గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 26, 2020 , 02:02:17

కరోనాపై జంగ్‌ సైరన్‌ మోగిస్తోన్న అత్యవసర సేవకులు

కరోనాపై జంగ్‌ సైరన్‌ మోగిస్తోన్న అత్యవసర సేవకులు

  • l ప్రాణాలకు తెగించి పనిచేస్తోన్న వైద్యులు, 108 సిబ్బంది 
  • l డేంజర్‌ జోన్‌లోనూ కష్టే ఫలి అంటోన్న ఆశ, అంగన్‌వాడీలు 
  • l రేయింబవళ్లు ప్రజలకు రక్షణగా నిలుస్తోన్న ఖాకీలు 
  • l కొవిడ్‌ దవాఖానల్లో అన్నీ తామై చూసుకుంటున్న కింది స్థాయి సిబ్బంది 
  • nపోలీసులకు సరికొత్త సవాల్‌..
  • nఫ్రెండ్లీ పోలీసింగ్‌కు లాక్‌డౌన్‌  ఒక గొప్ప అవకాశం
  • n లాక్‌డౌన్‌లో పోలీసుల్లో  పరిమళించిన మానవత్వం 
  • n వలస కార్మికులకు భోజనాల  ఏర్పాటుకు కృషి 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అందుబాటులో ఉన్నప్పటికీ.. మనిషి తన ఘనతను ఢంకా బజాయించి చెప్పుకుంటున్నా... నేడు

ప్రపంచమే కంటికి కనిపించని శత్రువుతో కనీవినీ ఎరుగని ఉపద్రవాన్ని ఎదుర్కొంటోంది. అన్ని దేశాలు 

మాయదారి కరోనా వైరస్‌తో నిరాటంకంగా 

పోరాటమే చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను 

కాపాడుకోవడం కోసం ఓ రకంగా వైద్యంతో బాంబులు లేని యుద్ధం చేస్తున్నాయి. రోజురోజుకూ కొంగొత్తగా అవతారాలను మార్చుకుంటోన్న కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శత విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొవిడ్‌ 19ను 

ఎదుర్కొనేందుకు వైద్యులు, పారామెడికల్‌, 108 అంబులెన్సు సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రాణాలను సైతం లెక్కచేయక 

పనిచేస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తిని కుటుంబసభ్యులే పట్టించుకోని దయనీయ పరిస్థితిలో.. అన్నీ తామై కొండంత అండగా నిలిచి సేవలు అందిస్తున్నారు. కొవిడ్‌-19 బాధితుల కోసం వైద్యులు, వైద్య సిబ్బంది సైతం తమ వారందరికీ దూరంగా ఉంటూ సేవలు చేస్తున్నారు. ప్రత్యక్ష దేవుళ్లుగా నిలుస్తూ సమస్త ప్రజానీకానికి కొండంత ధైర్యంగా నిలుస్తున్నారు.

- నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

బోధన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వివిధ దశల లాక్‌డౌన్‌ను తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్‌ డివిజన్‌లో స్థానిక పోలీసులకు సరికొత్త సవాల్‌గా మారింది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడంలో పోలీసులు చూపిన చొరవ ఫలితంగా సరిహద్దులో కట్టడి పకడ్బందీగా అమలయింది. మహారాష్ట్రకు సరిహద్దులో ఉండడంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.  మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మన ప్రాంతం కన్నా ఎక్కువగా విజృంభిస్తుండడంతో.. సరిహద్దులో లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో పోలీసులు మరింతగా కష్టపడ్డారు. ఓ వైపు తమ విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు  రోగులు, గర్భిణులను దవాఖానలకు తరలించడం, కరోనాపై అవగాహన కల్పించడం, వలస కార్మికులకు భోజనాలు పెట్టడం తదితర సేవా కార్యక్రమాలు నిర్వర్తించారు. జనతా కర్ఫ్యూ, మే మొదటివారం వరకు కొనసాగిన సంపూర్ణ లాక్‌డౌన్‌లో పోలీసులు ఎన్నో కష్టాలను అనుభవించారు. గతంలో ఎన్నడూలేని కొత్త అనుభవాలు ఈ లాక్‌డౌన్‌లో పోలీసులకు ఎదురయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితమైన పోలీసులు లాక్‌డౌన్‌లో ఆరోగ్య కార్యకర్తలుగా వ్యవహరించారు. లాక్‌డౌన్‌లో పోలీసుల్లో మానవత్వాన్ని ప్రజలు కళ్లారా చూశారు. 

