శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Jul 19, 2020 , 04:53:15

ఆ తొమ్మిది నిమిషాలు

ఆ తొమ్మిది నిమిషాలు

ఖలీల్‌వాడి : అది 1978 ఎన్నికల సమయం. ప్రచారం నిమిత్తం ఇందిరాగాంధీ ఇందూరుకు వచ్చారు. ఆమె వెంట పీవీ నరసింహారావు కూడా వచ్చారు. ఇందిరాగాంధీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించే సదావకాశం కవి వీపీ చందన్‌రావుకు దక్కింది. ఇంతటి గురుతర బాధ్యతను భుజాలకెత్తుకున్న వీపీ తనదైన శైలిలో సభికుల మెప్పు పొందారు. తొమ్మిది నిమిషాలపాటు సాగిన సభలో పీవీ నరసింహారావుతో సన్నిహితంగా మెదిలే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోవడం ఒకింత ఆవేదనకు గురిచేస్తున్నదని పీవీ శతజయంత్యుత్సవాల సందర్భంగా చందన్‌రావు గుర్తుచేసుకున్నారు. 

నమస్తే తెలంగాణ : 

పీవీ నరసింహారావును మీరు ఎప్పుడు కలిశారు..

వీపీ చందన్‌రావు : 1978లో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్‌కు వచ్చారు. ఆమె వెంట పీవీ నరసింహారావు కూడా వచ్చారు. కాంగ్రెస్‌ అధినేత్రి ఇందిరాగాంధీ ప్రసంగానికి తెలుగు అనువాదం కోసం నేనూ ఆ సభకు వెళ్లాను. అప్పుడు పీవీని కలిశాను.

మీరు ఎలాంటి అనుభూతికి లోనయ్యారు..

తెలుగు అనువాదానికి స్టేజ్‌ పైకి నన్ను పిలిచినప్పుడు నా కాళ్లు, చేతులు వణికిపోయాయి. అంతటి నాయకురాలికి అనువాదం చెప్పడం నా అదృష్టంగా భావించాను. 

సభలో ఇందిరాగాంధీ ఏం మాట్లాడారు..

సభలో ఇందిరాగాంధీ మాట్లాడుతూ.. ‘మేరా భాయియో.. బెహనో.. ఢిల్లీ మే రహకేబీ   మై హాత్‌ ఉటాయేతో ఆప్‌లోగ్‌ ముజే జితాతే హై..’ అని చెప్పారు. దీనికి తెలుగు అనువాదం సందర్భంగా నేను కొన్ని పదాలను జోడించి ‘ఢిల్లీ నుంచి వచ్చి ఓటు వేయండి అని నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మీపై ప్రేమాభిమానాలతోనే వచ్చాను. ఢిల్లీ నుంచి చెప్పినా మీరు ఓటు వేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది.’ అని చెప్పడంతో ప్రజలు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు. అప్పుడు పీవీ నరసింహారావును ఇందిరాగాంధీ పిలిచి ‘చందన్‌రావు ఏం మాట్లాడాడు. నేను మాట్లాడితే ఎవరూ నోరు మెదపలేదు. అతను మాట్లాడితే చప్పట్ల వర్షం కురిసింది.’ అని అన్నారు. దీనికి పీవీ అతను బాగానే మాట్లాడాడని ఇందిరాగాంధీకి తెలిపారు.

పీవీ నరసింహారావుతో మీ పరిచయం..

సభ అనంతరం ఇందిరాగాంధీ వెళ్లిపోతున్నారని నేను పీవీ పక్క నుంచే వెళ్లడానికి ప్రయత్నించాను. కానీ పీవీ నా భుజంపై చేయి వేసి ‘ఎక్కడికి వెళ్తున్నావు. మేడం ఉంటారు.’ అని అన్నారు. కానీ నా ధ్యాసంతా నిర్మల్‌ ప్రోగ్రాంకి వెళ్లాలి. ఆమెతో ఫొటో దిగాలని అనుకున్నానే తప్ప ఆ రోజున పీవీని పట్టించుకోకపోవడం తలుచుకుంటే కండ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

ఎంత సేపు మీతో పీవీ ఉన్నారు..

అంతటి మహోన్నతమైన వ్యక్తి ఆ రోజున నా పక్కన ఉన్నా పట్టించుకోకపోవడం ఇప్పటికీ ఆవేదనకు గురిచేస్తుంది. ఆ తొమ్మిది నిమిషాలు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. 

మళ్లీ ఎప్పుడైనా చూశారా.. 

తర్వాత హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఒక సమావేశానికి హాజరైనప్పుడు ఆయన ప్రసంగాన్ని వినేందుకు వెళ్లాను. 

పీవీ గురించి మీ మాటల్లో..

పీవీ జయంతి వచ్చినప్పుడల్లా ఆ సన్నివేశం గుర్తుకొస్తుంది. అంతటి మహానుభావుడిని ఎలా మిస్‌ అయ్యాను అని నాలో నేనే మదనపడుతుంటాను. 

కవిగా మీ జ్ఞాపకాలు..

1954 జూలై 23న నిజామాబాద్‌లో పుట్టిన నేను 11వ తరగతి వరకు చదువుకున్నాను. కవిగా మంచి పేరు తెచ్చుకున్నాను. 67 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో 34 అవార్డులు అందుకున్నాను. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేను.logo