మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jul 20, 2020 , 04:05:16

చెరువులకు ల‌క్ష్మి క‌ళ‌

చెరువులకు ల‌క్ష్మి క‌ళ‌

నిజామాబాద్‌ జిల్లాలోని చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. ఎస్సారెస్పీ లక్ష్మి కాలువ ద్వారా సోమవారం వానకాలం పంటలకు నీటి విడుదల ప్రారంభం కానుంది. నీటి విడుదలతో మొత్తం 67 చెరువులు నిండుకుండలా మారనున్నాయి. గత పాలకులు ఎత్తిపోతల   నిర్వహణ,  చెరువులను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పంటలు సాగుకు నోచుకోక  అన్నదాతలు అవస్థలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునీకరణ పనులకు భారీగా నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించింది.  దీంతో చెరువులకు ఎటువంటి రంది లేకుండా నీరు చేరుతున్నది.  ఫలితంగా అన్నదాతలు ముమ్మరంగా పంటలు సాగు చేస్తున్నారు.   నీటి విడుదలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. వానకాలం పంటలకు మంత్రి చొరవతో తేదీని ఖరారు చేసి ప్రాజెక్ట్‌లో ఉన్న 33 టీఎంసీల నీటిని కాకతీయ, లక్ష్మి, సరస్వతీ కాలువలకు  విడుదల చేయనున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -మెండోరా/వేల్పూర్‌ 

మెండోరా /వేల్పూర్‌ : ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్‌ జిల్లాలోని ఆయకట్టు రైతుల కోసం లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభం కానుంది. జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపేందుకు లక్ష్మి కాలువ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. లక్ష్మి కాలువ ద్వారా వేంపల్లి ఎత్తి పోతలకు నీరందుతుంది. అక్కడి నుంచి  నవాబు, బోదేపల్లి, చౌట్‌పల్లి హన్మంత్‌డ్డి లిఫ్ట్‌లకు నీరు చేరుతుంది. గతంలో ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరందే కాలువలు ధ్వంసమయ్యాయి.  పాత కాలపు మోటర్లు వినియోగంలో ఉండేవి. కాలువలు తెగిపోతూ నీరు సక్రమంగా చెరువుల్లోకి  చేరేది కాదు. హన్మంత్‌రెడ్డి పథకం లీకేజీల మయంగా ఉండేది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ ఎత్తి పోతల పథకాలపై ప్రత్యేక దృష్టి సారించా రు. ఆధునీకరణ పనులకు భారీగా నిధులు మంజూ రు చేయించారు. దీంతో వేంపల్లి పంప్‌హౌస్‌లో ఆధునిక మోటర్లు ఏర్పాటు చేశారు. నవాబు ఎత్తిపోతల కాలువలను ఆధునీకరించారు. చౌట్‌పల్లి హ న్మంత్‌రెడ్డి పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టేలా మరమ్మతులు చేయించారు. దీంతో వేల్పూర్‌ మండలంలో ని చెరువులన్నింటికీ ఇబ్బంది లేకుండా నీరు చేరుతుంది. రెండు సంవత్సరాలుగా నవాబు ఎత్తిపోతల కింద చెరువులు నిండుకుండల్లా మారాయి. హన్మంత్‌రెడ్డి ఎత్తి పోతల పథకం ద్వారా లీకేజీలు లేకుండా చెరువులకు నీరందుతున్నది. 

సాగుకు సిద్ధం

ఎస్సారెస్పీ దిగువన వానకాలం పంటల సాగుకు  ఆయకట్టు సిద్ధమైంది. జిల్లా పరిధిలోని కాకతీయ కాలువకు 15 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. దీంతో 9,182 ఎకరాలు సాగవుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ లే కాకుండా  మోటర్లతో రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. లక్ష్మి కాలువతో మెండోరా, ముప్కాల్‌,మోర్తాడ్‌, బాల్కొండ, వేల్పూర్‌ మండలాలకు నీరందుతుంది. 

ఈ కాలువ కింద నాలుగు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. డీ-1 ద్వారా బుస్సాపూర్‌, సోన్‌పేట్‌, నల్లూరు గ్రామాలకు,  డీ-2 ద్వారా మెండోరా, దూదిగాం, చాకిర్యాల్‌, కొడిచర గ్రామాలకు, డీ-3 ద్వారా వేంపల్లి , ధర్మోరా, వన్నెల్‌(బీ), పడగల్‌, బోదేపల్లి గ్రామాల్లోని 7,389 ఎకరాలకు, డీ-4 ద్వారా  కొత్తపల్లి, నాగంపేట్‌, రెంజర్ల, శెట్‌పల్లి ధర్మోరా, గ్రామాలకు  నీరందుతుంది. మొత్తం 67 చెరువులను నింపుతారు.  లక్ష్మి కాలువతో 25,763 ఎకరాలకు, చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి ఎత్తిపోతలతో 11,625 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. సరస్వతి కాలువ ద్వారా నిర్మల్‌ జిల్లాలో 35 వేల ఎకరాలకు సాగునీరందనుంది.

ప్రాజెక్టులోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90.313 టీఎంసీలు కాగా ఆదివారం సా యంత్రానికి 1073.30  అడుగులు 35.890 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజనులో 7.92 టీఎంసీల వరద  వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి  4069 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌ నీటిమట్టం 1048.30 అడుగులు కాగా 5.306 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

చివరాయకట్టుకు నీరందుతుంది

కాలువ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నవాబ్‌ కాలువలను ఎవరూ బాగు చేయలేదు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో కాలువల మరమ్మతు పనులకు మోక్షం కల్గింది. గత ఏడాది నుంచి కాలువ ద్వారా గ్రామంలోని అన్ని చెరువులకు పుష్కలంగా నీరు చేరుతున్నది.   -తీగల మహేందర్‌, రైతు, వేల్పూర్‌

చుక్క నీరు వృథా కావడం లేదు 

గతంలో నవాబు కాలువలు సరిగా లేక లిఫ్ట్‌ పరిధిలోని చివరాయకట్టు అయిన వేల్పూర్‌కు నీరు సరిగా వచ్చేది కాదు.  గతంలో లిఫ్ట్‌ ద్వారా నీరు విడుదల అయితుందని తెలిసిన వెంటనే  తూముల వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు మళ్లించుకునే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం తూములు ఆధునీకరణతో  నీరు వృథా పోకుండా   చెరువుల్లోకి వచ్చి చేరుతున్నది.-నల్లవెల్లి లింగారెడ్డి, రైతు, వేల్పూర్‌ 


logo