బుధవారం 28 అక్టోబర్ 2020
Nizamabad - Jul 09, 2020 , 02:01:42

ఎమ్మెల్సీ ఎన్నికపై కొనసాగుతున్న వాయిదాల పర్వం

ఎమ్మెల్సీ ఎన్నికపై కొనసాగుతున్న వాయిదాల పర్వం

భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధ సంస్థగా భారత ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఈ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాదిరి స్వతంత్ర వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఊపిరి. చట్ట సభకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈసీదే. పదవీ కాలంలోపే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులను చట్టసభలకు పంపడం ఎన్నికల కమిషన్‌ ప్రధాన కర్తవ్యం. అనివార్య కారణాలతో ఖాళీగా ఏర్పడిన స్థానాలకు సైతం నిర్ణీత వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించడం సంప్రదాయం. ఇందుకు భిన్నంగా నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మాత్రం నెలల తరబడి వాయిదా  పడుతూ వస్తున్నది. ఏప్రిల్‌ 7న జరగాల్సిన పోలింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. వీటితో పాటే రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ నిలిచింది. లాక్‌డౌన్‌ సడలింపుతో పలు రాష్ర్టాల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్లు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న రాజ్యసభ పోరు ముగిసినా .. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై ఈసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. లాక్‌డౌన్‌ కారణం చూపుతూ ఇప్పటికే రెండు సార్లు ఎన్నికను వాయి దా వేస్తూ వచ్చింది.  నిలిచిపోయిన రాజ్యసభ ఎన్నికలు సైతం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తర్వాత నిర్వహించింది.  నిజామాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసినా ఎన్నికల నిర్వహణను తాత్సారం చేస్తున్నది.నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా 2015, డిసెంబర్‌ 12న టీఆర్‌ఎస్‌  నుంచి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఫిరాయించడంతో తెలంగాణ శాసన మండ లి ఆయనపై 2019, జనవరి 16న వేటు వేసింది. ఆయన కోర్టులను ఆశ్రయించడంతో ప్రతికూల తీర్పు వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు తలుపులు తట్టినా ఫలితం లేకుండా పోయింది. 2020, జనవరిలో అనర్హత సబబేనంటూ దేశ అత్యున్నత న్యా య స్థానం తీర్పునివ్వడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. రెండున్నర నెలల కాలం తర్వాత ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీ) మార్చి 5 న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ తేదీగా ప్రకటించింది. అభ్యర్థుల నామినేషన్లు, ప రిశీలన, ఉప సంహరణ ప్రక్రియలు అన్నీ ముగిశాక ప్రచారం ఒక్కటే మిగిలింది. అంతలోపే దేశం లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో భారత ఎ న్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసిం ది. మే 22 వరకు సాగిన వాయిదాను 45 రోజుల పాటు కొనసాగిస్తూ మరోసారి ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఇచ్చిన గడువు జూలై 7కే ముగిసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నిక ఊసే లేకుండా పోయింది. ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ఖాళీ ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానం కాస్త జూలై గడుస్తున్నా భర్తీ కాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

నెల రోజుల్లోనే 9 రాష్ర్టాల్లో ఎన్నికలు పూర్తి...

కొవిడ్‌ -19 కారణంతో వాయిదా వేసిన ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. దేశ వ్యాప్తంగా 17 రాష్ర్టాల్లో 55 రాజ్యసభ స్థానాలకు రీ నోటిఫికేషన్‌ను జూన్‌ ఒకటిన జారీ చేసింది. జూన్‌ 19న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు, ఫలితాలను సైతం వెల్లడించింది. ఇందులో తెలంగాణతో సహా 10 రాష్ర్టాల్లోని 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కావడం తో మిగిలిన 18 స్థానాలకు 7 రాష్ర్టాల్లో ఎన్నికలు సాఫీగా జరిగాయి. ఇందులో కరోనా కరాళనృత్యం చేస్తున్న గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలతో పాటు మణిపూర్‌, మేఘాలయ ఉన్నాయి. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నిక పెండింగ్‌లో ఉండగానే... జూన్‌ ఒకటో తారీఖున మూడు రాష్ర్టాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈసీ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో కర్ణాటక రాష్ట్రంలో నాలుగు ఎ మ్మెల్సీ స్థానాలుండడం విశేషం. జూన్‌ 22కే వీటి ఎన్నికలు సైతం పూర్తయ్యాయి. జూన్‌ 9న మరో నోటిఫికేషన్‌లో కర్ణాటకలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ రాగా జూన్‌ 30కే మొత్తం ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం. బీహార్‌లో 9 ఎమ్మెల్సీ స్థానాలకు జూలై మొదటి వారంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల లో రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి సైతం జూన్‌ 15న నోటిఫికేషన్‌ ఇవ్వగా ఎన్నికల ప్రక్రి య జూలై 8 నాటికి పూర్తి కావడం విశేషం. కరో నా వైరస్‌ విస్తృతి తీవ్రంగా ఉన్న రాష్ర్టాల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలు చకచకా పూర్తవుతున్నా తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఎమ్మెల్సీ స్థానానికి  తాత్సా రం చేయడం విడ్డూరంగా మారింది.

సాధారణ ఎన్నికలు కాకపోయినా...?

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైన నియోజకవర్గంగా పరిగణిస్తారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థా నిక సంస్థలు, గవర్నర్‌ కోటా కింద ఎన్నుకుని శాస న మండలికి పంపిస్తారు. పెద్దల సభలో అడుగు పెట్టే ప్రజాప్రతినిధి ఎన్నిక ప్రత్యేకంగా ఉం టుం ది. ఓటర్లు సైతం పరిమిత సంఖ్యలోనే ఉంటారు. అందులో స్థానిక సంస్థల కోటాలో తక్కువ ఓటర్లకే అవకాశం ఉంటుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో మొత్తం 824 మంది ఓటర్లే ఉన్నా రు. కొవిడ్‌ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఇప్పటికే పోలింగ్‌ బూత్‌ల సంఖ్య ను 50కి పైగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెంచిన పోలింగ్‌ కేంద్రాలతో సగటున ఒక్కో కేం ద్రానికి 16 మంది మించబోరు. ఇవేమీ సాధారణ ఎన్నికలు కాకపోయినప్పటికీ మిగిలిన రాష్ర్టాల్లో తీసుకున్న జాగ్రత్తలతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా పోలింగ్‌ మాత్రం వాయిదా పడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.  


logo