బుధవారం 21 అక్టోబర్ 2020
Nizamabad - Jul 11, 2020 , 02:29:33

ఈ ఫొటోలో చూశారుగా.. ఈ నిర్లక్ష్యమే మనకొంప ముంచుతున్నది

ఈ ఫొటోలో చూశారుగా.. ఈ నిర్లక్ష్యమే మనకొంప ముంచుతున్నది

కరోనా మహమ్మారికి అందరినీ బలిపెడుతున్నది. నిజామాబాద్‌ జిల్లాకేంద్ర దవాఖానలో శుక్రవారం ముగ్గురు కొవిడ్‌-19 పేషెంట్లు మృత్యువాత పడగా.. ఆ హాస్పిటల్‌ పరిసరాల్లోనే ఇలా గుంపులు గుంపులుగా తిరుగుతూ జనం కనిపించారు. మాస్కులు, భౌతిక దూరాన్ని గాలికొదిలి.. కరోనాతో కవ్వింపు చర్యలకు దిగుతున్న ఈ ధోరణే ప్రాణాంతకమవుతున్నది. మరోవైపు జిల్లాలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. శుక్రవారం 39 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు అత్యధికంగా నమోదైన కొవిడ్‌-19కేసులు ఇవే. నిజామాబాద్‌ జిల్లాకేంద్ర దవాఖానలో ముగ్గురు పేషెంట్లు వ్యాధి తీవ్రత పెరగడంతోనే మృతిచెందారని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. చికిత్సలో ఎలాంటి లోపాల్లేవని ఆయన స్పష్టంచేశారు. - నిజామాబాద్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ

