ఆదివారం 09 ఆగస్టు 2020
Nizamabad - Jul 08, 2020 , 02:40:06

గానుగ నూనె ఆరోగ్య కానుక

 గానుగ నూనె ఆరోగ్య కానుక

ఇందూరు :  ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై ధ్యాస పెట్టడంలేదు. కల్తీ ఆహారానికి అలవాటు పడ్డాం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఉన్నా తీరికలేని పనులతో కాలంతో పరుగెత్తాల్సి వస్తోంది. ఏ ఆహారం వండాలన్నా నూనె వాడడం తప్పనిసరి. ఇది నాణ్యమైనదా కాదా అని చూసే తీరిక మనకు లేదు. అందుబాటులో ఉన్నది కొని వాడేస్తున్నాం. ప్యాకెట్లలో దొరికే రసాయనాలతో కూడిన రిఫైన్డ్‌ ఆయిల్‌ వాడి ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. తినే ఆహారం రుచిగా ఉండాలంటే వంట నూనె మంచిదై ఉండాలి. ఆ వంటనూనె ఎంపికలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కొంతమంది. రోగాలు రాక ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, వచ్చాక దవాఖానల చుట్టూ తిరుగుతూ సంపాదించిన ధనాన్నంతా ఖర్చు చేస్తున్నారు. నగర ప్రజలు ఇప్పుడిప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టి, డాక్టర్‌ సలహా, సూచనలతో గానుగ నూనె రుచి చూస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో గానుగ నూనె విక్రయిస్తున్నారు. 

అప్పట్లో గ్రామాల్లో..

గ్రామాల్లో రైతులే స్వయంగా గానుగ నూనెను తయారు చేసుకునేవారు. ఎడ్ల సహాయంతో గానుగ ఆడించి నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, కుసుమను నూనెగా తయారు చేసేవారు. పిప్పిని పశువులకు దాణాగా వేసేవారు. అవి బలంగా తయారయ్యేవి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో రిఫైన్డ్‌ చేసిన ప్లాస్టిక్‌ కవర్లలో లభించే నూనెలు వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తినే నూనెలో పోషకాలు తగ్గడంతో ప్రజలు వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. మళ్లీ పాత పద్ధతులతో చెక్క గానుగ నూనె అందుబాటులోకి రావడంతో ఉపయోగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పల్లీ, నువ్వులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, కుసుమ లాంటి వాటితో సంప్రదాయ పద్ధతి ద్వారా నూనెను తయారుచేయడంతో పోషకాలు పోకుండా జీవంగా ఉంటున్నాయి. గానుగ నూనెపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరిగింది. ప్రభుత్వాలు రాయితీలు కల్పించి వీరికి సబ్సిడీలు ఇస్తే గానుగ తయారీని చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా నెలకొల్పే అవకాశం ఎక్కువగా ఉంది.

పోషక విలువలు అనేకం..

కొబ్బరి నూనెలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. నువ్వుల నూనెలో మాంగనీస్‌, సోయా నూనెలో ప్రోటీన్లు, వేరుశనగ నూనెలో నత్రజని, పొద్దుతిరుగుడు నూనెలో కాల్షియం, పామాయిల్‌లో విటమిన్‌ ఏ ఉంటాయి. ఒక్కసారిగా ఐదు లీటర్ల పరిమాణంలో నూనె తీసుకున్న వారికి  20 శాతం తక్కువ ధరలో లభిస్తుండడం విశేషం. ముడిసరుకులు (పల్లీలు, నువ్వులు, సన్‌ఫ్లవర్‌, కుసుమలు) మనమే తీసుకెళ్తే కేజీకి రూ.30 చొప్పున చార్జీలతో గానుగ నూనె పట్టించి ఇస్తున్నారు. 

గానుగ నూనెతో లాభాలు

  • రిఫైన్డ్‌ ఆయిల్‌తో పోల్చితే రెండున్నర లీటర్ల వాడకం రిఫైన్డ్‌ ఆయిల్‌కు గానుగ నూనె ఒక లీటరు సరిపోతుంది
  • ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది
  • మెగ్నీషియం, జింక్‌ గానుగ నూనెలో ఎక్కువగా ఉంటుంది. దీంతో మైగ్రేన్‌ సమస్య, కాల్షియం సమస్యలు తొలగిపోతాయి
  • కుసుమ నూనె గుండె జబ్బు వ్యాధిగ్రస్తులకు, వాల్స్‌ బ్లాక్‌ కాకుండా పని చేస్తుంది.  రక్తం శుద్ధి చేయడంలో కీలకపాత్ర వహించి, చెడు కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
  • గానుగ కొబ్బరినూనె ద్వారా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. థైరాయిడ్‌, డయాబెటిక్‌ ఉన్న వారికి ఇదెంతో ఉపయోగపడుతుంది. తొందరగా అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.
  • కట్టె కానుగతో చేసిన పల్లీ నూనె మంచి కోలెస్ట్రాల్‌ను అభివృద్ధి చేస్తూ చెడు కోలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

