మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jul 29, 2020 , 03:03:22

అర్వింద్‌ ఎక్కడ...?

అర్వింద్‌ ఎక్కడ...?

  • సోషల్‌ మీడియాలో  ఎంపీపై జోరుగా ట్రోలింగ్‌
  • కరోనా కష్టకాలంలో పత్తా లేని బీజేపీ ఎంపీ !
  • ఆయన తీరుపై నెటిజన్ల కామెంట్లు..కార్యకర్తల ప్రశ్నలు
  • క్లిష్ట సమయంలో జనం మధ్య లేడంటూ విసుర్లు
  • జవాబివ్వని పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌

కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.   విపత్కర పరిస్థితుల్లో  అండగా నిలవాల్సిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌  మాత్రం కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. దీంతో రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ‘మా ఎంపీ ఎక్కడ’? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ‘కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య ఉండాల్సిన మీరు... ఎక్కడికెళ్లారు? మీకు ఏమైంది సారూ?’ అంటూ పోస్టులు కుప్పులు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వందలాది మంది నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆయన నుంచి స్పందన లేదు. 

మరోవైపు కరోనా కాలంలోనూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. టెలీ, వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు నిర్వహిస్తూ ప్రజల సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఎడారి దేశాల్లో అవస్థలు పడుతున్న ఎంతో మందిని స్వగ్రామాలకు చేరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కనిపించని శత్రువు కరోనా వైరస్‌ రోజురోజుకూ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నది.చాపకింద నీరులా పెరుగుతున్న కరోనా కేసులతో జనమంతా జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఎవరికి వారు ఆందోళనకు గురవుతూనే స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. గతంలో కనీవిని ఎరుగని రీతిలో సమస్యను యావత్‌ దేశం ఎదుర్కొంటున్నది. ఈ పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలంతా ప్రజల్లో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. జన సమూహంలోకి వెళ్లకుండానే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. పరిమిత సంఖ్యలో అధికారులతో సమీక్షలు, సమావేశా లు నిర్వహిస్తూ మేమున్నామంటూ... భరోసా ఇస్తున్నారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఓ వైపు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉంటూ ప్రజల కు, యంత్రాంగానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం నేనున్నానంటూ... సోషల్‌ మీడియా వేదికగా వచ్చే విన్నపాలకు తక్షణం స్పందించి ఆపన్న హస్తం  అందిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నిజామాబాద్‌ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న ధర్మపురి అర్వింద్‌  కొంత కాలంగా జనా ల్లో కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతున్నది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు #WhereisnzbMP హాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తు న ట్రోలింగ్‌ నడుస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నెటిజన్లే ఎంపీ ఎక్కడంటూ ప్రశ్నిస్తుండడంతో బీజేపీ నేతలంతా అవాక్కవుతున్నారు.

ట్రోలింగ్‌తో ఉక్కిరిబిక్కిరి...

నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ తీరుపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర ట్రోలింగ్‌ జరుగుతున్నది. గడిచిన రెండు రోజుల నుంచి మా ఎంపీ ఎక్కడంటూ ప్రశ్నల పరంపర వెల్లువెత్తుతున్నది. పది రోజులుగా సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌ చానళ్లలో, టీవీల్లో, కనీ సం నిజామాబాద్‌ జిల్లాలో, లేదంటే హైదరాబాద్‌లో, బీజేపీ కార్యాలయంలో ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన అభిమానులు చాలా మంది ఆరా తీయడం మొదలు పెట్టారు. కరోనా కష్టకాలంలో ప్రజల మధ్య ఉండాల్సిన మీరు... ఎక్కడికెళ్లారు? మీకు ఏమైంది సారూ? అంటూ  పోస్టులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఫేస్‌బుక్‌ తెరిస్తే చాలు  వేర్‌ఈజ్‌ నిజామాబాద్‌ ఎంపీ అనే కనిపిస్తోంది. ఈయనతో పాటుగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేరిట ట్రోలింగ్‌ మొదలైంది. పార్లమెం ట్‌ సమావేశాలు నడుస్తలేవు. బీజేపీ ఆత్మనిర్భర్‌ సమావేశాలు లేవు. ఇలాంటి సమయంలో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించొచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నా రు. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు,  అనుచరులు చేస్తోన్న ట్రోలింగ్‌ పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నుంచి స్పందన రాలేదు.

పత్తా లేని ఎంపీ...

నిజామాబాద్‌ జిల్లాకు జూన్‌ 26న దిశ(జిల్లా అ భివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) మీటింగ్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ హాజరయ్యారు. ఇంతటి కరోనా క్లిష్ట సమయంలో నిజామాబాద్‌ జిల్లా ముఖమే ఆయన చూడలేదు. నెల రోజులవుతున్నా ఎంపీ అర్వింద్‌ ఇప్పటి వరకు ఇటువైపే రాలేదు. దిశ మీటింగ్‌ తర్వాత జూలై 3న ఓ యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వ్యూలో ఎంపీ కనిపించారు. పసుపు రైతులు ఎవరూ తనకు ఓటు వేయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రైతన్నలు తీవ్రంగా ఆగ్రహించారు. జూలై 12న వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన బీజేపీ ఆత్మనిర్భర్‌ కార్యక్రమానికి హాజరయ్యా రు. అక్కడా స్థానిక లీడర్లపై నోరు పారేసుకోవడంతో నిజామాబాద్‌ ఎంపీకి ఓరుగల్లు సెగ తగిలింది. ఆ తర్వాతి నుంచి ఇటు సోషల్‌ మీడియా లో, నిజామాబాద్‌ జిల్లాలో, బీజేపీ కార్యక్రమా ల్లో ఎక్కడా ఎంపీ కనిపించక ఆయన అభిమానులు ప్రశ్నలు వేయడం, ఆయన కోసం వెతకడం మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీ ఎక్కడికి పోయాడు? యాడున్నా డు? అనే ప్రశ్న సర్వత్రా ఆసక్తి రేపుతున్నది.

ప్రజల్లో గులాబీ సైన్యం...

టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నాయకులంతా కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన సౌకర్యాలపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేటీఆర్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఐదు అంబులెన్సులు జిల్లాకు తె ప్పించేలా నేతలంతా నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎంపీ కవిత సైతం గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. వ్యయ ప్రయాసాలకోర్చి అనేక మందిని సొంతూరికి చేర్చారు. క్లిష్టమైన కరోనా కాలంలోనూ మానవత్వాన్ని చాటుతూ ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నారు. కరోనాను జయించిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సైతం టెలి కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వారి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అభాగ్యులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇప్పిస్తూ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఊరట కలిగిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో, కరోనా నియంత్రణ సమావేశాల్లో పా ల్గొంటూ ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, ఆశన్నగా రి జీవన్‌ రెడ్డి, షకీల్‌ అహ్మద్‌, సురేందర్‌ త మవంతు పాత్రను పోషిస్తున్నారు. స్పీకర్‌ పో చారం శ్రీనివాస రెడ్డి సైతం బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్‌ ఇండ్ల నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. కరోనా కట్టడిపై యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందిస్తుండడం విశేషం.


logo