సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Jul 04, 2020 , 02:46:02

సమస్యల పరిష్కారానికే రైతు వేదికలు

సమస్యల పరిష్కారానికే రైతు వేదికలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తోందన్నారు. రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మండలంలోని ఐదు గ్రామాల్లో పీయూ సీ చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులకు అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంపీపీ నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్న తికి ఎంతో కృషి చేస్తోందని అన్నారు. నందిపేట్ మండలం డొండేశ్వర్‌లో ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి రైతు వేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

బోధన్ మండలంలోని సాలూరా, హున్సా గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు బోధన్ జడ్పీటీసీ లక్ష్మి భూమి పూజ చేశారు.  మెండోరా మండలంలోని బుస్సాపూర్, వెల్కటూర్ గ్రామాల్లో డీసీసీబీ డైరెక్టర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగంటపేట్ శేఖర్‌రెడ్డి భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్, చౌట్‌పల్లి, కోనాసముందర్‌లో రైతు వేదిక భవనాల నిర్మాణానికి నాయకులు భూమిపూజ నిర్వహించారు. ఎంపీపీ లోలపు గౌతమి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ రేగుంట దేవేందర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రాజేశ్వర్, జిల్లా సభ్యుడు చిన్నారెడ్డి రైతు వేదిక భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. చందూర్‌లో భవన నిర్మాణానికి తహసీల్దార్ ముజీబ్ భూమిపూజ చేశారు.

రైతు వేదిక భవనాలకు రూ.22 కోట్లు మంజూరు

మాక్లూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల కోసం రూ.22 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పంచాయతీరాజ్ శాఖ ఏఈ కిషన్‌నాయక్ తెలిపారు. అగ్రికల్చర్ డిపార్టుమెంట్ నుంచి రూ.12కోట్లు, జాతీయ ఉపాధిహామీ పథకం నుంచి రూ.10కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల, చిన్నాపూర్, అమ్రాద్, గుంజిలి గ్రామాల్లో సర్పంచులు, విండో చైర్మన్, నాయకులు భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఆయా గ్రామాల్లో భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామ ని ఆయన పేర్కొన్నారు. నందిపేట్‌లో జడ్పీటీసీ ఎర్రం యమున, సర్పంచ్ సాంబారు వాణి, ఉమ్మెడలో వైస్ ఎంపీపీ దేవేందర్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో కలిసి భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు.


logo