బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jul 19, 2020 , 04:37:15

సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత శిల్పాలు

సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత శిల్పాలు

శిలలపై శిల్పాలు చెక్కినారు... మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు... అనే మధురమైన పాటను అనేక మార్లు వినే ఉంటాం. మన కండ్ల ముందే చారిత్రక ఆనవాళ్లను శిల్పాల రూపంలో చూసే ఉంటాం. శతాబ్దాల క్రితమే అద్భుతమైన నైపుణ్యంతో శిల్పులు చెక్కిన శిలా సౌందర్యాన్ని ఆస్వాదించాం. అయితే, ప్రకృతి రమణీయతలో సహజ సిద్ధంగా ఒదిగి, పొదిగి ఏండ్లుగా  నిలబడి సరికొత్త రూపాన్ని సంతరించుకున్న శిలలు అనేకం ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని అడవుల్లో, కొండల్లో, కోనల్లో చెక్కని శిల్పాలు ఎన్నో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆకాశంలో ఏర్పడే మబ్బులే.. తరచి చూస్తే ఊహకు అందని రూపాల్లో కనిపిస్తూ ఆలోచింపజేస్తాయి. రాళ్లలో ఇమిడి ఉన్న శిలా సౌందర్యాన్ని తరచి చూస్తే అద్భుతమైన ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చిన్నపాటి బండ రాయిని మోయాలంటేనే భారీ క్రేన్లు వాడుతున్న ఈ కాలంలో వందల టన్నుల బరువున్న భారీ బండ రాళ్లు పేర్చినట్లుగానే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

నిజామాబాద్‌ జిల్లాలోని అడవులు, కొండల్లో చెక్కని చక్కని శిల్పాలు ఎన్నో ఉన్నాయి. విభిన్న ఆకృతుల్లో శిల్పాలు ఎన్ని ఉన్నా దేని ప్రత్యేకత దానిదే. ఒక్కోటి ఒక్కో ఆకారంలో కనిపిస్తూ కనివిందు చేస్తున్నాయి. వింతైన, గమ్మత్తైన శిలలు ఎత్తైన కొండలపై కొలువై దర్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రకృతి చెక్కిన శిల్పాలు ప్రతి మదినీ పులకింపజేస్తున్నాయి.

వేల సంవత్సరాల నుంచి నేటి వరకు రాజ్యాలు పోయాయి. రాజులే పోయినారు. కాలం మారింది. మనుషులు మారారు. చెదరని, కదలని శిల్పాలు మాత్రమే నాటి కాలానికి గుర్తుగా నేటికీ ప్రకృతిలో ఠీవీగా నిలుస్తున్నాయి. భూమి మీద చుట్టూ ఉన్న ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండి... శిఖరం లాంటి ఆకారం కలిగిన ప్రదేశాలను కొండ లేదా గుట్ట అంటుంటాము. ఉభయ జిల్లాల్లో సహజ సిద్ధంగా వెలిసిన గుట్టలు అనేకం ఉన్నాయి. సతత హరిత వనాలతో, భారీ బండరాళ్లతో కూడిన ఈ గుట్టలు ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గానూ నిలుస్తున్నాయి. రాళ్లు, రప్పలతో నిండి ఉన్న ఈ ప్రాంతాలనే స్థానికంగా గుట్టలని అంటుంటాము. దక్కన్‌ పీఠభూమిలో చిన్నపాటి కొండలు అనేకం. సముద్ర మట్టానికి వేయి అడుగుల ఎత్తులో ఉండే వాటిని పర్వతాలు అంటుండగా మన ప్రాంతాల్లో వెలిసిన నేచురల్‌ రాక్‌ హిల్స్‌ మాత్రం సముద్ర మట్టానికి కేవలం 100 నుంచి 200 మీటర్ల లోపే కనిపిస్తాయి. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా.. సుదూర ప్రాంతాల నుంచి మన గుట్టలను తరచి చూస్తే ఒకదానికోటి కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తుండడం విశేషం. ఈ గుట్టల్లోనే శిల్పి ఉలి దెబ్బ తగలని అందమైన రాతి అందాలు అనేకం ఉన్నాయి.

నల్ల రాతి కుప్ప

నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ ప్రాంతం నల్ల రాతి గుట్టలకు పెట్టింది పేరు. వేల ఏండ్ల క్రితమే సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతం భారీ గోడను తలపించేలా కనిపిస్తుంది. భూ ఉపరితలం నుంచి పైకి చూస్తే ఆకాశానికి, భూమికి మధ్య వారధిలా కనిపిస్తుంటుంది. నల్లని రాళ్లను ఒక దగ్గర పేర్చి కుప్పగా పోసినట్లు ప్రకృతిలో భాగమైన ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తద్వారా సిద్ధుల గుట్టగా పిలుస్తోన్న ఈ ఆర్మూర్‌ నల్ల రాతి ప్రాంతంలోని అణువణువూ ఆశ్చర్యమేయక మానదు. గుట్టపైకి వెళ్లే మార్గం కొత్త అనుభూతులను పంచుతుంది. కింది నుంచి పైకి చూస్తే కేవలం రాళ్లు మాత్రమే కనిపించినా... గుట్ట పైకి వెళ్లి చూస్తే సువిశాలమైన భూ భాగం కనిపించడం ఇక్కడి విశిష్టత. రాళ్ల మధ్యలో సువిశాలమైన స్థలంలో పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లు నయనానందాన్ని కలిగిస్తాయి. శిలామయమైన ఇక్కడి కొండలు అనేక సంవత్సరాల కాలం నాటివి. సహజ సిద్ధమైన రాపిడి మూలంగా ఇవి ఏర్పడగా రాళ్ల మధ్య ఏర్పడిన సందులు అనేక గుహలను తలపిస్తుంటాయి. కేవలం రాతితోనే రెండు కిలో మీటర్ల మేర విస్తరించి ఉండడం దీని ప్రత్యేకత.

