ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jun 27, 2020 , 02:22:31

కరోనా.. హైరానా

కరోనా.. హైరానా

  • l కామారెడ్డిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి..
  • l నిజామాబాద్‌ జిల్లాలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ  
  • l ఆందోళన చెందుతున్న ఉమ్మడి జిల్లా ప్రజలు 
  • విద్యానగర్‌/ఖలీల్‌వాడి : ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే కామారెడ్డి జిల్లాలో మూడు, నిజామాబాద్‌ జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి పట్టణంలోని ఆర్యనగర్‌కు చెందిన ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. ఆమె కొడుకు, కోడలు, మనవరాలుకు శుక్రవారం కొవిడ్‌ -19గ నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. వీరంతా హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మంగళ, గురువారాల్లో పంపిన మొత్తం 106 శాంపిళ్లలో 33 రిపోర్టులు వచ్చాయని, మిగితావాటి వివరాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో నిజామాబాద్‌ జిల్లాలో ఆరుగురికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 107కు చేరింది. 

కొండాపూర్‌లో ఒకరికి.. 

సిరికొండ : నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు వ్యక్తి ఈనెల 19న ధర్పల్లిలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకున్నాడు. అనుమానంతో అతడి శాంపిళ్లను హైదరాబాద్‌కు పంపించగా శుక్రవారం కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. దీంతో అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన అతడి కుటుంబ సభ్యులతో పాటు ముగ్గురు ఆర్‌ఎంపీ డాక్టర్లను, ఆశ వర్కర్‌ను హోం క్వారంటైన్‌ చేసినట్లు మండల వైద్యాధికారి మోహన్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడన్నారు. కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూడడంతో లాక్‌డౌన్‌ పాటించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా, ఇతర గ్రామాల వ్యక్తులను రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలోని దుకాణాలన్నింటినీ మూసివేయించారు.

మంగల్‌పాడ్‌కు చెందిన మహిళకు.. 

ఎడపల్లి : మండలంలోని మంగల్‌పాడ్‌ గ్రామంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సదరు మహిళ ఈనెల 18న నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో ప్రసవించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో దవాఖాన వైద్యులు ఉస్మానియా వైద్యశాలకు రెఫర్‌ చేశారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జువేరియా సుల్తానా తెలిపారు. సదరు మహిళ ఇంట్లోని వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. దీంతో గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామస్తులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నారు. 


logo