శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 18, 2020 , 02:57:17

రాళ్లల్లో..రతనాల సాగు!

రాళ్లల్లో..రతనాల సాగు!

  • నాగలి పెడితే ఇంచుకు  ఒక రాయి తగిలే పరిస్థితి
  • చుక్క నీరు పడడమూ  గగన మైన ప్రాంతం
  • పట్టుదలతో సాగుకు యోగ్యంగా మార్చుకున్న రైతులు
  • కామారెడ్డి జిల్లాలో గులక రాళ్ల భూముల్లో బంగారు పంటలు
  • గాంధారి, తాడ్వాయి,  పెద్దకొడ ప్‌గల్‌, మద్నూర్‌ మండలాల్లో రైతన్నల విజయం 
  • సారవంతమైన నేలను దున్ని పంటలు 

సాగు చేయాలంటే రైతులు పడే కష్టం వర్ణనాతీతం. ఎడ్ల బండ్లకు బదులుగా ట్రాక్టర్లు వచ్చినప్పటికీ అదో ప్రహసనం. నేల రకం ఎలాంటిదైనా సేద్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ రైతన్నలు సాగులో సంబురాన్ని వెతుక్కుంటారు. అయితే, అందుకు భిన్నంగా కామారెడ్డి జిల్లాలోని కొంత మంది రైతులు అందరికన్నా మిన్నగా రాణిస్తున్నారు. అసలు పంటలే పండవు అనుకునే భూముల్లో సాగుచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలో సగభాగం కరువు ఛాయలతో అల్లాడుతుంటుంది. ఈ ప్రాంతంలోని కొన్ని మండలాల్లో నేల స్వభావం పూర్తిగా గులకరాళ్లతో నిండి ఉంటుంది. రైతులకు సాగుకు యోగ్యమైన భూములే అయినప్పటికీ దుక్కి దున్నాలంటే కష్టమైన ప్రక్రియ. పైగా అనుకున్న పంటలు సాగు చేద్దామంటే కుదరని పని. రాళ్లతో నిండుగా కనిపించే ఆ భూముల్లోనే కొంత మంది కర్షకులు ధైర్యంగా రాణిస్తున్నారు. గులక రాళ్లలోనే విత్తు విత్తి పంటలకు ప్రాణం పోస్తున్నారు. కష్టమైనా ఇష్టంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ  నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. పట్టుదలగా ఏ పని చేసినా దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాంటి ప్రయత్నమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, తాడ్వాయి మండలాల రైతన్నలు చేస్తున్నారు. ఎదురు లేకుండా ముందడుగు వేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5లక్షల 20వేల సాగుకు యోగ్యమైన భూములున్నాయి. ఇందులో ఏటా వానకాలం సీజన్‌లో సుమారుగా నాలుగున్నర లక్షల ఎకరాలు  సాగుకు నోచుకుంటాయి. మొత్తం 22 మండలాలతో కూడిన కామారెడ్డి జిల్లాలో రాళ్లు, రప్పలతో కూడిన సాగు భూములు ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో గాంధారి, తాడ్వాయి మండలాల్లో 40వేల ఎకరాల్లో కనిపిస్తుంటాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం జుక్కల్‌ నియోజకవర్గంలోని పెద్దకొడప్‌గల్‌, జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లోనూ సుమారుగా 15వేల ఎకరాల భూములు ఇదే రకమైన నేల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇందులో యాసంగిలో పంటలు సాగు చేయలేక రైతన్నలు వదిలేసి మిన్నకుండి పోతుంటారు. వానకాలం వచ్చిందంటే డబుల్‌ కష్టమైనా సరే... రాళ్ల భూముల్లోనే పంటలు వేస్తూ మంచి దిగుబడిని సాధించేందుకు ఇష్టపడి పని చేస్తారు.

కష్టతరమే...

