గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jul 15, 2020 , 02:26:33

లాభాల ‘పందిరి’ వేద్దాం..

లాభాల ‘పందిరి’ వేద్దాం..

  • పందిరి విధానంలో  కూరగాయల సాగు
  • 50 శాతం రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం

మోర్తాడ్‌ : రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగు విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. రైతును లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తున్నది. లాభసాటి సాగువిధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. మన ప్రాంతంలో మన అవసరాలకు తగ్గట్టుగా పంటలను పండించడం ద్వారా ఇటు రైతులకు, అటు ప్రజలకు లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కూరగాయల సాగు కోసం ఏర్పాటు చేసే పందిళ్లకు 50 శాతం రాయితీని అందిస్తోంది. 

పందిళ్ల సాగుతో అధిక దిగుబడులు

తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సోర, దొండ, పొట్ల, చిక్కుడు జాతి, తీగ టమాట లాంటి పంటలను పందిళ్లతో సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. మామూలుగా ఇటువంటి కూరగాయల పంటలను కింద సాగు చేయడం ద్వారా కాయ భూమికి ఆనుకొని అనుకున్న స్థాయిలో ఎదగకపోవడం, రంగుమారడం, ఆకారం మారడంతోపాటు చీడపీడలు ఆశించి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అదే పందిరి సాగు విధానంతో మొక్కకు గాలి, వెలుతురు బాగా తగిలి కాయలు బలంగా, పొడువుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. దీంతో దిగుబడి పెరిగే అవకాశముంది. ఇటువంటి సాగువిధానంలో కింది భాగంలో మల్చింగ్‌ విధానాన్ని అమలు చేస్తే కలుపు సమస్య ఉండదు. 

50 శాతం సబ్సిడీపై..

పందిళ్ల కోసం రైతులు కనీసం అర ఎకరాన్ని కలిగి ఉండాలి. అర ఎకరంలో 93 రాతి లేదా సిమెంట్‌ కడ్డీలను పాతించాల్సి ఉంటుంది. ఈ కడ్డీలకు జీఏ వైర్‌ చుట్టించాలి. దాదాపుగా అర ఎకరానికి ఏడున్నర క్వింటాళ్ల జీఏ వైర్‌ అవసరమవుతుంది. అర ఎకరానికి ఒక యూనిట్‌గా కేటాయించారు. ఒక యూనిట్‌కు రూ.లక్షా 8వేల 800 ఖర్చు అవుతుంది. దీంట్లో 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. ఐదు యూనిట్ల వరకు ఈ విధానాన్ని అమలు చేసుకునే అవకాశం ఉంది.

జిల్లాలో పరిస్థితి ఇలా..

చాలా మంది రైతులు పంటలు పండించడంలో నూతనత్వాన్ని వెతుకుతున్నారు. ఒకే రకమైన పంటలు పండించడం కాకుండా లాభాలు ఆర్జించడంతోపాటు దిగుబడులు పెరిగే పద్ధతులను అవలంబించడం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పందిళ్లతో కూరగాయల సాగును దాదాపు 200 మంది రైతులు 190 ఎకరాల్లో చేస్తున్నారు. పందిళ్లతో తీగజాతి కూరగాయలను పండించడంతోపాటు కింది భాగంలో ఖాళీస్థలంలో ఇతర కూరగాయలను సైతం వేసుకునే అవకాశం ఉంది. రైతు కష్టించే తీరును బట్టి ఈ సాగు విధానాన్ని కొనసాగించి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. 

సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం పంటల సాగు విధానంలో రైతులను చైత న్య పరుస్తోంది. ఇందులో భాగంగా కూరగాయల సా గుకు పందిళ్ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీని ఇస్తోం ది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లి. పందిళ్ల సాగుతో దిగుబడులు పెరుగుతా యి. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది.

-సుమన్‌, ఉద్యానవనశాఖ అధికారి, మోర్తాడ్‌logo