గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Jul 04, 2020 , 02:46:05

సన్నమే మిన్న..

సన్నమే మిన్న..

నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ వానకాలం పంటల సాగులో భిన్నమైన మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. యాసంగి ముగింపు నాటి నుంచే వ్యవసాయ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులతో సన్నాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నా రు. సామాన్యంగా ఏటా వానకాలంలో కుటుంబ పోషణకు రైతులు సన్నాలను సాగు చేసుకుంటారు. గతానికి భిన్నంగా ప్రభుత్వం సన్నాలను సాగు చే యాలని సూచించింది. దీంతో రైతులు దీనిపై   దృష్టి సారిస్తున్నారు. ఇందులోనూ తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ - 15048) వంగడానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుల నుంచి డిమాండ్ ఏర్పడింది. 

తెలంగాణ సోనా...

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న తెలంగాణ సోనా  వరి వంగడానికి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభిస్తున్నది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఆర్ - 15048 వరికి దేశ వ్యా ప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. చిరు ధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు ఉండే స్థాయిలోనే తెలంగాణ సోనా వరి ధాన్యంలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్) పరిశోధనలోనూ వీటిలో ప్రొటీన్లు 8.76 శాతంతో పాటు బీ2, బీ 3 విటమిన్లు ఉన్నాయని తేలింది. ఈ రకం బియ్యా న్ని తినడం ద్వారా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని గుర్తించింది. ఆర్‌ఎన్‌ఆర్ - 15048 లో గ్లూకోజ్ శాతం కేవలం 51.6 మాత్ర మే ఉండడంతో వీటిని తినే వారికి షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎంటీయూ 1010(ఫిమేల్), జేజీఎల్ 3855(మేల్)లను క్రాసింగ్ చేసి ఈ వరి వంగడాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తెలంగాణ సోనా కేవలం 125 రోజుల్లోనే చేతికి వస్తుంది. ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి సైతం వస్తుంది. 

నిజామాబాద్ జిల్లాలో...

నిజామాబాద్ జిల్లాలో వానకాలంలో మొత్తం 4,41,925 సాధారణ విస్తీర్ణం ఉండగా 4,86,176 ఎకరాల్లో పంటల సాగుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 2,17,037 ఎకరాల్లో 49శాతం పంటలు వేశారు. గతేడాది వానకాలంలో 5,26,893 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంటల సాగులో జో రు పెరుగనుంది. నిజామాబాద్ జిల్లాలో వరి సా ధారణ విస్తీర్ణం 2020 వానకాలంలో 2,38,138 ఎకరాలు. గతేడాది వానకాలంలో వరి పంటను 3,56,661 ఎకరాల్లో పండించారు. ఈసారి వానకాలంలోనూ 3,56,661 ఎకరాలకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 93,306 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. వచ్చే వారం, పది రోజుల్లో విస్తీర్ణం గణనీయంగా పెరుగనుండగా ఇందులో తెలంగాణ సోనా అధిక భాగం ఉండనుంది. కంది పంట సాగు  గతేడాది వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 2,223 ఎకరాలు ఉంది. ఈసారి సాధారణ విస్తీర్ణం 3,016 ఎకరాలకు 7,425 ఎకరాల్లో పండించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం 4,387 ఎకరాల్లో కంది సాగైంది. కొద్ది రోజుల్లో కంది సాగు మరింత పెరుగనుంది. సోయా  పంట 2019 వాన కాలంలో 67,022 ఎకరాల్లో పండించారు. 2020 వానకాలంలో సాధారణ విస్తీర్ణం 1,02,072 ఎకరాలుండగా 1,09,788 ఎకరాలకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 76,854 ఎకరాల్లో సోయా వేశారు.

కామారెడ్డి జిల్లాలో కంది పంట జోరు...

కామారెడ్డి జిల్లాలో గతేడాది వానకాలంలో 4,85,103 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 2020 వానకాలంలో సాధారణ విస్తీర్ణం 3,95, 877 ఎకరాలుండగా 4,85,304 ఎకరాలకు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పటి వరకు 1,93,841 ఎకరాల్లో పంటలు సాగు చేయగా కొద్ది రోజుల్లో సాగు విస్తీర్ణం ఊపందుకోనుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వరి పంటను 2019 వానకాలంలో 2,10,846 ఎకరాల్లో సాగు చేశారు. 2020 వానకాలం వరి సాధారణ విస్తీర్ణం 1,25,565 ఎకరాలుండగా 2,12,846 ఎకరాల్లో పంటలు పండించాలని ప్రతిపాదించారు. నాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కందులు 2019 వానకాలంలో 17,389 ఎకరా ల్లో పండించారు. 2020 వానకాలంలో 15,468 సాధారణ విస్తీర్ణం కాగా నియంత్రిత సాగులో విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచారు. కామారెడ్డి జిల్లాలో 38,774 ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించగా 30,941 ఎకరాల్లో ఇప్పటికే కందులు వేశారు. కొద్ది రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో పత్తి పంట గతేడాదిలో 47,875 ఎకరాల్లో సాగు చేశారు. 2020 వానకాలంలో సాధారణ విస్తీర్ణం 38,630 ఉండగా వీటి విస్తీర్ణాన్ని 86,865 ఎకరాలకు పెంచారు. ప్రస్తుతం 41,009 ఎకరాల్లో పత్తి సాగైంది. మరింతగా పత్తి సాగు పెరుగనుంది.

సన్నరకం సాగు పెరుగుతోంది...

మన ప్రాంతం, రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా పంటలను తగిన విస్తీర్ణంలో పండించడం, మార్కెట్‌లో డిమాండ్ ఉండే ఆహార ఉత్పత్తులను సాగు చేయడమే లాభసాటి వ్యవసాయం. మన ప్రజల అవసరాలు తీరేలా మన రైతులే పంటలను వేసి మిగిలినవి ఎగుమతి చేయడం ద్వారా రైతులకు లాభాలు వస్తాయి. నియంత్రిత విధానంతో పంట మార్పిడి జరిగి నేలలు సారాన్ని కోల్పోవు. పంటల సరళిలో మార్పు, శాస్త్రీయ పద్ధతుల అనుసరణ, యంత్రాల వాడకం, కూలీల ఖర్చు తగ్గించడం, ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్‌తో మద్దతు ధరలను పొందడం వంటివి కర్షకులకు కలిసి వస్తాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన  భిన్న పంటల సమాహారానికి స్పందన వస్తున్నది.  గతంతో పోలిస్తే సన్నరకం సాగు పెరుగుతోంది. పుటం వేసుకుని రెడీగా ఉన్నారు. నాట్లకు అందరూ సిద్ధమవుతున్నారు.

- ఎం.చంద్రశేఖర్, కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారిlogo