శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jul 19, 2020 , 05:25:30

పాతాళ గంగ పైపైకి..

పాతాళ గంగ పైపైకి..

నిజామాబాద్‌ సిటీ : గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నిజామాబాద్‌ జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ప్రతినెలా భూగర్భజల శాఖ అధికారులు సర్వే నివేదికను పరిశీలిస్తే ఈ సంవత్సరం జూన్‌ చివరిలో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. గత వానకాలంలో సాధారణం కన్నా మించి వర్షపాతం నమోదు కావడమే భూగర్భజలాల పెరుగుదలకు కారణమని అధికారులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో   చెక్‌డ్యాంలు నిర్మించడం, ఉపాధిహామీ పథకం ద్వారా చెరువుల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయ డం, ఇంకుడు గుంతలు, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయడంతో భూగర్భజలాలు పెరిగాయి. అలాగే చెరువుల్లో సమృద్ధిగా నీరు నిల్వ ఉండడంతో సమీప ప్రాంతాల్లోని బోరుబావులు, బావుల్లో నీటి నిల్వలు పెరిగాయి. తద్వా రా ఆయకట్టు, మైదాన ప్రాంత  రైతులకు వానకాలం సీజన్‌ కలిసి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 

ధర్పల్లి మండలం హొన్నాజీపేట్‌ గ్రామంలో గత ఏడాది జూన్‌లో 29.54 మీటర్ల అడుగున ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది  10.90 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే భూగ ర్భ జలమట్టం పెరుగుదల 18.64 మీటర్లుగా ఉం ది. భీమ్‌గల్‌ మండలంలో గత ఏడాది 18.53 మీ టర్ల లోతులో నీరు ఉండగా.. ఈ ఏడాది 6.60 మీ టర్లలో నీటి లభ్యత ఉంది. డిచ్‌పల్లి మండలం యానంపల్లిలో గత ఏడాది 17.15 మీటర్ల లోతు లో ఉండగా..ఈ ఏడాది 9.50 మీటర్లలోనే నీటి ని ల్వలు ఉన్నాయి.  భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయనడానికి  పై ఉదాహరణలే నిదర్శనం.

 ఈ ఏడాది 5.76 మీటర్ల పెరుగుదల..

వర్షాలు మొదలైన తర్వాత జూన్‌ చివరి నుంచి జూలై మొదటి వారం వరకు భూగర్భ జలాలను ఆ శాఖ అధికారులు సర్వే చేస్తారు. ఈ ఏడాది వివరాలను అధికారులు వెల్లడించారు. గత ఏడాది జూన్‌ లో జిల్లా మొత్తం  మీద సగటున 17.80 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా..ఈ ఏడాది జూన్‌లో 12.04 మీటర్ల లోతులోనే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 5.56 మీటర్లు పెరిగాయి. గత ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురడవడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలంలోని కల్లూర్‌ గ్రామంలో గత ఏడాది 19.94 మీటర్లు ఉండగా ప్రస్తుతం  23.12 మీటర్లు, నందిపేట్‌ మండలంలోని నూత్‌పల్లి గ్రామంలో గత ఏడాది 3.56 మీ టర్లు ఉండగా ప్రస్తుతం 5.96 మీటర్లు,  రుద్రూర్‌ మండలంలోని రాయకూర్‌ గ్రామంలో గత ఏడాది 18.25 మీటర్లు ఉండగా ప్రస్తుతం 18.95 మీటర్లకు  భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నవీపేట్‌, మెండోరా, భీమ్‌గల్‌, బోధన్‌, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, మోపాల్‌, నందిపేట్‌, ముప్కాల్‌, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ తదితర మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి.