బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jul 14, 2020 , 03:38:26

వర్షాకాలంలో అప్రమత్తత తప్పనిసరి

 వర్షాకాలంలో  అప్రమత్తత తప్పనిసరి

  • పాముకాటుతో 20 రోజుల్లో ఐదుగురు మృతి 
  • ఆందోళనకు గురైతే అంతేసంగతులు
  • అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

వర్షాకాలం.. పాములు కాటేసే కాలం. పాము కనిపిస్తే గుండెల్లోదడ మొదలవుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పదు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతన్నలు, కూలీలతోపాటు చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో తిరిగే వారు, నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండకపోతే అంతేసంగతులు! ప్రతి పామూ విషపూరితమైనది కాకపోయినప్పటికీ శరీరంపై కాటు కనిపిస్తే వెంటనే దవాఖానకు వెళ్లాలి.  -విద్యానగర్‌   

ఆందోళన వద్దు..

పాముకాటు చాలా ప్రమాదకరమైనది. కానీ కొన్ని పాములతో ఎటువంటి అపాయం ఉండదు. కట్లపాము కాటేస్తే క్షణాల్లోనే విషయం రక్తకణాల్లోకి ప్రవేశించి మనిషి మృతిచెందే అవకాశం ఉంది. పాముకాటు వేస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. నాగుపాము కాటేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. పింజర కాటేస్తే రెండు గంటల తర్వాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్టె పాముల్లో విషం ఉండదు. అయినప్పటికీ దవాఖానకు వెళ్లాలి. పాముకాటుకు గురైనప్పుడు ఆందోళన చెందితే గుండెపోటుకు దారితీస్తుంది. వెంటనే దవాఖానకు చేరుకుని అక్కడి వైద్యులకు విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అక్కడ యాంటీస్నేక్‌ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డకట్టకుండా, గుండెపోటు రాకుండా ఇంజక్షన్‌ పనిచేస్తుంది. 

విష సర్పాలు రెండు రకాలు

న్యూరోటాక్సిల్‌ రకం నాగుపాము, కట్ల పాము, రెండో రకం హిమోటాక్సిన్‌ అంటే రక్తపింజర పాము వంటి పాములు ఉంటాయి. న్యూరోటాక్సిల్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాస ఆడక మృతి చెందే ప్రమాదముంది. ఇది గుండెపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. హీమోటాక్సిన్‌తో రక్తనాళాల్లో కణజాలం నశించి కాటు పడిన భాగంలో వాపు వస్తుంది. కాటేసింది ఎలాంటి పామో తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పక్కపక్కన రెండు దంతాలు కాటు వేస్తే అది కచ్చితంగా విషసర్పమే. పాము కాటుతో ఉన్న భాగం నుంచి శరీరంలోకి రక్త ప్రసరణలో విషం వ్యాప్తిచెందే అవకాశం ఉంది. ఎటువంటి పాము కాటువేసినా దవాఖానకు వెళ్తే రెండు రకాల చికిత్సలు నిర్వహిస్తారు. తీవ్రతను బట్టి ప్రభుత్వ దవాఖానల్లో ఇంజక్షన్‌ వేస్తారు. యాంటీ స్నేక్‌ వీనం, యాంటీ పాలి వీనం అనే రెండు రకాల మందులు  ఉంటాయి. 

పాముకాటు లక్షణాలు

వ్యక్తిని విషపూరితమైన పాము కరిస్తే శరీరమంతా నీలం రంగుగా మారడం, రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగ వస్తుంటుంది. ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కన్నా రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే దవాఖానకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వారికి 99 శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

సాధ్యమైనంత వరకు పాములు, విష కీటకాల బారిన పడకుండా ఉండాలి. రాత్రిపూట పొలాల వద్దకు వెళ్లేవారు కర్ర, టార్చ్‌లైటు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్నచోట పాములు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంపచెట్లు, పిచ్చిమొక్కలు, రంధ్రాలు, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండ్లల్లో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులు రాళ్లు, చెట్ల పొదల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రాత్రి పూట పొలాలకు వెళ్లే వారు సాధ్యమైనంతవరకు పొడువాటి బూట్లుధరించడం మంచిది. ఏదో ఒక సర్పం కాటువేసిందనగానే ఎక్కువ శాతం భయాందోళనకు గురై మరణించే వారు అధికంగా ఉంటారు. పాము కాటువేసిన వారికి ధైర్యం చెప్పి వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి. 

మంత్రగాళ్లను ఆశ్రయించొద్దు

గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ. దీంతో వైద్యులను సంప్రదించకుండా మంత్రగాళ్లను ఆశ్రయిస్తుంటారు. పాము కాటుకు వైద్యం ఉంది. పాము కాటుకు గురైన వారు మంత్రగాళ్లను ఆశ్రయించవద్దు. విషసర్పం కాటేసినప్పుడు దవాఖానకు తీసుకెళ్లకుండా నాటు వైద్యుడిని ఆశ్రయిస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. విషంలేని పాముకాటుకు గురైన వారు ప్రాణాలతో బయటపడి మంత్రగాళ్ల మహిమతోనే అని నమ్ముతుంటారు. ఇదే బాధితుల పాలిట ముప్పుగా మారుతుంది. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది మృత్యువాత పడుతుంటారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదిస్తే కరిచినపామును బట్టి చికిత్స చేస్తారు. 

 బాధితుడికి ధైర్యం చెప్పాలి

వర్ష్షాకాలంలో పాముకాటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. పాముకాటుకు గురైన బాధితుడికి ముందుగా ధైర్యంచెప్పి వెంటనే దవాఖానకు తరలించి చికిత్స  అందించాలి. బాధితుడికి ధైర్యం చెప్పకపోతే ఆందోళనతో ప్రాణాలు కోల్పోయే  అవకాశం ఉంటుంది.

- చంద్రశేఖర్‌, డీఎంహెచ్‌వో , కామారెడ్డి


logo