గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jul 21, 2020 , 02:49:25

వానకాలం పంటల సాగుకోసం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

వానకాలం పంటల సాగుకోసం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల

వానకాలం పంటల సాగుకోసం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలను సోమవారం ప్రారంభించారు. ప్రాజెక్టు అధికారులు, ప్రజాప్రతినిధులు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువకు ఉదయం నాలుగువేల క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రానికి ఐదువేలకు పెంచారు. లక్ష్మి కాలువకు వంద క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రతి నీటి బొట్టునూ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. అనంతరం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఆవరణలో నాయకులు మొక్కలను నాటారు.  రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదలకు కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

మెండోరా/ ముప్కాల్‌: అన్నదాతలకు వానకాలంలో ప్రతి ఎకరాకూ నీరందించడానికే నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అన్నారు. సోమవారం మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ నుంచి కాకతీయ ప్రధాన కాలువకు ఎస్సారెస్పీ చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ నీటిని విడుదల చేయగా, ముప్కాల్‌ మండల కేంద్రంలో ఉన్న లక్ష్మి కాలువకు స్థానిక ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువకు ఐదు వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు వంద క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఇంజినీర్‌ శంకర్‌ మాట్లాడుతూ.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నీటి విడుదల చేపట్టినట్లు తెలిపారు. ప్రాజెక్టులో 36 టీఎంసీల కన్నా నీటి నిల్వలు తక్కువగా ఉన్నా పంటలకు సకాలంలో సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. వారబందీ ప్రకారం నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకతీయ కాలువతో ఎల్‌ఎండీ వరకు 4.64 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. లక్ష్మి , కాకతీయ కాలువలతో పాటు అలీసాగర్‌, గుత్ప, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే నీటి వృథాను అరికట్టవచ్చన్నారు. ఈ నెల 22 నుంచి లక్ష్మికాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. అంతకుముందు పోచంపాడ్‌లోని కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న జెన్‌కో కేంద్రంలోని కాలువకు సీఈ, జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజారాం, ఈఈ రామారావు, సర్పంచ్‌ మిస్బా పూజలు నిర్వహించారు. అనంతరం నాలుగు టర్బయిన్ల ద్వారా నీటిని విడుదల చేశారు.

మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు

నీటి విడుదల సందర్భంగా కాకతీయ కాలువ వద్ద డీసీసీబీ డైరెక్టర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగంపేట్‌ శేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ తలారి గంగాధర్‌, ఎంపీపీ బురుకల సుకన్య రైతు నాయకులు పూజ చేశారు. అనంతరం జెన్‌కో కేంద్రం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు ఆనందంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అనుక్షణం పరితపిస్తున్నారన్నారు. సకాలంలో కాలువకు నీటిని విడుదల చేయించడంపై హర్ష వ్యక్తం చేస్తూ మంత్రికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం జలాలను ముందుగానే తరలించి వరద కాలువను నిండుకుండలా చేశారన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌ మిస్బా, నాయకులు రాజరెడ్డి, సామ గంగారెడ్డి, నవీన్‌గౌడ్‌, రవిగౌడ్‌, ఏలేటి శ్రీనివాస్‌ రెడ్డి, సాయరెడ్డి, వెంకట్‌రెడ్డి, ముప్కాల్‌ జడ్పీటీసీ బి. నర్సవ్వ, ఎంపీపీ సామ పద్మ, వైస్‌ ఎంపీపీ రాజన్న, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్‌, రైతుబంధు సమితి మండల కో-ఆర్టినేటర్‌ ముత్తెన్న, వేంపల్లి విండో చైర్మన్‌ జక్క రాజేశ్వర్‌, ఆయా గ్రామాల సర్పంచులు  పాల్గొన్నారు.

మెండోరా : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి 16,395 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోందని డీఈ జగదీశ్‌ తెలిపారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1073.50 అడుగుల (36.316 టీఎంసీలు) వద్ద  ఉంది. అలీసాగర్‌కు 720 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కులు విడుదలవుతున్నట్లు వివరించారు. ఈ సీజనులో ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 8.27 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. కాకతీయ కాలువకు నీటి విడుదలతో జెన్‌కో కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైనట్లు తెలిపారు. 
ఎస్సారెస్పీని సందర్శించిన ఎమ్మెల్యే షకీల్‌ 
 ఎస్సారెస్పీ ప్రాజెక్టును బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్‌ అధికారులను అడిగి ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం జలాలను వరద కాలువలోకి తరలించడంతో ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీరందుతుందని, దీంతో రైతులు ఆనందంగా ఉంటారన్నారు.  


logo