శుక్రవారం 07 ఆగస్టు 2020
Nizamabad - Jul 03, 2020 , 02:57:24

అన్నదాతలకు వరం.. రైతు వేదికలు

అన్నదాతలకు వరం.. రైతు వేదికలు

  • nబోధన్ ఎమ్మెల్యే షకీల్
  • nపలు మండలాల్లో రైతువేదిక నిర్మాణాలకు భూమిపూజ

బోధన్ రూరల్/నవీపేట, రెంజల్/ఎడపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలు అన్నదాతలకు వరంగా మారనున్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గురువారం ఆయన బోధన్, నవీపేట, రెంజల్, ఎడపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో  రైతు వేదికలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రెంజల్ మండల కేంద్రంలో రూ.34 లక్షలతో నిర్మించనున్న వ్యవసాయ సహకార సంఘ  భవన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నవీపేటలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్‌రావుతో కలిసి నవీపేట మండల కేంద్రంతోపాటు జన్నేపల్లి గ్రామంలో రైతు వేదికల నిర్మాణ పనులకు , లింగాపూర్, నిజాంపూర్‌లో రూ.9.50 కోట్లతో చేపట్టనున్న చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిజాంపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. రైతు వేదికలతో రైతుల్లో ఐక్యత పెరుగుతుందన్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్ -బోధన్ ప్రధాన రహదారికి రూ.32 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పను లు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ రోడ్డు విస్తరణ లో భాగంగా వాగులపై ఆరు వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు. బినోలాకు ఎత్తిపోతల పథకం మంజూరైందని, త్వరలో పనుల ప్రారంభానికి టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. వేదికలను రైతులు  సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

అభివృద్ధిని విస్మరించిన మాజీ మంత్రి

గతంలో మూడు పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన సుదర్శన్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. నవీపేట మండలంలో ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రజితాయాదవ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి మండల సమన్వయకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.logo