అద్భుతాలు అనేకం

కారును పోలిన బండ రాయి ఎత్తైన మరో బండపై నిల్చున్నట్లుగా కనిపించే అపురూప దృశ్యం. చిటికెన వేలుతో ముడితేనే కింద పడుతుందా? అనుకునేంత నిటారుగా నిల్చున్న రాతి శిల్పం మరోటి. మనిషి దూరేందుకు వీలుగా మార్గం ఉండి... బండపై మరో బండ అమరిక ఆద్యంతం ఆసక్తికరం. పరుపు బండ, నిటారు బండ, చాప బండ, మొసలి బండ, పక్షి బండ, దండం బండ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఊళ్లో ఒక్కో విధంగా ప్రజల నోళ్లో నానుతున్న అపురూపమైన ఏక శిల్పాలు నిజామాబాద్‌, కామారెడ్డి ప్రాంతాల్లో అనేకం. నిజామాబాద్‌ జిల్లాలో పేరొందిన అష్టముఖి కోనేరు టెంపుల్‌, సిరికొండ లక్ష్మీనర్సింహ స్వామి, కుద్వాన్‌పూర్‌ ఎల్లమ్మ, ఆర్మూర్‌ సిద్ధుల గుట్ట, సారంగాపూర్‌ హనుమాన్‌ ఆలయాలన్నీ సహజ సిద్ధంగా నల్ల రాతి బండ రాళ్ల సౌందర్యాల మధ్యే కనిపిస్తాయి.
సిద్ధుల గుట్టపై ప్రకృతి సోయగాలు
నిజామాబాద్‌ నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన దారిలో నవనాథ సిద్ధులగుట్ట ఉంది. ఈ నల్లరాళ్ల సిద్ధుల గుట్ట ప్రకృతి సోయగానికి ప్రతీక. గుట్టపైన ఉన్న జీవకోనేరుకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. సిద్ధులగుట్ట మొత్తం నల్లటి బండరాళ్లతో నిండి ఉంటుంది. ఏకశిలా స్తూపం, హనుమాన్‌ ఆలయం ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తున్నాయి. -కొట్టాల మోహన్‌, ఆర్మూర్‌
ప్రకృతి, ఆధ్యాత్మికతల కలబోతే సిద్ధుల గుట్ట 
ఆర్మూర్‌ పట్టణంలో ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక కలబోత కలిగిన సిద్ధుల గుట్ట ఎంతో ప్రాచీనమైనది. ఈ నల్లటి గుట్టపైన ఉన్న ప్రకృతి అందాలు, దివ్య క్షేత్రాలు ఆర్మూర్‌ పట్టణానికి తలమానికంగా నిలుస్తున్నాయి. వర్షాకాలంలో నల్లటి బండరాళ్ల అందం మరింత ద్విగుణీకృతం అవుతుంది. -ఇట్టెడి హారికారెడ్డి, కోటార్మూర్‌
ప్రకృతి అందాలకు నిలయంగా గుట్టలు
మాదాపూర్‌లోని గుట్టలు ప్రకృతి అందాలకు నిలయంగా కనిపిస్తాయి. మాదాపూర్‌ నుంచి గ్రామ శివారులోని పెద్దచెరువుకు వెళ్లే దారిలో గుట్టలు కనువిందు చేస్తాయి. రెండు గుట్టల మధ్య నుంచి రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  దూరం నుంచి చూస్తే బండరాయి కారు ఆకారాన్ని పోలి గమ్మత్తుగా కనిపిస్తుంది. -రొడ్డ సుమన్‌, మాదాపూర్‌
గుట్టను చూస్తే బంగ్లాలా కనిపిస్తుంది
మండలంలోని ముల్లంగి(బి), బొంకన్‌పల్లి, మాదాపూర్‌ మూడు గ్రామాల మధ్య ఉన్న గుట్ట ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. గుట్టపైన ఉన్న రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉంటాయి. దూరం నుంచి చూస్తే బంగ్లాలా కనిపిస్తుంది. గుట్టపైన పర్చినట్లు పరుపుబండ ఉంటుంది. ఎత్తైన బండపైనే ఆలయాన్ని నిర్మించారు. -సోమలికార్తీక్‌, ముల్లంగి(బి), మాక్లూర్‌ మండలంlogo