కన ఒకరికి వైరస్‌ వచ్చిందని ఫిర్యాదు చేస్తున్నారు. ఇంట్లో వారికి వైరస్‌ వచ్చినా ఏమీ కాదు. వైరస్‌ వచ్చిన వారికి నైతికంగా సపోర్టు చేయండి. ఒకే ఇంట్లో ఉంటూ కరోనా బాధితుడికి సాయం చేసినా ఏమీ కాదు. మన పోరాటం రోగితో కాదు. లక్షణాలు లేని వారు టెస్టులు చేయాలని వస్తున్నారు. అనవసరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి నిజమైన బాధితులకు ఇబ్బంది సృష్టించొద్దు. జీజీహెచ్‌లో అమర్చిన ట్రూనాట్‌, సీబీనాట్‌ యంత్రాలు లక్షణాలు లేని వారికి పని చేస్తాయి. మంత్రి ఆదేశాల మేరకు సొంతింట్లో సౌకర్యం లేని వారికి జిల్లాలో మూడు క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. కరోనా ఒక్కటే కాకుండా మిగిలిన జబ్బులు ప్రాణాలు తీసేవి ఉంటాయి. టీబీ, ఎయిడ్స్‌, లెప్రసీ, ఇతర వ్యాధిగ్రస్తులకు 104 ద్వారా ఇంటికెళ్లి మందులను అందిస్తున్నాము. పిల్లలకు వాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము.

సెల్ఫీ వీడియో సరికాదు..

ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో మంగళవారం కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వ్యక్తి తీసిన సెల్ఫీ వీడియో సరైంది కాదు. ఆయనకు శ్వాస ప్రక్రియ సరిగా ఉండడంతో వైద్యులు ఆక్సిజన్‌ అమర్చలేదు. అతను అనవసరంగా టెన్షన్‌కు గురై సెల్ఫీ వీడియోను బయటికి పంపిచాడు. అతడు హ్యాపీగా ఉన్నాడు. వివరాలు తెలుసుకోకుండా మాధ్యమాల్లో వీడియో ప్రసారం చేశారు. కరోనా విషయంలో ప్రతీ అంశాన్ని చాలా క్లోజ్‌గా మానిటరింగ్‌ చేస్తున్నాము. సిస్టమ్‌పై అపనమ్మకాన్ని క్రియేట్‌ చేస్తే సమాజానికి ఇబ్బంది కలుగుతుంది. ఇంట్లో ఉంటే పరిస్థితి చేయి జారుతుంది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కరోనా నివారణకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు వాడుతున్నాము. జిల్లాలో ఆయా ప్రభుత్వ దవాఖానల్లో 600 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది.

 logo