యంత్రాంగం ఉరుకులు..  పరుగులు..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు విశేషంగా పనిచేస్తున్నారు. మహారాష్ట్రతో సంబంధం కలిగి ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ కరోనా వాహకాలుగా మారిన పొరుగు రాష్ట్ర వాసులను ఆదిలోనే అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం అడుగడుగునా అప్రమత్తమై ప్రభుత్వ కార్యకలాపాలను క్లిష్ట సమయంలోనూ ముందుకు తీసుకెళ్తున్నది. ప్రజల మేలు కోసం ప్రజల్లో తిరుగుతూ పని చేస్తోన్న రెవెన్యూ ఉన్నతాధికారులూ కొవిడ్‌ -19 బారిన పడుతున్నప్పటికీ మిగిలిన వారు భయపడకుండా ప్రజాసేవలో తరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ డివిజన్‌ అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పలువురు వీఆర్వోలు, వీఆర్‌ఏలు సైతం ఈ మహమ్మారి బారిన పడి కోలుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయడం, గ్రామాల్లో అనుమానితులు, పాజిటివ్‌ సోకిన వారుంటే గుర్తించడంలో రెవెన్యూ వ్యవస్థ పకడ్బందీగా పనిచేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారనేది గుర్తించేలా ఏర్పాట్లు చేసుకుని అప్రమత్తంగా ఉంటున్నారు. 

108 సిబ్బంది సేవలు అనితరసాధ్యం

డిచ్‌పల్లి : కొవిడ్‌ -19 నియంత్రణలో తమ ప్రాణాలను లెక్కచేయక 108 అంబులెన్సు పైలెట్లు, ఈఎంటీలు అలుపెరుగని సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా నియంత్రణలో శ్రమిస్తున్న ఇతర శాఖల సిబ్బందితో సమానంగా 108 సిబ్బంది సేవలందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులను, అనుమానితులను కోవిడ్‌ ప్రత్యేక దవాఖానలకు, ప్రైమరీ కాంటాక్టులను క్వారంటైన్‌లకు తరలించడంలో వీరు ఐదు నెలలుగా అనితరసాధ్యమైన సేవలు అందిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో అత్యవసరంగా సేవలందించే 108 అంబులెన్సులు 16 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్‌లో కొవిడ్‌-19 సేవలకు పంపించగా, ప్రస్తుతం 15 వాహనాలు ఉన్నాయి. ఇందులో 80 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 12 అంబులెన్సులుంటే ఒకటి హైదరాబాద్‌ కొవిడ్‌ -19 కోసం తరలించారు. 11 అంబులెన్సుల ద్వారా 58 మంది సిబ్బంది ప్రజల సేవలో పనిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వీరిపై తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతున్నది. అయినప్పటికీ అలసట లేకుండా పని చేస్తున్నారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు వాడుతూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఎప్పటి మాదిరిగా ఇతర సేవలూ అందిస్తున్నారు. సెల్‌ఫోన్‌ నుంచి వచ్చే కాల్‌ మేరకు దూరం ఆధారంగా నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. 

కరోనాతో పోలీసుల పోరాటం.. 

కరోనా పోరులో ముందున్న పోరాట యోధుల్లో పోలీసు శాఖది కీలక పాత్ర. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను ఇండ్లకే పరిమితం చేసి వైరస్‌ వ్యాప్తిని నియంత్రించిన ఘనత పోలీసులదే. రేయింబవళ్లు కష్టపడి చెమటోడ్చిన ఖాకీలనూ కరోనా భూతం వెంటాడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఉమ్మడి జిల్లాలో పోలీసు సిబ్బందినీ వదలడం లేదు. లాక్‌డౌన్‌ సమయం నుంచీ కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమించిన ఖాకీలకు కరోనా రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రజలతో మమేకమవుతూ ప్రజల సంరక్షణకు కరోనాతో పోరాడుతున్న పోలీస్‌ సిబ్బంది చివరికి వైరస్‌ బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కరోనా బారినపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులతో పాటు వారి కుటుంబాలకు కరోనా సోకడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కేసులు విజృంభిస్తుండడంతో పోలీసుల ముందస్తు రక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

కుటుంబమే దూరం... వాళ్లే సర్వస్వం...

ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ సోకిందంటే ఆయన ఇతరులతో దూరంగా ఉండాల్సిందే. లేదంటే వైరస్‌ వ్యాప్తి చెంది ఇతరులకు ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువ. వందలాది మంది కొవిడ్‌ -19 బాధితులు దవాఖానలకు ఒంటరిగా చికిత్స కోసం వస్తున్నారు. కుటుంబాన్ని, దగ్గరి వాళ్లను వదిలి దవాఖానకు వచ్చే వారికి కింది స్థాయి సిబ్బందే సర్వస్వం. కంటికి రెప్పలా కరోనా బాధితులకు సేవ చేయడం, సమయానికి పౌష్టికాహారం, మందులు అందించడంలో నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది పనితనం అసాధారణం. కరోనా లక్షణాలుంటేనే కిలోమీటరు దూరం పారిపోతున్న సమయంలో కరోనా దవాఖానలో, బాధితుల వార్డులో పనిచేయడమంటే వారి మానవీయతకు రెండు చేతులతో నిండుగా నమస్కరించడం మనందరి కనీస ధర్మం. కుటుంబంలేని లోటును తీరుస్తూ.. ఆప్యాయంగా అన్నింటికీ మేమున్నామంటూ బాధితుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు.

వైద్యులే ప్రత్యక్ష దైవాలు...

గతేడాది నవంబర్‌లో చైనాలో వెలుగుచూసిన కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచమంతటా విజృంభిస్తున్నది. అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేసిన ఈ వైరస్‌తో వేలాది మంది రోజూ ప్రాణాలు వదులుతున్నారు. ఎదుటి వ్యక్తిని కలవడానికే భయపడుతున్న సందర్భంలో కరోనా సోకిన వ్యక్తులకు వైద్యం అందించడం అంటే సాధారణ విషయమేమీ కాదు. వైద్యులు మాత్రం తమ కుటుంబాలను వదిలి, ప్రాణాలకు తెగించి ప్రజలకు ఊపిరి పోస్తున్నారు. కరోనా లక్షణాలతో కనిపించే వ్యక్తులతో నేరుగా మాట్లాడడం, వారికి పరీక్షలు చేయడం, పాజిటివ్‌ తేలితే చికిత్స అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాత్ర అమోఘం. వైద్యులే సమస్త మానవాళికి ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు. అన్ని మతాలకు చెందిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులే మూతపడి తెరుచుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ వేళ.. దవాఖానలే తెరుచుకుని ప్రజాసేవలో తరిస్తున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ దవాఖానల్లో 24 గంటల పాటు కరోనా బాధితుల కోసం డాక్టర్లు కంటికి కనుకులేకుండా పనిచేస్తున్నారు. వీరికి పారామెడికల్‌ సిబ్బంది తోడుగా నిలుస్తున్నారు.

ఇష్టమైన వృత్తిని సంతోషంగా చేస్తున్నాం 

వైద్యవృత్తిని ఇష్టంగా ఎంచుకున్నాను. అందుకే కరోనా రోగులకు కూడా సంతోషంగా సేవ చేస్తున్నాను. కరోనా వచ్చిన వారి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడం ద్వారా వారిలో కనిపించే నమ్మకం చాలా సంతోషాన్ని ఇస్తున్నది.  మేము సూచించిన సలహాలను పాటించి కరోనాను జయించినప్పుడు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రతిఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. 

- ఇందిర, ఏఎన్‌ఎం, ఎల్లారెడ్డి

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్నాం. తప్పకుండా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచిస్తున్నాం.  నిర్లక్ష్యం వహిస్తే కుటుంబం మొత్తం కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త చర్యలు తప్పక పాటించాలి. 

- గౌరేందర్‌గౌడ్‌,  ఎస్సై,  

ఆరో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌, నిజామాబాద్‌
logo