మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jul 24, 2020 , 01:45:54

ఇందూరు సిగలో ఐటీ కిరీటం

ఇందూరు సిగలో ఐటీ కిరీటం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌ నుంచి ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోతాయని సమైక్యవాదులు సృష్టించిన భయాలు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత పటాపంచలు అయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులను సాధిస్తున్నది. మల్టీ నేషనల్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. గతంలో ఉన్న  సంస్థలు తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కృషితో భాగ్యనగరానికి ఐటీ ఇమేజ్‌ రెట్టింపు అవుతోం ది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మరోవైపు ఐటీ సెక్టార్‌ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకూ విస్తరిస్తున్నది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ ఐటీ టవర్‌ను మంజూరు చేయగా పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్‌ ఐటీ టవర్‌ను ప్రారంభించడంతో జిల్లాకు చెందిన యువతలో ఆసక్తి పెరుగుతున్నది. 

ద్వితీయ శ్రేణి నగరాలకు..

మంత్రి కేటీఆర్‌ చొరవతో రాష్ట్రం ఆరేండ్లలో పారిశ్రామిక అభివృద్ధి రాకెట్‌ వేగంతో దూసుకువెళ్తున్నది. ఆకర్షణీయమైన, అనుకూలమైన పారిశ్రామిక విధానాల కారణంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పరిశ్రమలు, ఐటీ సంస్థలు వరుస కడుతున్నాయి. ఈ దశలోనే తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల పెట్టుబడులను జిల్లాలకు మళ్లించడంపై దృష్టి సారించింది. నిజామాబాద్‌ జిల్లాలో నూ ఐటీ సంస్థల కార్యకలాపాలు కొద్ది కాలంలోనే ప్రారంభమై స్థాని క యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. తాను ఎంపీగా ఉన్నప్పుడే కవిత నిజామాబాద్‌ నగరంలోని నూతన కలెక్టరేట్‌ ప్రాంతంలో ఐటీ హబ్‌కు మూడున్నర ఎకరాల భూమిని కేటాయించారు. సువిశాల ప్రాంతంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సవాల్‌గా తీసుకుని ఐటీటవర్‌ను సకాలంలోనే నిర్మించేలా కృషి చేస్తున్నారు.

49వేల చదరపు అడుగుల విస్తీర్ణం..

నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్‌కు కేటాయించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, నిజామాబాద్‌ నగరాభివృద్ధిని అంచనా వేసుకుని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. రూ.25కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడంతో 2018, ఆగస్టు 1వ తేదీన ఐటీ టవర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఐటీ టవర్‌ను 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో టవర్‌ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం ఎకరం భూమి విస్తీర్ణంలో ఐటీ టవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతుండగా, భవిష్యత్‌లో ఐటీ టవర్‌ను విస్తరించేందుకు మిగతా 2.5 ఎకరాల భూమిని వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం పార్కింగ్‌, లాన్‌, ఇతర సౌకర్యాలకోసం ఖాళీ స్థలాన్ని వాడుకోనున్నారు.

ఐదు నెలల్లో నిర్మాణం పూర్తి

నిజామాబాద్‌ ఐటీటవర్‌ భవన నిర్మాణాన్ని వచ్చే ఐదు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా నాలుగు నెలల పాటు నిర్మాణ పనులు నిలిచిపోయి, ప్రస్తుతం తిరిగి ప్రారంభమయ్యాయి. విశాలమైన భవన సముదాయం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా  నిజామాబాద్‌తోపాటు కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోనూ ఐటీ టవర్ల నిర్మాణం మొదలు పెట్టగా కరీంనగర్‌లో భవనం ప్రారంభమైంది. - అజ్మీరా స్వామి, జోనల్‌ మేనేజర్‌, టీఎస్‌ఐఐసీ


logo