శుక్రవారం 07 ఆగస్టు 2020
Nizamabad - Jul 16, 2020 , 02:39:08

రోడ్లకు ఇరువైపులా పచ్చదనం

 రోడ్లకు ఇరువైపులా పచ్చదనం

బీర్కూర్‌ / ఎడపల్లి / శక్కర్‌నగర్‌ / ఆర్మూర్‌ / నిజామాబాద్‌ రూరల్‌ / బీబీపేట్‌ : హరితహారంలో భాగంగా పలు చోట్ల రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రయాణికులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరవశించి పోతున్నారు. బీర్కూర్‌ నుంచి బాన్సువాడ వరకు, బీర్కూర్‌ నుంచి బరంగేడ్గి వరకు రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎడపల్లి మండలంలోని సాటాపూర్‌ గేట్‌ నుంచి అంబం గ్రామం వరకున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు గ్రీనరీని తలపిస్తున్నది. ఐదు కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డుకు ఇరువైపులా రెండు, మూడో విడుత హరితహారంలో భాగంగా కానుగ, ఇతర మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఐదు వేల మొక్కలు నాటారు. మొదటి విడుత హరితహారంలో భాగంగా బోధన్‌ పట్టణంలో కౌన్సిలర్‌ మీర్‌ నజీర్‌ అలీ ఆధ్వర్యంలో డివైడర్లలో పలు రకాల మొక్కలు నాటారు. ప్రస్తుతం మొక్కలు పెరిగి రహదారికి నూతన శోభను తీసుకొచ్చాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రోడ్ల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రస్తుతం రోడ్లన్నీ పచ్చని తోరణాలను తలపిస్తున్నాయి. ఆర్మూర్‌ నుంచి పిప్రి గ్రామం వరకు, ఇస్సాపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని మల్లారం గండిలో పచ్చదనం వెల్లివిరుస్తోంది. నిజామాబాద్‌ నుంచి మోస్రాకు వెళ్లే దారిలో మల్లారంగండి వద్ద రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పచ్చని చెట్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.logo