గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jul 15, 2020 , 02:26:32

కల్లాల పనులు త్వరగా పూర్తి చేయండి

కల్లాల పనులు త్వరగా పూర్తి చేయండి

  • సెల్‌ కాన్ఫరెన్సులో కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇందూరు : గ్రామాల్లో కల్లాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై డీఆర్డీవో, ఎంపీడీవోలు, ఏపీవోలతో మంగళవారం  సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రారంభమైన కల్లాల పనులు త్వరగా పూర్తి చేయాలని, మిగతా వాటిని వారంలోపు ప్రారంభించి నెల రోజుల్లోగా నిర్మించాలని సూచించారు. ఈ సీజన్‌లో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కల్లాలు నిర్మించాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 2,800 వరకు దరఖాస్తులు వచ్చాయని, అందులో 800 వరకు మంజూరు చేశామని తెలిపారు. కల్లాలు మంజూరైన రైతులు ఈ శనివారంలోగా పనులు ప్రారంభించేలా చూడాలని చెప్పారు. ఇరిగేషన్‌ శాఖ ద్వారా కాలువల పూడికతీత పనులు మంజూరయ్యాయని, పనులు వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఎక్కవ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, చేపట్టాల్సిన పనులపై సర్పంచ్‌తో చర్చించి ప్రతిపాదనలు రూపొందించాలని టీఏలకు తెలిపారు. ప్రతి రైతుకు సంబంధించిన పొలానికి ఫీడర్‌ కెనాల్‌ తవ్వితే వారు సంతోషిస్తారని చెప్పారు. వర్షకాలంలో చెరువుల అలుగు పారేలోపు ఈ నీరు ఉపయోగపడుతుందన్నారు. భూగర్భజలాలు సైతం పెరుగుతాయని తెలిపారు. హరితహారంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌కు సంబంధించిన ప్రతి రోడ్డులో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. 22వ తేదీన దీనిపై సమీక్షా సమావేశం ఉంటుందని, ఆ సమావేశానికి వివరాలతో హాజరు కావాలని తెలిపారు. హరితహారం పూర్తయ్యేలోపు రోజూ కొన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, సరిగా పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైకుంఠధామంలో మొరం నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మేకలు, గొర్రెల కోసం షెడ్లు మంజూరు చేయాలని తెలిపారు.logo