  గానుగ నూనె తయారీ

  గానుగ నూనెను సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. వీటిలో వాడే పరికరాలు రోకలిదుడ్డు, రోలు చెక్కతో చేసినవే కావడంతో నూనె వేడెక్కకుండా పోషకాలు అలాగే ఉంటాయి. ఇనుము యంత్రాలతో రిఫైన్డ్‌ చేసిన ఆయిల్‌ వేడెక్కడం ద్వారా వాటిలోని పోషకాలు కనుమరుగవుతాయి. వాటికి తోడు కెమికల్స్‌ ఉపయోగించడం, విటమిన్‌ మినరల్స్‌ కోసం కొన్ని పదార్థాలను కలుపుతుండడంతో ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. పల్లీ నూనె, గానుగ నూనె తయారు కావాలంటే 20 కేజీలతో ఎనిమిది కిలోల ఆయిల్‌ ఒక గంట వ్యధిలో తయారవుతుంది. కొబ్బరి 55 శాతం మాత్రమే నూనెగా తయారవుతుంది. అంటే 20 కేజీల కొబ్బరికి గానుగ ఆడిస్తే 12 కేజీల నూనె తయారవుతుంది.  

   ఆదరణ పెరిగింది..

  మేము రెండు సంవత్సరాలుగా ఈ నూనెను నిజామాబాద్‌లో తయారు చేస్తున్నాం. కేరళ నుంచి కొబ్బరి, మహబూబ్‌నగర్‌, వనపర్తి నుంచి పల్లీలు, మహారాష్ట్ర నుంచి కుసుమలు, ఆర్మూర్‌ నుంచి నువ్వులు తీసుకొస్తాం. మొదటిరకం సీడ్స్‌ను సేకరించి మా దగ్గర గానుగ నూనె తయారుచేస్తాం. నగరవాసులకు ఇప్పుడిప్పుడే అవగాహన, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి కొనుగోలు చేస్తున్నారు. పల్లీల ధర రూ.300లు ఉంటే పల్లీ రిఫైన్డ్‌ ఆయిల్‌ షాపుల్లో 100 నుంచి 110 రూపాయలకు లభిస్తుంది. 3 కేజీల పల్లీలకు మా వద్ద ఒక కేజీ గానుగ పల్లి ఆయిల్‌ వస్తుంది. బయట తక్కువకు దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు ఆలోచించాలి.  
  -గుండపనేని మురళి, గానుగ నూనె తయారీదారు

పాతరోజులొచ్చాయ్‌..

తాతలు, తండ్రుల కాలంలో గానుగ ద్వారా తయారుచేసిన నూనెనే వాడేవారు. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. 80 ఏండ్లు వచ్చినా ఎవరి పనులు వారే చేసుకునేవారు. ప్రస్తుతం ఇనుము యంత్రాలతో తయారయ్యే రిఫైన్డ్‌ ఆయిల్‌తో 30 ఏండ్లకే బలహీనపడుతున్నారు. మా స్నేహితుల సలహా మేరకు ఏడాదిన్నరగా ఈ నూనెనే వాడుతున్నా. రిఫైన్డ్‌ ఆయిల్‌ మూడు లీటర్లకు బదులు ఇది ఒక లీటరు సరిపోతుంది. 
-నవీన్‌గౌడ్‌, పోస్టల్‌ ఉద్యోగి, సుభాష్‌నగర్‌

 పోషకాలు అధికం..

రిఫైన్డ్‌ ఆయిల్‌తో పోల్చుకుంటే ధర ఎక్కువే. పోషకాలు ఎక్కువగా ఉండడంతో గానుగ నూనెనే వాడుతున్నాము. ఆరోగ్య సమస్యలు లేకుండా చేసేందుకు గానుగ నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మా ఇంటిల్లిపాది ఇదే వాడుతున్నాము. రిఫైన్డ్‌ నూనెలు మానేసిన తర్వాత ఇదే అలవాటు చేసుకున్నాము. దీంతో ఆరోగ్యంగా ఉంటున్నాము.
-బాబన్న, కంఠేశ్వర్‌ హౌసింగ్‌ బోర్డు


logo