శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 25, 2020 , 00:35:04

పంచాయతీలకు సేంద్రియ సిరులు

పంచాయతీలకు సేంద్రియ సిరులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ఒకవైపు అభివృద్ధిలో దూసుకుపోతుండగా, మరోవైపు  స్వచ్ఛగ్రామాలుగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్ల నిర్మాణం తలపెట్టింది.  గ్రామంలో సేకరించిన చెత్త ద్వారా కంపోస్టు ఎరువును తయారు చేయడంతో గ్రామపంచాయతీకి అదనపు ఆదాయం చేకూరే విధంగా కంపోస్టుషెడ్లను  నిర్మించారు. నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామపంచాయతీలకు గాను 410 గ్రామాల్లో  కంపోస్టుషెడ్ల నిర్మాణాలు పూర్తికాగా మిగతా గ్రామాల్లో చివరిదశలో ఉన్నాయి. కంపోస్టు షెడ్‌ నిర్మాణాలు పూర్తికావడంతో తడిచెత్త ద్వారా కంపోస్టు తయారుచేసే దిశగా చర్య లు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కంపోస్టు తయారు చేయడం ప్రారంభించారు.  -మోర్తాడ్‌ 

మోర్తాడ్‌ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పె ద్ద పీట వేస్తున్నది. పల్లెల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ఇందులో భా గంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖ లు మారిపోయాయి.  పల్లె ప్రగతిలో భాగంగా కం పోస్టు షెడ్ల నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం కంపోస్టుషెడ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో కంపోస్టు తయారు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో మహిళలకు ఐకేపీ ద్వారా తడి, పొడి చెత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్తను ఏవిధంగా వేరు చేయాలో మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పంపిణీ చేసిన చెత్తబుట్టల్లో ఒకదాంట్లో తడిచెత్త, మరో దాంట్లో పొడిచెత్త వేయాలని, గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ వచ్చినపుడు చెత్త ను వేర్వేరుగా అందించాలని అవగాహన కల్పిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను కంపోస్టుషెడ్డు వద్ద మళ్లీ వేరు చేసి చెత్త కోసం కేటాయించిన కుండీల్లో వేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఇం టింటికి తిరుగుతూ తడి, పొడి చెత్త గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు.

కంపోస్టు తయారీ

జిల్లాలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కంపోస్టు తయారీ ప్రారంభమయ్యింది. కంపోస్టుషెడ్లలో కం పోస్టు తయారీ కోసం ఏర్పాటు చేసిన రెండు వేర్వే రు కుండీల్లో తడిచెత్త వేసి కంపోస్టు తయారు చేస్తున్నారు. ఇప్పటికే కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్‌, ఆర్మూర్‌ మండలంలో ఈవిధానంలో కంపోస్టు తయారీ ప్రారంభమయ్యింది. కంపోస్టు తయారీ కోసం నిర్మించిన కుండీల్లో ముందుగా మట్టి వేసి, ఆపై పేడ, తడిచెత్త, చెట్ల ఆకులు లేయర్లుగా వేసి ఉంచుతారు. నెల రోజుల్లో ఇది సేంద్రి య ఎరువుగా మారుతుంది. దీన్ని తొలగించి మళ్లీ ఇదే విధానంలో సేంద్రియ ఎరువును తయారు చే స్తారు. ఈ విధంగా తయారు చేసిన సేంద్రియ ఎరువును గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విక్రయించవచ్చు లేదా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పెంచుతున్న మొక్కలకు వినియోగించుకోవచ్చు. గ్రామా ల్లో సేంద్రియ ఎరువు వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రియ ఎరువును తయా రు చేయడం వల్ల గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరే అవకాశాలు ఏర్పడ్డాయి.

రీసైక్లింగ్‌కు పొడిచెత్త

ట్రాక్టర్‌ ద్వారా సేకరించిన పొడిచెత్తను రీసైక్లింగ్‌ కో సం విక్రయిస్తారు. దీని ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపోస్టుషెడ్‌ వద్దకు చేరుకున్న పొడి చెత్తలో కాంచు, ప్లాస్టిక్‌, అట్టలు ఈ విధంగా వేరు చేస్తారు. వాటి కోసం కేటాయించిన కుండీల్లో వేస్తారు. రీసైక్లింగ్‌ కోసం వీటిని విక్రయిస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించకుండా ఉండడంతో పాటు గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే ఈవిధానంలోకి గ్రామాలు వస్తున్నాయి. 

పర్యావరణ పరిరక్షణ

గ్రామంలో ఎక్కడబడితే అక్కడ చెత్త కనిపించకపోవడం, మురుగు ప్రదేశాలు ఏర్పడకపోవడం వంటి పరిస్థితులు గ్రామాల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రతి రోజు చెత్త బండిని గ్రామంలో తిప్పుతూ చెత్త సేకరిస్తున్న కారణంగా గ్రామాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. చెత్తను ఎక్కడా  పారేయకుండా చర్యలు తీసుకోవడం కారణంగా పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుంది.  

కంపోస్టు తయారీ ప్రారంభమయ్యింది

కొన్ని గ్రామాల్లో కంపోస్టు తయారీ ప్రారంభమయ్యింది. ఇప్పటికే 80శాతం కంపోస్టుషెడ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తయ్యాయి. అవగాహన లేని వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాల్లో తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాం.

- శ్రీనివాస్‌, డీఎల్‌పీవో

కంపోస్టు తయారీకి సిద్ధమయ్యాం

గ్రామంలో కంపోస్టుషెడ్‌ నిర్మాణం పూర్తయ్యింది. కంపోస్టుతయారీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. త్వరలో కంపోస్టు తయారీ చేయడం ప్రారంభిస్తాం. ఇప్పటికే వచ్చిన చెత్తను వేరుచేయిస్తూ కుండీల్లో వేయిస్తున్నాం. -గడ్డంచిన్నారెడ్డి, సర్పంచ్‌ తిమ్మాపూర్‌


logo