విద్యానగర్‌ /బాన్సువాడ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 26 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో 14 కేసులు నమో దు కాగా వాటిలో ఇస్లాంపురాలో 8, భవానిరోడ్‌లో 2, విద్యానగర్‌లో 3, శ్రీరాంనగర్‌ కాలనీ లో ఒకటి నమోదయ్యాయి. చిన్నమల్లారెడ్డిలో ఒకటి, బాన్సువాడలో 5, పిట్లం, దోమకొండ, నాగిరెడ్డిపేట మండలం పోచారం, మాచారెడ్డిలో ఒక్కోటి చొప్పున, గాం ధారిలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. జి ల్లాలో ఇప్పటివరకు 129 కేసులు నమోదయ్యాయన్నారు.  కామారెడ్డి నుంచి 46, బాన్సువాడ నుంచి 92 శాం పిళ్లు పంపినట్లు తెలిపారు.
నిజామాబాద్‌లో..
ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 211కు చేరింది.  నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో 2,  మాలపల్లిలో 3, వినాయక్‌నగర్‌లో 3 , పీఎస్‌ కాలనీ, అర్సపల్లి, జక్రాన్‌పల్లి, ముదక్‌పల్లి, ఇందల్‌వాయిలో ఒక్కోటి చొప్పున  కేసులు నమోదయ్యాయి.  
గాంధారిలో మరో ఇద్దరికి.. 
గాంధారి : మండల కేంద్రంలో మరో ఇద్దరికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు  వైద్యాధికారి హరికృష్ణ తెలిపారు. బ్యాంకు ఉద్యోగితో ప్రైమరీ కాంటాక్టు అయిన 8 మంది సిబ్బంది శాంపిళ్లను పరీక్షల నిమిత్తం పంపగా, ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. 
ప్రభుత్వ దవాఖాన వైద్యురాలికి కరోనా  
భిక్కనూరు(రాజంపేట) : భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్యురాలికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు.  
నాగిరెడ్డిపేట్‌లో కలకలం
నాగిరెడ్డిపేట్‌ : మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 7న ఓ మహిళకు కరోనా పా జిటివ్‌ సోకింది. దీంతో గోపాల్‌పేట్‌కు చెందిన ఆమె భర్త శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం పంపగా రిపోర్టుల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిం దని   మెడికల్‌ ఆఫీసర్‌ నందిత తెలిపారు. 
పెగడాపల్లిలో ఒకరికి.. 
బోధన్‌ రూరల్‌ : బోధన్‌ మండలంలోని పెగడాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.  
ఎడపల్లిలో మహిళా ఉద్యోగికి  లక్షణాలు 
ఎడపల్లి(శక్కర్‌నగర్‌) : ఎడపల్లి మండల కేం ద్రంలోని మహిళా ఉద్యోగికి  కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులకు సమాచారం అందించారు. అధికారులతో పాటు, వైద్యాధికారి సిబ్బంది వెంటనే కార్యాలయానికి చేరుకుని  ఆమెను పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.  
హైదరాబాద్‌ వెళ్లి వచ్చిన వ్యక్తికి..
దోమకొండ : మండల కేంద్రంలో ఒకరికి కరో నా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని డాక్టర్‌ సంతోష్‌  తెలిపారు.  రైస్‌మిల్‌ యజమాని 15 రోజుల కిత్రం  హైదరాబాద్‌కు వెళ్లి వచ్చాడు. రెండు రోజులుగా ఆయనకు జ్వరం,దగ్గు తీవ్రం గా ఉండడంతో కామారెడ్డి ఏరియా దవాఖానలోపరీక్షలు చేయించుకోగా  పాజిటివ్‌ వచ్చింది.   
పిట్లంలో ఐదుకు చేరిన కేసులు 
పిట్లం : పిట్లం మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు శుక్రవారం నాటికి ఐదుకు చేరుకున్నాయని పిట్లం వైద్యాధికారి శివకుమార్‌ తెలిపారు.   బర్ధిపూర్‌లో హోంగార్డ్‌కు.. 
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలంలోని బర్ధిపూర్‌ గ్రా మానికి చెందిన హోంగార్డ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు  వైద్యాధికారి తెలిపారు. నిజామాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌ ఎస్సై వద్ద డ్రైవర్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు.  
నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో నలుగురు రోగులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు కరోనా తీవ్రత పెరగడంతో మృత్యువాత పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దవాఖానలో ఆక్సిజన్‌ సిలిండర్‌ అయిపోవడంతోనే కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. రోగులు మృతి చెందిన విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు వైద్య శాల వద్దకు చేరుకుని ధర్నా చేశారు. పోలీసులు దవాఖాన వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి హుటాహుటిన దవాఖానకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొవిడ్‌ బాధితుల మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఇందులో ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా తీవ్రతతోనే ముగ్గురు మృతి చెందారని, మరొకరు అనారోగ్యం చనిపోయినట్లుగా వెల్లడించారు.
దవాఖాన వద్ద బందోబస్తు...
