గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 16, 2020 , 02:39:07

బాధిత కుటుంబానికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం

బాధిత కుటుంబానికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం

  • ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి చికిత్సకు చేయూత 
  • ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్న బాధితుడు అజయ్‌
  • మాజీ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు 

డిచ్‌పల్లి(ఇందల్వాయి): నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన అజయ్‌ జూలై 11న మధ్యాహ్నం నిజామాబాద్‌ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. దీంతో గ్రామానికి చెందిన షేక్‌ మౌలానా తగిన సహాయం చేయాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ట్వీట్‌ చేశారు. స్పందించిన ఆమె మెరుగైన వైద్యం కోసం అజయ్‌ని హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి నిమ్స్‌ దవాఖానకు వెళ్లి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. 

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. వైద్యుల సూచన మేరకు అజయ్‌ తిర్మన్‌పల్లి గ్రామానికి చేరుకున్నారు. మూడు నెలలకు కావాల్సిన మందుల కొనుగోలు కోసం మాజీ ఎంపీ కవిత రూ.23వేల నగదును అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారికి ఇందల్వాయి ఎంపీపీ రమేశ్‌నాయక్‌, ఎంపీటీసీ సభ్యుడు చింతల దాసు, టీఆర్‌ఎస్‌ తిర్మన్‌పల్లి గ్రామ అధ్యక్షుడు బిరీశ్‌ శెట్టి, షేక్‌ మౌలానా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo