మంగళవారం 11 ఆగస్టు 2020
Nizamabad - Jul 07, 2020 , 02:20:00

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

  • lజిల్లా కేంద్రాల్లోనూ విస్తరిస్తోన్న వైరస్‌
  • lలాక్‌డౌన్‌ సడలింపుల  తర్వాత అధికమవుతున్న వైనం
  • lఅజాగ్రత్తతో ముప్పుకొనితెచ్చుకోవద్దని వైద్యుల సూచన
  • lఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో  234 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ..
  • lప్రస్తుతం 139 యాక్టివ్‌ కేసులు..

పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా కేసులు పల్లెల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రెడ్‌జోన్‌లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు కేసులు తగ్గి గ్రీన్‌జోన్‌లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి లాక్‌డౌన్‌లో ఇచ్చిన సడలింపులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రజలు సైతం రక్షణ చర్యలు పాటించకపోవడం, అవసరం లేకపోయినా ఇష్టారాజ్యంగా తిరుగుతుండడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి, బాన్సువాడ వంటి పట్టణాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు ఏకంగా పల్లెలకూ పాకుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం  ఏడు కేసులు నమోదయ్యాయి. ఉభయ జిల్లాల్లో మొత్తం 234 మందికి కరోనా  సోకగా ప్రస్తుతం 139 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావద్దని, వచ్చినా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. మొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి పల్లెలకూ పాకుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్చి నెలాఖరులో మొదలైన కరోనా కలకలం లాక్‌డౌన్‌తో సద్దుమణిగి రెడ్‌జోన్‌లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి చేరాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో మే 6వ తేదీ నుంచి జనజీవనం యథాస్థితికి వచ్చింది. మరోవైపు ప్రజలు ఇష్టానుసారంగా తిరగడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొవిడ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది.  చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహమ్మారి బారినపడుతున్నారు. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో  మొత్తం 234 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 139 యాక్టివ్‌ కేసులున్నాయి.

నిర్లక్ష్యమే పెను ముప్పు...

కరోనా బారినపడినవారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కొందరు దవాఖానల్లో, మరి కొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కరోనా మహమ్మారిని కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, ముఖానికి మాస్కు ధరించడంతోపాటు  చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలని సూచిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో, కాలనీల్లో చుట్టుపక్కలవారితో, బంధువులతో ఉన్నప్పుడు ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మనవారే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనా ముప్పు బారిన పడే అవకాశం ఉంటుందంటున్నా రు. మహారాష్ట్రకు వెళ్లిన వారిలో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు కామారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. 

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తరువాత..

ఆర్థికమూలాలపై ప్రభావం పడుతున్నదనే ఉద్దేశంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ వస్తున్నది. నిబంధనలను సడలించిన తరువాత నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో 153 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 83 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 81 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, 56 యాక్టివ్‌ కేసులున్నాయి. మిగిలిన వారు కోలుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తరువాత వెలుగు చూసిన కేసుల్లో ఒక రోజు శిశువుతోపాటు ఐదేళ్ల పాపకూ పాజిటివ్‌  నిర్ధారణ కావడం కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. వృద్ధులు సైతం మహమ్మారి బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. 

అవగాహనతో ముందుకు...

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందుతుండడంతో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. వైరస్‌బారినపడిన వారి కుటుంబాలను సమాజంలో చిన్నచూపు చూస్తున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. వలసవచ్చిన కుటుంబాల్లో కామారెడ్డి పట్టణంలో నెలన్నర రోజుల క్రితం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, స్థానికులు ఆ కుటుంబాలపై వివక్ష చూపారు. ఓ అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి లక్షణాల్లేకుండానే ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచించడంతో ఇంట్ల్లోనే ఉంటూ బాధితుడు కోలుకుంటున్నాడు. ముందుజాగ్రత్త పేరుతో అపార్ట్‌మెంట్‌లోని పలు కుటుంబాలు గదులు ఖాళీ చేసి వెళ్లగా, బాధిత కుటుంబం నివాసం ఉండే అంతస్తుకు వెళ్లడానికి జంకే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తోంది. మన పోరాటం వైరస్‌పైనే తప్ప కరోనా రోగితో కాదంటూ అవగాహన కల్పిస్తున్నారు. కరోనాబారినపడిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా సమీపంలో ఉండే ఇతరులకు వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఇతరులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కామారెడ్డి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ పేర్కొంటున్నారు. వివక్ష చూపితే కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి చికిత్స తీసుకోకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అవగాహనతో మెదులుకోవాలని సూచిస్తున్నాయి.logo