బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jul 13, 2020 , 02:43:02

గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృషి

గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృషి

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. పనుల్లో జాప్యాన్ని నివారించడం.. పారదర్శకతపై ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించింది. పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకున్నది. ఇందుకోసం టైంస్టాంప్‌ కెమెరా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.  ప్రతి రోజూ పనులు జరిగే ప్రాంతంలో ఈ యాప్‌ ద్వారా సెల్ఫీలు తీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారుల గ్రూపులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకునే సమయం, స్థలం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు నమోదవుతుండడంతో పనుల పురోగతితో పాటు, కార్యదర్శుల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. పనులు చేయకుండా తప్పించుకునే పరిస్థితులు లేకపోవడంతో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి.  -మోర్తాడ్‌

మోర్తాడ్‌:  గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి పనుల కోసం రూ. కోట్ల నిధులు కేటాయిస్తున్నది. పనులు పారదర్శకంగా జరగడంతోపాటు జాప్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇంతకుముందు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించడంలో నిర్లక్ష్యం వహించేవారు. వారు ఎప్పుడు వస్తారో తెలిసేది కాదు. ఒకవేళ వస్తారని తెలిసినా వారు వచ్చే వరకూ జీపీల్లో వేచి చూడాల్సి వచ్చేది. కార్యదర్శులు గ్రామాల్లో లేకున్నా జిల్లా అధికారులకు మాత్రం తెలిసేది కాదు. దీంతో కార్యదర్శులు ఇష్టారీతిన వ్యవహరించడం జరిగేది. దీంతో కార్యదర్శుల పర్యవేక్షణ కొరవడడంతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా జరిగేవి కాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం రూపొందించింది. గ్రామాల్లో పక్కాగా పనులు కొనసాగేలా వీటిని కార్యదర్శులు నిరంతర పర్యవేక్షించేలా చేసేలా ప్రత్యేక యాప్‌ రూపొందించింది. పాలనలో మార్పు తీసుకురావడానికి టైంస్టాంప్‌ కెమెరా యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కార్యదర్శులు గ్రామాలకు ఉదయం 7 గంటల వరకే వచ్చేస్తున్నారు. ప్రతిరోజూ సకాలంలో రావడం, పనులను పర్యవేక్షిస్తుండడంతో గ్రామాల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 

టైంస్టాంప్‌ కెమెరా యాప్‌ ఉపయోగం

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టైంస్టాంప్‌ కెమెరా యాప్‌ను కార్యదర్శులు, ఎంపీడీవోలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈయాప్‌లో ఫొటో తీసేటపుడు సమ యం, స్థలం, గ్రామం, మండలం, జిల్లా వివరాలు కనిపిస్తాయి. కార్యదర్శులు గ్రామాలకు రాగానే పంచాయతీ వద్ద నిల్చొని టైంస్టాంప్‌యాప్‌లో సెల్ఫీ తీయాలి. అందులో సెల్ఫీ తీసుకున్న స్థలం, గ్రామం, మండలం, జిల్లా పేరుతో ఫొటో వస్తుంది.  ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 7.30 గంటల్లోపు ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా గ్రామంలో పనులు జరుగుతున్న చోట సెల్ఫీతో పాటు, పనులు జరిగే ఫొటో కూడా తీస్తారు. దీంతో గ్రామంలో ఏఏ పనులు జరుగుతున్నాయి తదితర పనులను కార్యదర్శి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులకు తెలుస్తుంది. ఈ యాప్‌ ద్వారా ఫొటోలు తీసి గ్రూపులో పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో  కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవో, డీఎల్‌పీవో, డీపీవో, అదనపు కలెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ కూడా ఉంటారు. కార్యదర్శులు పోస్ట్‌ చేసిన ఫొటోల ఆధారంగా ఏగ్రామంలో ఏ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ అనేది యాప్‌లో ఉన్నవారందరికీ తెలిసిపోతుంది. ఏ కార్యదర్శి అయినా యాప్‌లో ఫొటోను అప్‌లోడ్‌ చేయకపోతే విధులకు రానట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. అటువంటి వారు సాయంత్రానికి అధికారులకు వివరణ ఇవ్వాలి. ఈ కారణంగా ప్రస్తుతం కార్యదర్శులంతా సమయానికి గ్రామాలకు రావడం, పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం, పల్లెప్రగతి పనులను పర్యవేక్షించడం జరుగుతుంది. 

ఒక్కొక్కరికి ఒక వీధి

గ్రామంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఇంతకు ముందు అందరూ కలిసి వీధులు ఊడవడానికి, మురికి కాలువలు తీయడానికి, ముళ్లపొదలు తొలగించడానికి వెళ్లే వారు. గుంపుగా వెళ్లడంతో ఎవరు ఏ పని చేస్తున్నారు.. ఎవరు పనిచేయడం లేదు తెలిసేది కాదు. దీంతోపాటు గ్రామమంతా పరిశుభ్రంగా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి ఒక వీధిని కేటాయిస్తున్నారు. కార్మికుడికి కేటాయించిన వీధిలో ఏం జరిగినా అతడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మురికి కాలువలు తీయడం, రోడ్లు ఊడవడం, ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించడం ఆ కార్మికునిదే పూర్తి బాధ్యత. దీంతో గ్రామంలోని వీధులు, మురికి కాలువలు శుభ్రంగా ఉంటున్నాయి. కార్మికులు పనిచేస్తున్నారా లేదా అని ప్రతిరోజూ కార్యదర్శులు పర్యవేక్షిస్తుండడంతో పారిశుద్ధ్య పనులు సక్రమంగా సాగుతున్నాయి. 

పక్కాగా పారిశుద్ధ్యం, హరితహారం 

కార్యదర్శులు సమయానికి గ్రామానికి రావడంతో పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం కార్యక్రమాలు పక్కాగా సాగుతున్నాయి. ప్రతిరోజు కార్యదర్శులు పర్యవేక్షించడంతో పనులు కచ్చితంగా చేయాల్సి వస్తున్నది. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ్యం, హరితహారం పనులు జరుగుతుండడం, కార్యదర్శులు, ఎంపీవో, ఎంపీడీవో, జిల్లా అధికారుల పర్యవేక్షణ సైతం కొనసాగుతుండడంతో గ్రామాల్లో గతంలో కన్నా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. పనులు చేయకుండా తప్పించుకునే పరిస్థితులు లేనందున ఈ కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. 

పనులు పక్కాగా జరుగుతున్నాయి..

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా జరుగుతున్నాయి. టైంస్టాంప్‌ కెమెరా యాప్‌లో ఫొటోలు తీయడంతో పనులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఏర్పడడమే కాకుండా సమయం కూడా తెలుస్తున్నది. కార్యదర్శులంతా ఫొటోలు తీయాల్సి ఉండడంతో వారు కూడా సకాలంలో విధులకు హాజరవుతున్నారు. పర్యవేక్షణ కొనసాగుతుండడంతో గ్రామాల్లో పనులు జోరుగాసాగుతున్నాయి. -శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో మోర్తాడ్‌
logo