గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jun 27, 2020 , 02:22:48

వైఫల్యం దిశగా..

వైఫల్యం దిశగా..

  • lదిశ సమావేశంలో   బహిర్గతమైన  కేంద్ర పథకాల డొల్లతనం
  • lప్రతీ స్కీంలో నిధుల లేమి.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ వెనుకబాటే
  • lనిజామాబాద్‌ పార్లమెంటరీ సెగ్మెంట్‌లో అమలుకు తీసుకున్న చర్యలూ  నామమాత్రమే..
  • lపేదలు, రైతులకు మోదీ పథకాల ప్రయోజనాలు చేర్చడంలో  ఎంపీ  విఫలం!
  • lసమీక్షా సమావేశంలో కనిపించని అర్వింద్‌ ‘చాతుర్యం’

‘అంతన్నాడింతన్నాడే గంగరాజు..’ అన్నట్లుగా ఉంది నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కేంద్ర పథకాల అమలు తీరు. బీజేపీ శ్రేణుల ప్రచార డాంబికాలకూ, కేంద్ర పథకాల వాస్తవిక అమలుకు పొంతన లేకుండా ఉంది. సోషల్‌ మీడియా ఆర్భాటపు ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. శుక్రవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ  (దిశ) సమావేశంలోనూ ఇది మరోసారి తేటతెల్లమైంది. ఎంపీ అర్వింద్‌ నిర్వహించిన సమీక్షా సమావేశం తూతూమంత్రంగా సాగింది. కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో జిల్లాకు చేకూరిన ప్రయోజనం గురించిన ఊసే ఎత్తలేదు. 28 అంశాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మినహాయిస్తే మిగిలిన పథకాల్లో నిధుల లేమి, ప్రజల దరిచేరని పథకాల వివరాలు  బీజేపీ ఎంపీ అర్వింద్‌ ముందే ప్రస్ఫుటంగా బట్టబయలయ్యాయి. రైతన్నలకు ఉపయోగపడే పంటల బీమా వంటి ప్రధాన అంశాలపై సమావేశంలో ప్రస్తావనైనా రాలేదు. 28 అంశాలు ఎజెండాలో పొందుపర్చగా..  సగానికిపైగా కేంద్ర పథకాల అమలుపై ఎంపీ అర్వింద్‌ నేతృత్వంలో లోతైన చర్చ కూడా జరుగకపోవడం కొసమెరుపు.-నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం తూతూ మంత్రంగా సాగింది. దాదాపుగా గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై ఎంపీ స్పందించకపోవడం గమ నార్హం. 

మొండి బ్యాంకులు...

కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాక జాతీయ బ్యాంకులను ఎడాపెడా విలీనం చేశారు. సంస్కరణల పేరిట వందల ఏండ్ల చరిత్ర కలిగిన బ్యాంకులు కనుమరుగయ్యాయి. బడా వ్యాపారులు వరుసగా బ్యాంకులను ముంచుతున్న సందర్భంలో మోదీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో రైతులకు అందుతున్న పంట రుణ లక్ష్యం నిర్ణీత లక్ష్యానికి చేరుకోకపోవడం విడ్డూరంగా మారింది. జిల్లాలో 29 రకాల జాతీయ వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకులున్నాయి. వీటి పరిధిలో 271 శాఖలు సేవలందిస్తుండగా 2020 వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 16,120 బ్యాంకు ఖాతాదారులకు రూ.180 కోట్లు రుణ వితరణ జరిగింది. మొత్తం రుణ వితరణ లక్ష్యంలో కేవలం 8.86 శాతమే. రూ.2,034.19 కోట్ల రుణాలు అందివ్వాల్సి ఉండగా బ్యాంకుల ద్వారా రైతులకు అందింది మాత్రం స్వల్పమే. ఈ విషయాన్ని ఎంపీ అర్వింద్‌ కనీసం పట్టించుకున్న దాఖలాలే కనిపించలేదు. రైతులకు రుణ వితరణ విషయంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొండిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అంశాన్ని కనీసం ముట్టుకోలేదు. 2019 వానకాలం సీజన్‌లో రూ.1,751 కోట్ల రుణ లక్ష్యానికి రైతులకు కేవలం 70శాతం మాత్రమే రుణాలు అందాయి. గడిచిన యాసంగి(2019-2020)లో 64.58 శాతం మాత్రమే రుణ వితరణ జరగడం శోచనీయం. 

