శనివారం 04 జూలై 2020
Nizamabad - Jul 01, 2020 , 03:27:40

గ్రామాభివృద్ధిలో సర్పంచులకు సహకరించాలి

గ్రామాభివృద్ధిలో సర్పంచులకు సహకరించాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

లోలం, మల్లాపూర్‌ గ్రామాల్లో  భివృద్ధి పనుల తనిఖీ

డిచ్‌పల్లి (ఇందల్వాయి): సర్పంచులు గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తారని, వారికి ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. ఇందల్వాయి మండలం లోలం, మల్లాపూర్‌ గ్రామాల్లో మంగళవారం పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. లోలం గ్రామంలో వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, డంపింగ్‌ యార్డు, పార్కు స్థలం, నర్సరీని పరిశీలించారు. ముందుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన నిర్వహణ సరిగాలేదని, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్‌, కార్యదర్శిని ఆదేశించారు. ఇప్పటివరకు రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఎందుకు నాటలేదని ప్రశ్నించారు. కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం పనులు మధ్యలో నిలిపివేయడంపై సర్పంచుకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15లోగా పనులన్నీ పూర్తి చేయాలని, 16న మరోసారి తనిఖీ చేసి పనులు పూర్తికాకపోతే సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. నర్సరీలో మొక్కలు ఎండిపోవడంపై వనసంరక్షకుడికి రూ. 2వేల జరిమానా విధించాలని కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించి గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్‌, వైకుంఠధామం, రైతు వేదికలు మంజూరు చేసిందని, వాటిని సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం మల్లాపూర్‌ గ్రామంలో పర్యటించారు. కంపోస్టుషెడ్డు పూర్తికావడంతో సర్పంచ్‌ కోరిక మేరకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వనసంరక్షకులకు పలు సూచనలిచ్చారు. మొక్కల వద్ద పాదులు తీయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, మొక్కలకు వాటరింగ్‌ చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో రాములు,  తహసీల్దార్‌ రమేశ్‌, సర్పంచులు మమత శేఖర్‌, సత్యనారాయణ, ఎంపీవో సుభాష్‌చంద్రబోస్‌, కార్యదర్శులు సువార్త, అనూష సంబంధిత అధికారులు పాల్గొన్నారు. logo