నిజామాబాద్‌ జిల్లా జనరల్‌ దవాఖానను ప్రభు త్వం కొవిడ్‌ వైద్యశాలగా మార్చింది. మొన్నటి నుంచి ఇక్కడే ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌లో కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు సైతం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స సైతం ఇక్కడే అందిస్తున్నారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు అంబులెన్సులో తరలించారు.
కలెక్టర్‌ సందర్శన...
నలుగురు మృతిపై జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వెనువెంటనే స్పందించారు. ఆక్సిజన్‌ అందక ఎవ రూ చనిపోలేదని అన్నారు. కరోనాతో ముగ్గురు, అనారోగ్యంతో మరొకరు మృతి చెందారని వెల్లడించారు. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. దవాఖానకు వచ్చే సమయానికి వారికి తీవ్రమైన కరోనా లక్షణాలున్నట్లుగా వైద్యులు గుర్తించారన్నా రు. కరోనా రోగితో పాటు వచ్చిన సహాయకుల ముందే ఆక్సిజన్‌ సిలిండర్లు మార్చడంతో అపోహ తలెత్తిందని వివరణ ఇచ్చారు. అవాస్తవాలు ప్రచా రం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలను వ్యాప్తి చేయడం ద్వారా  ప్రజ ల్లో భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉందన్నా రు. రోగులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇ బ్బందులు లేవని కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ సిలిండర్ల స్టాక్‌ పుష్కలంగా ఉందన్నారు. గాంధీ దవాఖాన తరహాలో నిజామాబాద్‌ జనరల్‌ వైద్యశాలలో కరోనా చికిత్సలు మెరుగ్గా అందిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.
లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు...
కరోనా వైరస్‌ లక్షణాలుంటే తక్షణం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులను సంప్రదించాలని ప్రజలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కోరారు. దగ్గు, తుమ్ములు, జ్వరంతో బాధ పడుతున్న వారుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల వద్దకెళ్లాలని సూచించారు. లక్షణాలు మొదలయ్యాక వారం రోజులకు దవాఖానకు వస్తే కరోనా తీవ్రత పెరిగి వైద్య చికిత్సకు శరీరం సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చని తద్వారా ముప్పు వాటిల్లుతుందన్నారు.  
సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే...
నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో  నలుగురు మృతి చెందిన ఘటనపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర రావు ప్రకటన విడుదల చేశారు. ముగ్గురు కొవిడ్‌ -19 పేషెంట్ల మృతికి వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది నిర్ల క్ష్యం లేదని ఆయన చెప్పారు. ఆక్సిజన్‌ కొరత వం టి కారణాలు ఎంత మాత్రం కాదని తెలిపారు. మృతి చెందిన ముగ్గురు కరోనా పేషెంట్లలో ఒకరు జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయసున్న మహిళ అని తెలిపారు. ఆమె తీవ్రమైన అస్వస్థతకు గురైందని అన్నారు. ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్‌ 67శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. రెండో పేషెంట్‌ భీమ్‌గల్‌ గ్రామానికి చెందిన 50 సంవత్సరాల పురుషుడిగా పేర్కొన్నా రు. ఇతడు కరోనాతో పాటు మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నాడని ఇతని ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవల్‌ 83శాతం అని చెప్పారు. మూడో పేషెంట్‌ ఏఆర్‌పీ క్యాంపునకు చెందిన 58 సంవత్సరాల మ హిళగా  వెల్లడించారు. ఈమె కరోనా పాజిటివ్‌తో పాటు హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఆక్సిజన్‌ సాచురేషన్‌ తక్కువగా ఉండడంతో చనిపోయిందన్నారు. వారు దవాఖా నకు వచ్చే సమయానికే తీవ్ర అస్వస్థతతో ఉన్నారని తెలిపారు.
24గంటలు శ్రమిస్తున్నాం...
నలుగురు రోగులు మృతి చెందడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ వచ్చిన ప్రచారాలను సూపరింటెండెంట్‌  నాగేశ్వర రావు తీవ్రంగా ఖండించా రు. ఐసీయూ,  ఐసోలేషన్‌ వార్డులో వైద్యులు, న ర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది 24 గంటల పాటు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారని గుర్తు చేశారు. 
ఆక్సిజన్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌(సెంట్రల్‌)తో ఐసీయూ, ఐసోలేషన్‌లో ఉన్న వారికి సరఫరా చేస్తున్నట్లుగా వివరించారు. ప్రస్తుత పరిస్థితి తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆక్సిజన్‌ బల్క్‌ సిలిండర్లను సమకూర్చిందని వెల్లడించారు. ఆక్సిజన్‌ తగ్గిన సమయంలో ఈ బల్క్‌ సిలిండర్లను ఉపయోగించనున్నట్లుగా తెలిపారు. రోగుల మృతి విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని, ఆక్సిజన్‌ కొరత ఏ మాత్రం లేద ని స్పష్టం చేశారు. ప్రజల సేవకు ప్రభుత్వ వైద్య సి బ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.


logo