సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Jul 22, 2020 , 03:01:45

హరితరక్షకులు.. వనసేవకులు

హరితరక్షకులు.. వనసేవకులు

మోర్తాడ్‌ : అంతరించి పోతున్న అడవుల శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రస్తుతం ఆరో విడుత హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. గ్రామగ్రామానా ముమ్మరంగా మొక్కలు నాటుతున్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొక్కల సంరక్షణకోసం గ్రామాల్లో వనసేవకులను నియమించారు. ఒక్కో గ్రామ పరిధిలో కనీసం రెండువేల మొక్కలు నాటుతున్నారు. రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు  వనసేవకులను నియమించారు. ప్రతి గ్రామంలో వన సేవకులను ని యమించుకోవాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ నా రాయణరెడ్డి అన్ని మండలాల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులకు సూచనలను జారీ చేశారు.

వనసేవకుల విధులు..

వనసేవకులు రెండు రకాలుగా ఉంటారు. రోడ్లవెంబడి అవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించిన మొక్కల సంరక్షణ బాధ్యత చూసేవారు. వీరు 400 మొక్కలను సంరక్షించాల్సి ఉంటుంది. మరొకరు వివిధ ప్రాంతాల్లో, బహిరంగప్రదేశాల్లో నాటిన మొక్కలను సంరక్షించాల్సి ఉంటుంది. వీరు వెయ్యి మొక్కల బాధ్యత తీసుకోవాలి. వీరికి ఉపాధిహామీ నుంచి రోజుకు రూ.237 చొప్పున చెల్లిస్తారు. మొక్కల చుట్టూ శుభ్రం చేయడం, ట్రీగార్డులను సరిచేయడం, కలుపుతీయడం వంటి పనులను ఉపాధిహామీ నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. నాటిన మొక్కలను పూర్తిగా సంరక్షించే బాధ్యత వీరిదే. అవెన్యూప్లాంటేషన్‌ చూసే వనసేవకులు ఉదయం 7 నుంచి 9గంటల వరకు మొక్కల సంరక్షణ పనులుచేపట్టాలి. రోడ్ల పక్కన, డివైడర్లలో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలను ప్రతిరోజూ పరిశీలిస్తూ పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రంచేయాలి. ప్రతిరోజూ ఉదయం రెండు గంటలపాటు మొక్కలకు నీరుపట్టడం, పరిసరాలను శుభ్రం చేసినందుకు గాను వారికి ప్రోత్సాహకంగా అదనంగా నెలకు రూ.1000 గౌరవ భృతిని చెల్లిస్తారు. వనసేవకులకు వేతనాన్ని ఉపాధిహామీ పథకంలో వాచ్‌ అండ్‌వార్డులో ఉన్న ప్రొవిజన్‌ నుంచి చెల్లిస్తారు. వీరితో గుంతలు తవ్వించడం, మొక్కలు నాటించడం వంటి పనులు చేయించకూడదు.

జిల్లాలో 2931 మంది వనసేవకులు... 

నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామపంచాయతీలకు గాను 2931 మంది వనసేవకులను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా వనసేవకుల నియామకం వివరాలు.. ఆర్మూర్‌ మండలంలో 106 మంది, బాల్కొండలో 53, భీమ్‌గల్‌లో 140,  బోధన్‌లో 270, చందూర్‌లో 31, ధర్పల్లిలో 110, డిచ్‌పల్లిలో 215, ఇందల్వాయిలో 115, జక్రాన్‌పల్లిలో 105, కమ్మర్‌పల్లిలో 77, కోటగిరిలో 146, మాక్లూర్‌లో 156, మెండోరాలో 58, మోర్తాడ్‌లో 76, మోస్రాలో 25, మోపాల్‌లో 105, ముప్కాల్‌లో 35, నందిపేట్‌లో 187, నవీపేట్‌లో 161, నిజామాబాద్‌లో 122, రెంజల్‌లో 85, రుద్రూర్‌లో 50, సిరికొండలో 153, వర్నిలో 130, వేల్పూర్‌లో 95, ఎడపల్లిలో 85, ఏర్గట్ల మండలంలో 40 మంది వనసేవకులను నియమించారు.logo