శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jul 10, 2020 , 02:35:31

ముంచుకొస్తున్న ముప్పు

ముంచుకొస్తున్న  ముప్పు

  • lపంటలకు మేలు చేసే కీటకాలకు హాని
  • lకనుమరుగవుతున్న పక్షి జాతులు
  • lజీవవైవిధ్యానికి విఘాతం
  • lదెబ్బతింటున్న భూసారం
  • రంగురంగుల రెక్కలు కట్టుకొని పంటపొలాలపై వాలిపోయే సీతాకోకచిలుకలు.. పొడవాటి 

రెక్కలు.. తోకతో గుంపులు గుంపులుగా వచ్చే తూనీగలు.. కిలకిలా రావాలతో మనస్సుకు హాయిగొల్పే పిచ్చుకలు.. శ్రమకు చిహ్నంగా నిలిచే చీమల దండు.. భూ సారాన్ని పెంచే వానపాములు.. ఇలా ఎన్నో రకాల కీటకాలు, పక్షులు, జంతువులు పంటల సాగుకు దోహదం చేస్తున్నాయి. రైతుకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సహకరిస్తున్నాయి. విచ్చలవిడిగా పురుగుమందుల వాడకంతో వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతున్నది. ఇప్పటికే కొన్ని జీవజాతులు అంతరించిపోగా, మరికొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే జీవవైవిధ్యానికి విఘాతం వాటిల్లకమానదు.  

కోటగిరి : భూమిపై జీవించే హక్కు ప్రతి ప్రాణికి ఉంది. మానవ మనుగడలో జీవజాతుల పాత్ర కీలకం. చీమ, పేడపురుగు, సీతాకోక చిలుక, నక్క, ఉడుము, కాకి, గబ్బిలం ఇలా ఎన్నో రకాల జీవులు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. మానవ ప్రయోజనకారులుగా ఉన్నాయి. మారుతున్న జీవన విధానం జీవవైవిధ్యానికి కీడు చేస్తోంది. కొన్ని జాతులు వేట గాళ్ల బారిన పడి కనుమరుగవుతుంటే.. మరికొన్ని సహజంగా క్షీణదశకు చేరుకుంటున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకం, ఆధునిక సమాచార వ్యవస్థలతో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

మాయమవుతున్న ఉడుములు

ఉడుములు అన్ని ప్రాంతాల్లోనూ సంచరిస్తుంటాయి. వీటిని శాస్త్రీయంగా వెరానస్‌ బెంగాలెన్సిస్‌ అంటారు. ఇవి మూడున్నర కిలోల బరువు వరకు ఉంటాయి. భూమిలో బొరియలు చేసి గుడ్లు పెట్టి వాటిని మట్టితో కప్పి వేయడం వీటి ప్రత్యేకత. ఇవి పంటలకు హాని చేసే కీటకాలను ఆహారంగా తీసుకొని రైతుకు ప్రయోజనకారిగా ఉంటాయి. వీటి మాంసం నడుమునొప్పులను తగ్గిస్తుందనే ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. దీంతో వేటగాళ్లు వీటిని పట్టి విక్రయిస్తుంటారు.

తూనీగలు కనుమరుగు

గుండ్రటి తల.. పొడవాటి రెక్కలు.. తోకతో ఉండే తూనీగలను చూస్తే అందరికీ ముచ్చటేస్తుంది. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ వాటితో ఆడుకునే ఉంటారు. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్న వెంటనే తూనీగలు గుంపులు గుంపులుగా చేరి గాల్లో ఎగురుతూ కనువిందు చేస్తాయి. నిజానికి ఇవి కీటకాలను తినే మాంసాహారులు. వీటి జీవితంలో తక్కువ కాలం నీటిలో సయాడ్‌ అనే లార్వా రూపంలో ఉంటూ దోమగుడ్లను ఆహారంగా తీసుకొని దోమల నివారణకు ఉపయోగపడుతుంటాయి. తూనీగలు దోమలను, పంటలకు నష్టం కలిగించే శత్రు పురుగులను తిని రైతులకు మేలు చేస్తాయి. రసాయన ఎరువులు, పురుగు మందులు, నీటి కాలుష్యంతో ప్రస్తుతం తూనీగలు కనుమరుగవుతున్నాయి.

గుంట నక్క జిత్తులేవి..?

ఇప్పటికే మన పరిసరాల్లో తోడేళ్లు కనిపించడం లేదు. ఇక జిత్తులతో అందరినీ అబ్బుర పరిచే టక్కులమారి గుంటనక్క ఆపదలో పడిపోయింది. ఇవి భూమి లోపల రెండు నుంచి మూడు అడుగుల లోతులో గుంతలు చేసుకుని జీవిస్తాయి. ఎలుకలు, పందికొక్కులు, పీతలు, కీటకాలను ఆహారంగా తీసుకొని వ్యవసాయ రంగానికి సహకరిస్తాయి. రెల్లు దుబ్బలు వంటి వాటి ఆవాసాలను నాశనం చేయడం, పురుగుల మందుల ప్రభావంతో ఈ జాతి అంతరించి పోతున్నది.

వానపాములు.. భూమి పుత్రులు

వానపాములు భూమిని సారవంతం చేస్తాయి. వేల సంఖ్యలో ఉండే వానపాములు భూమిపై పొరల్లో కంపోస్టును తయారు చేస్తాయి. ఇవి నేలలో బొరియలు చేయడంతో భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వానపాము విసర్జకంలో నత్రజని సహజంగా ఉంటుంది. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేలలో వానపాములు చనిపోతున్నాయి. దీంతో నేలకు అవసరమయ్యే జీవద్రవం అందక నిస్సారంగా మారుతోంది.


logo