బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jul 17, 2020 , 02:07:24

వాన సంబురం.. సాగు ముమ్మరం

వాన సంబురం.. సాగు ముమ్మరం

  • ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వానలు
  • జలకళను సంతరించుకుంటున్న వాగులు, వంకలు
  • ఎస్సారెస్పీకి  పెరుగుతున్న వరద
  • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
  • ముమ్మరంగా సాగు పనులు   

వరుణుడు కరుణించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. నెల రోజులుగా నామమాత్రంగా కురిసిన వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేయగా.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వారికి ఊరటనిచ్చింది. దీంతో సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ మండలంలో అత్యధికంగా 14.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాలతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీలోకి వరద వచ్చి చేరుతున్నది. ఈ వానకాలం సీజన్‌ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో 28.349 టీఎంసీల నీటి మట్టం ఉండగా గురువారం నాటికి 34.189 టీఎంసీల నీటి మట్టానికి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,129 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి వాగులోకి వరద పెరిగింది. మండలంలో కురిసిన వర్షానికి అడ్విలింగాల, లక్ష్మాపూర్‌ అటవీ ప్రాంతాల నుంచి కళ్యాణి వాగులోకి వరద వచ్చి చేరుతున్నది.  -కమ్మర్‌పల్లి/ఎల్లారెడ్డి

కమ్మర్‌పల్లి : జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎస్సారెస్పీకి వరద పోటెత్తుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో సాగుకు ఉపయుక్తమైన వర్షపాతం నమోదవుతోంది. ఎస్సారెస్పీలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. జిల్లాలోని ఎస్సారెస్పీ పరీవాహక ప్రాంతంతోపాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు తోడవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ వానకాలం సీజన్‌ ప్రారంభం నాటికి 28.349 టీఎంసీల నీటిమట్టం ఉండగా గురువారం నాటికి 34.189 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 26 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సరాసరి వర్షపాతం 1042.4 మిల్లీమీటర్లు కాగా బుధవారం నాటికి 245.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు 17.2 మి.మీ వర్షం కురిసింది. సీజన్‌ ప్రారంభమైన నాటి నుంచి గురువారం వరకు 26.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు బోధన్‌, నవీపేట్‌, ఎడపల్లి, రెంజల్‌ మండలాల్లో సాధారణానికి  మించి వర్షపాతం నమో దు కాగా తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఎస్సారెస్పీ పరిధిలో, ఎగువ న మహారాష్ట్రలో వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయానికి 8,129 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇందులో 4 వేల క్యూసెక్కులు మహారాష్ట్రలోని బాబ్లీ నుంచి వస్తున్నది. మరో 4 వేల క్యూసెక్కులు స్థానిక వర్షాలతో వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బుధవారం నాలుగు వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో గురువారానికి 8 వేలకు పెరిగింది. జూన్‌ ఒకటి నుంచి  ప్రాజెక్టులోకి 5.84 టీఎంసీల  వరద వచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రానికి 1072.60 అడుగుల (34.401 టీంఎసీలు) నీటి నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ప్రాజెక్టులో 1048.40 అడుగులు, 5.357 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

ఎల్లారెడ్డి : వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్న రైతులకు బుధవారం నాటి వర్షం కొండంత ధైర్యాన్నిచ్చింది. జిల్లా నలుమూలలా కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పారుతున్నాయి. ఇప్పటికే బోరుబావుల కింద ప్రారంభమైన వరినాట్లు మరింత పుంజుకున్నాయి. అల్పపీడనం కారణంగా మూడు రోజుల పాటు   వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించినా బుధవారం ఒక్కరోజు కురిసిన వర్షమే రైతులకు ఊరట కలిగించింది. నెల రోజులుగా నామమాత్రంగా కురుస్తున్న వర్షాలతో సందిగ్ధంలో ఉన్న రైతులకు ఈ వర్షం భరోసానిచ్చింది. అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జుక్క ల్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బీర్కూ ర్‌, పిట్లం, నిజాంసాగర్‌, భిక్కనూరు, కామారెడ్డి మండలాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

కొన్ని మండలాల్లో కుండపోత 

బుధవారం పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. జుక్కల్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి, భిక్కనూరు మండలాల్లో రెండు నుంచి మూడు గంటల పాటు కురిసిన వర్షం ఆ వెంటనే తగ్గిపో యింది. చాలా గ్రామాల్లో రైతులు వర్షం నీటిని నిల్వ చేసుకునేందుకు పొలాల వైపు పరుగులు తీశారు. వరి నాట్ల కోసం సిద్ధం చేసుకున్న రైతులు నీటిని నిల్వ చేసుకొని గురువారం నాట్లు ప్రారంభించడంతో కూలీల కొరత ఏర్పడింది. వారం రోజులుగా అంతంతమాత్రంగా సాగుతున్న వరి నాట్లు బుధవారం నాటి వర్షంతో ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

జుక్కల్‌ మండలంలో అత్యధిక వర్షం

కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా జుక్కల్‌ మండలంలో నమోదైంది. ఇక్కడ 14.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద కొడప్‌గల్‌లో 59 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 89, బీర్కూర్‌లో 60, బాన్సువాడలో 55, పిట్లంలో 57, నిజాంసాగర్‌లో 56, ఎల్లారెడ్డిలో 61, భిక్కనూరులో 90, కామారెడ్డిలో 60 మి.మీ  వర్షపాతం నమోదైంది. సదాశివనగర్‌లో 7.7 మిల్లీమీటర్లు, రాజంపేటలో 8 మి.మీ అత్యల్ప వర్షపాతం నమోదైంది.

పొంగిన వాగులు వంకలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు జలకళను సంతరించుకున్నాయి. బిచ్కుంద మండలంలో బుధవారం కురిసిన వర్షానికి రాజుల్లా వాగు పొంగిపొర్లింది. రోడ్డుపై నుంచి భారీగా వర్షపు నీరు పారడంతో కొద్దిసేపు రాక పోకలకు అంతరాయం కలిగింది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి వాగులోకి వరద  పెరిగింది. మండలంలో కురిసిన వర్షానికి అడ్విలింగాల, లక్ష్మాపూర్‌ అటవీ ప్రాంతాల నుంచి కళ్యాణి వాగులోకి వరద  వచ్చి చేరుతోంది.logo