కామారెడ్డి జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, పెద్దకొడప్‌గల్‌, జుక్కల్‌, మద్నూర్‌ మండలాల పరిధిలోని సుమారుగా 40వేల ఎకరాల సాగు భూములు ఈ తరహా నేల స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ భూమిలో పంటలు సాగు చేసి ఉత్పత్తులు తీయడమంటే మామూలు విషయమేమీ కాదు. సారవంతమైన నేలలో దుక్కి దున్నడానికి పట్టే సమయంతో పోలిస్తే ఈ రాళ్ల భూముల్లో రెండింతలు ఎక్కువే సమయం తీసుకుంటుంది. మరోవైపు ఈ రాళ్ల భూముల్లో పని చేసేందుకు రైతు కూలీలు ఎవరూ ముందుకు రారు. ఫలితంగా బుజ్జగించుకుంటూ కూలీలను తెచ్చుకోవడం ఒక్కటే మార్గం. ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాల వినియోగానికి ఈ రాళ్లు అనుకూలంగా ఉండకపోవడమూ ఇబ్బందే. వర్షాధార పంటలను సాగు చేసుకుని కాసిన్ని రాళ్లు వెనుకేసుకునేందుకు ఈ ప్రాంత రైతన్నలు పడే కష్టం ఎందరికో ఆదర్శం. గతేడాది వానలు అనుకూలించడంతో తెలంగాణ, కర్నాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని పెద్దకొడప్‌గల్‌ ప్రాంత రైతులు ఈ రాళ్ల భూముల్లోనే బంగారు పంటలు పండించారు. ఎకరాకు 30 క్వింటాళ్ల మేర మొక్కజొన్న దిగుబడిని సాధించడం విశేషం.

సోయా, పత్తి సాగు...

పెద్ద పెద్ద బండ రాళ్లతో కూడిన ఈ భూముల్లో పంటలు పండించేందుకు కర్షకులు పడే తంటాలు అంతా ఇంతా కాదు. పొట్ట కూటి కోసం ఉన్న భూమిని బంగారమోలే మలుచుకుని సాగు చేసుకుంటున్నారు. ఏటా వానకాలం సీజన్‌లో ఈ భూముల్లో మొక్కజొన్న సాగు చేస్తారు.  రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నియంత్రిత సాగు విధా నం అమలవుతున్నది. గాంధారి, తాడ్వాయి, పెద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, జుక్కల్‌ మండలాల్లోని సాగుకు యోగ్యం కాని నేలలోనూ రైతులు సోయా, పత్తి సాగుకు సిద్ధమయ్యారు. వ్యవసాయాధికారులు, ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నియంత్రిత సాగుకే రైతన్నలు జై కొట్టారు. వేల ఎకరాల్లో ఈ ప్రాంతంలో మొక్కజొన్న, సోయా సాగుకు నోచుకునేది. ఇప్పుడు కొద్ది మంది మాత్రమే మొక్కజొన్న వైపు ఆసక్తి చూపగా మిగిలిన వారంతా పత్తి, సోయా వైపే ఆసక్తి చూపారు.

రాళ్లలో నడవడమే కష్టం...

నాకు మా ఊళ్లోనే 15 ఎకరాల భూమి ఉంది. భూమంతా రాళ్లతోనే ఉంటది. యాసంగిలో పంటలు సాగు చేయము. బోర్లు వేస్తే ఇక్కడ నీళ్లు పడవు. వానకాలం సీజన్‌ మాత్రమే మాకు అనుకూలం. ధైర్యంగా ఏటా పత్తి, సోయా, మొక్కజొన్న సాగు చేస్తుంటాము. ఈసారి మొక్కజొన్నను పూర్తిగా వదిలేశాం. మాకు వానకాలం సీజన్‌ వచ్చిందంటే చేతి నిండా పని. మాకున్న భూమిని సాగు చేసుకుని పొట్ట కోసం తిప్పలు పడుతుంటాం. ఈ భూమిలో పంటలు పండించడం అంటే కష్టమైన పని. 

- బాదావత్‌ గోపాల్‌ సింగ్‌, రైతు, దేవీసింగ్‌ తండా, పెద్దకొడప్‌గల్‌ మండలం

చుట్టూత భూములన్నీ ఇదే పరిస్థితి...

మాది సరిహద్దు ప్రాంతం. కొద్ది దూరం పోతే కర్నాటక రాష్ట్రం వస్తది. అటువైపు కూడా ఇట్లనే భూములుంటాయి. మేము వానకాలంలోనే పంటలు వేస్తుంటాం. నాకు బూరుగుపల్లి తండాలో 10 ఎకరాల భూమి ఉంది. ఐదు ఎకరాల్లో పత్తి, మిగిలిన 5ఎకరాల్లో పెసర్లు, మినుములు వేశాను. చుట్టూత వందలాది ఎకరాల భూములన్నీ ఇదే రకంగా ఉంటాయి. వర్షాకాలంలో పంటలు సాగు చేసుకుంటాం. పత్తి ఎక్కువగా సాగు చేస్తున్నాం. నిరుడు దిగుబడి మంచిగా వచ్చింది. 

- సంగ్రాం, రైతు, బూరుగుపల్లి తండా, పెద్దకొడప్‌గల్‌ మండలం


logo