శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jul 06, 2020 , 01:47:18

నేటి నుంచి కరోనా పరీక్షలు

నేటి నుంచి కరోనా పరీక్షలు

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం  జిల్లా దవాఖానలో కొవిడ్‌-19 పరీక్షల కోసం ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. నేటి నుంచి  టెస్టులు నిర్వహించేందుకు వైద్యాధికారులు సర్వం సిద్ధం చేశారు. మొదట 30 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. క్రమంగా ఈ సంఖ్యను 100కు పెంచనున్నారు. కరోనా పేషెంట్ల కోసం 200 పడకల వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్స అందించేందుకు వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

ఖలీల్‌వాడి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సకు రాష్ట్ర ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. దీంతో అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు సోమవారం నుంచి వైద్య పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడి దవాఖానలోనే పరీక్షలు చేయడంతో పాటు చికిత్సను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెస్టులకు సంబంధించిన ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. పరీక్షలు చేసేందుకు అవసరమైన సీబీనాట్‌, ట్రూనాట్‌ యంత్రాలను బిగించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ నుంచి అనుమతి లభించడంతో వైద్యాధికారులు ట్రయల్స్‌ కూడా పూర్తిచేశారు. టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స ను అందించేందుకు 200 పడకలను సిద్ధం చేశారు. 

కలెక్టర్‌ నారాయణరెడ్డి అనుమతితో సోమవారం నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి రోజూ 30 మందికి పరీక్షలు చేస్తారు. దీనిని క్రమంగా వందకు పెంచే విధంగా వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌ దవాఖానలో 80 మంది రోగులకు వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 80 మందికి ఆక్సిజన్‌ను అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. 500 మందికి సరిపోయే ఆక్సిజన్‌ సపోర్టింగ్‌ సిస్టం మంజూరు అయ్యిందని, త్వరలో పనులు ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతుండగా.. వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎక్కడ పరీక్ష చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు ఉన్న వారు హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు దవాఖానల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు. పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం జిల్లా కేంద్రంలోనే పరీక్షలు చేస్తుండడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.