మంగళవారం 04 ఆగస్టు 2020
Nizamabad - Jul 06, 2020 , 02:22:29

జంతువుల నుంచి మనుషులకు వ్యాధుల ముప్పు

జంతువుల నుంచి మనుషులకు వ్యాధుల ముప్పు

ఎల్లారెడ్డి రూరల్‌ : ఇటీవలి కాలంలో జూనోటిక్‌ వ్యాధుల సంక్రమణ అధికమైంది. పందుల ద్వారా స్వైన్‌ఫ్లూ, పశువుల నుంచి అంత్రాక్స్‌, కుక్కల నుంచి వచ్చే రేబిస్‌ వంటి వ్యాధులు ఈ కోవకు చెందినవే. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు 200కుపైగా ఉన్నాయి. మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల సంక్రమణను జూనోసిస్‌ అంటారు. లూయీస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త కుక్కకాటు ద్వారా వచ్చే రేబిస్‌ వ్యాధి నివారణ టీకాను 1885 జూలై 6న విజయవంతంగా ఉపయోగించాడు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ డేను నిర్వహిస్తున్నారు. 

ప్రాణాంతక వ్యాధులకు వాహకాలు..

గాలి, నీరు, ఆహారం, కలుషితమైన మాంసం, పాలు, గుడ్ల ద్వారా జూనోటిక్‌ వ్యాధులు సంక్రమించే అవకాశముంది. స్వైన్‌ఫ్లూ, అంత్రాక్స్‌ వ్యాధులు అదుపులో ఉన్నా కుక్కల ద్వారా రేబిస్‌, బ్రూసెల్లోసిస్‌, లిస్టిరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్‌, హైడాటిడోసిస్‌, ప్లేగు, లైష్మేనియాసిస్‌ వ్యాధులు వస్తాయి. మెదడువాపు, ప్లేగు వ్యాధులు దేశంలో జూనోటిక్‌ కోవకు సంబంధించినవే. మెదడువాపు వ్యాధి (జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌) కారణంగా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. విచ్చలవిడిగా తిరిగే పందుల శరీరంపై దో మలు కాటువేడయం, అవే దోమలు మనపై దాడిచేయడంతో ఈ వ్యా ధి వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియా ద్వారా సాల్మోసెల్లోసిస్‌, లెఫ్టోస్పైరోసిస్‌, గ్లాండర్స్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. పరాన్నజీవుల కారణంగా అంకైలోస్టోమియాసిస్‌, హైడాటిడోసిస్‌, అలర్జీ, గజ్జి, అమీబియాసిస్‌, బాలాంటిడియాసిస్‌, టాక్సోప్లాస్మా వ్యాధులు సోకుతాయి. 

విస్తృత అవగాహన కల్పించాలి

జూనోటిక్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పశుసంవర్ధక, ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్‌ శాఖలు ఈ నెల 6న సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

నివారణ ఇలా...

మన దేశంలో సోకే జూనోటిక్‌ వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రేబిస్‌. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ సిఫారసు ప్రకారం 75 శాతం కన్నా ఎక్కువ కుక్కలకు రేబిస్‌ నిరోధక టీకాలు వేస్తే తప్ప ఈ వ్యాధిని నిరోధించలేము. జూనోసిస్‌ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు, పశువైద్యులు ముందుజాగ్రత్తగా టీకాలు వేయించుకోవడం మంచిది.

టీకాలు వేయించాలి

పశువులు, కుక్కలకు క్రమం తప్పకుండా అంతర పరాన్న జీవుల నిర్మూలన టీకాలు, మందులు ఇవ్వాలి. వాటి ద్వారా సంక్రమించే వాధ్యులను నివారించొచ్చు. పందులను గ్రామానికి దూరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో పెంచితే మెదడువాపు వ్యాధిబారిన పడకుండా ఉండొచ్చు. శుభ్రత పాటిస్తే జూనోటిక్‌ వ్యాధులు దరిచేరవు. మాంసం, గుడ్లను ఉడికించి తీసుకోవాలి. పాలను బాగా మరిగించిన తర్వాతే వాడాలి. 

పశువులు  : వీటి ద్వారా మశూచి, బ్రూసెల్లోసిస్‌, దొమ్మ, టీబీ, రేబిస్‌, మ్యాడ్‌కౌ, గాలికుంటు, పాశ్చరెల్లోసిస్‌ వ్యాధులు వ్యాపిస్తాయి. 

మేకలు  : వీటి ద్వారా మశూచి, అస్పర్జిల్లస్‌, రింగ్‌వార్మ్‌, తలసేమియా, లిస్టిరియోసిస్‌ సోకుతాయి. గుర్రాల ద్వారా మెదడువాపు, దొమ్మ, టీబీ, బ్రూసెల్లోసిస్‌, రింగ్‌వార్మ్‌, గ్లాండర్స్‌ వ్యాధులు వస్తాయి. 

ఎలుకలు : ఇవి ప్లేగు, లెప్టోస్పైరోసిస్‌, మెదడువాపు, క్యూఫీవర్‌ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి.  

కుందేళ్లు: వీటి ద్వారా తలసేమియా, గజ్జి, లిస్టిరియోసిస్‌, టాక్సోఫ్లాస్మోసిస్‌, స్మాటిడ్‌ ఫీవర్‌ వ్యాధులు వస్తాయి. 

కోతులు: వీటి ద్వారా డెంగీ, అమీబియాసిస్‌, పైలేరియాసిస్‌, రేబిస్‌, సాల్మోనెల్లోసిస్‌, మీజిల్స్‌ వ్యాధులు వస్తాయి.
పక్షులు :  వీటితో సాల్మోనెల్లోసిస్‌, లిస్టిరియోసిస్‌, టాక్సోప్లాస్మోసిస్‌, మెదడువాపు, ప్లేగు, సిట్టకోసిస్‌, అస్పర్జిల్లోసిస్‌ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. 
పందులు : వీటి ద్వారా టీబీ, రేబిస్‌, బ్రూసెల్లోసిస్‌, లెప్టోస్సైరోసిస్‌, మెదడువాపు, ఇన్‌ప్లూయింజా వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

జాగ్రత్తలు పాటించాలి

కుక్కలతో సన్నిహితంగా మెలిగేవారికి రేబిస్‌, హైడాటిడోసిస్‌ వ్యాధులు వచ్చే అవకాశముం ది. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధం ఉండే పరిశ్రమ ల్లో పనిచేసే వారికి దొమ్మవ్యాధి సోకుతుంది. డెయిరీ ఫారాల్లో పనిచేసే సిబ్బందికి, పశువైద్యులకు బ్రూసెల్లోసిస్‌ రావొచ్చు. కలుషితమైన పాలను ఉపయోగించే వారికి క్షయ, పౌల్ట్రీఫారాల్లో పనిచేసే వారికి సిట్టకోసిస్‌, ఎలుకలు ఎక్కుగా ఉండే గోదాముల్లో పనిచేసేవారికి లెప్టోస్పైరోసిస్‌ సోకే ప్రమాదముంది. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు టీబీ, సాల్మోనెల్లోసిస్‌, లిస్టిరియోసిస్‌ వంటి జూనోటిక్‌ వ్యాధులు త్వరగా సోకే అవకాశముంది. వివిధ జంతువుల ద్వారా వచ్చే వ్యాధులబారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.  -అర్చన, మండల పశువైద్యాధికారిణి, ఎల్లారెడ్డిlogo