గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jul 10, 2020 , 02:35:42

ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి

  • హరితహారంలో టీయూకు   రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలి 
  • ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ రిక్క లింబాద్రి

డిచ్‌పల్లి : ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్క లు నాటి సంరక్షించాలని  ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌ ఆచార్య రిక్క లింబాద్రి కోరారు. హరితహారంలో తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించిన ఆయన గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  హరితహారం కార్యక్రమంలో ఇప్పటివరకు వర్సిటీలో లక్షకు పైగా మొక్కలను నాటి సంరక్షించినట్లు తెలిపారు. సుమారు 576 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. టీయూ ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నదన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ అందరిలో స్ఫూర్తిని నింపుతున్నదన్నారు. ఈ సంకల్పం ఎందరో నాయకులను, యువకులను, విద్యార్థులను, మే ధావులను,  కళాకారులను మొత్తంగా ప్రజలను ముందుకు తీసుకెళ్త్తున్నదన్నారు. తాను రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో వీసీగా పార్థసారథి ఉన్నారని, 2014-15లో  హరితహారం కార్యక్రమం లో మొక్కలు నాటగా ఇప్పుడవి ఏపుగా పెరిగి నందనవనంలా తయారయ్యాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ నసీం, అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ కనకయ్య, పరీక్షల నియంత్రణ అధికారి జి. చంద్రశేఖర్‌, టీఏ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ మారయ్యగౌడ్‌, వసుంధరాదేవి, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరతి, రవీందర్‌రెడ్డి, అంజనేయులు, సంపత్‌కుమార్‌, భ్రమరాంబిక, పీఆర్వో త్రివేణి, సూపరింటెండెంట్‌ సాయాగౌడ్‌, భాస్కర్‌, వినోద్‌, అధ్యాపకులు, విద్యార్థులు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

త్వరలోనే ‘దోస్త్‌' రిజిస్ట్రేషన్‌

దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య రిక్క లింబాద్రి తెలిపారు. టీయూలో ఆయన గురువారం మొక్కలు నాటిన అనంతరం ఏర్పాటు సమావేశంలో మాట్లాడారు. ఈ నెల ఒకటి నుంచి ప్రారం భం కావాల్సిన దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కరో నా నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు బయటికి వెళ్లకుండా ఇంట్లో నుంచే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. దోస్త్‌ వెబ్‌సైట్‌తో పాటు టీఎస్‌ పోలియో యాప్‌లో సెల్ఫీ దిగి అప్‌లోడ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకునే నూతన సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్‌ కోసం 79010 02200 వాట్సాప్‌ నెంబర్‌, ఆన్‌లైన్‌ గ్రీవెన్‌ సెల్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌, ఇతర సందేహాల కోసం యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటుచేశామన్నారు.  


logo