కరోనా కాలాన్ని మరిచిన ఎంపీ...

కరోనా లాక్‌డౌన్‌ మూలంగా అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వం వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేసిం ది. ఐటీ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ, విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ సైతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. మరీ ఆ ప్యాకేజీ అమలుకు నోచుకుందా? లేదా? అన్నది దిశ సమావేశంలో సమీక్షనే జరుగలేదు. నిజామాబాద్‌ జిల్లాలో ఎంతమందికి వర్తించింది? ఎంత మంది అర్హులుగా ఉన్నారు? వంటి లెక్కలే పత్తా లేకుండా పోయాయి. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కట్టాల్సిన రుణాల్లో 20శాతం మొత్తాన్ని రుణంగా అందివ్వనున్నట్లుగా కేంద్రం ఈ మధ్యే ప్రకటించింది. కేంద్ర సర్కారు ఇచ్చిన ఆఫర్‌కు జిల్లాలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల వర్గాలు మొహం చాటేశాయి. జిల్లాలో ఎంఎస్‌ఎంఈకి సంబంధించి 3,771 బ్యాంకు ఖాతాలు ఉంటే ఇప్పటి వరకు 1250 మంది మాత్రమే ఆసక్తి చూపారు. కరోనా సాయంగా  ఇచ్చే రుణాలపై బ్యాంకులు 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తుండడంతో అందరూ మొఖం చాటేస్తున్నారు. ఈ విషయంపైనా ఎంపీ అర్వింద్‌ తనదైన శైలిలో చర్చిస్తారని పరిశ్రమల వర్గాలు భావించాయి. కరోనా కష్టకాలానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై ఎంపీ అర్వింద్‌ నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాండ్‌ అప్‌ ఇండియా పరిస్థితి అంతే. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 370 యూనిట్ల మంజూరుకు లక్ష్యం ఉండగా కేవలం 67 యూనిట్లే మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన వారి పరిస్థితిపై  ఎంపీ అర్వింద్‌ కనీసం మాటెత్తకపోవడం దరఖాస్తుదారులను నిరాశకు గురి చేసింది.

కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజనకు స్పందన కరువు...

 ఎన్డీయే సర్కారు 2019లో భారీ ఆర్భాటంతో ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ ధన్‌ యోజన(పీఎం-కేఎంవై)కి శ్రీకారం చుట్టింది. ఇది స్వచ్ఛం, సహకార ఆధారిత రైతుల వృద్ధాప్య పెన్షన్‌. చిన్న, సన్న కారు రైతులకు 60 ఏండ్లు పైబడిన తర్వాత రూ.3వేలు అందడం ఇందులోని ప్రత్యేకత. అయితే దీనికి అర్హత విషయంలో కేంద్రం పెట్టిన షరతులు రైతులకు గందరగోళానికి గురి చేస్తోంది. నిబంధనల కొర్రీలతో వారికి నిరాశ ఎదురైంది. ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు వెయ్యి మించలేదంటే ఈ పథకానికి స్పందనను అర్థం చేసుకోవచ్చు. నిజామాబాద్‌ జిల్లాలో పీఎంకేఎంవైకి 936 మంది మాత్రమే నమోదయ్యారు. దిశ మీటింగ్‌లో పథకం అమలుపైనా, రైతులకు పెన్షన్‌ అందివ్వడంపై రూట్‌ మ్యాప్‌ చర్చ జరుగకపోవడం విడ్డూరం. ఇలా 28 అంశాలు ఎజెండాలో పొందుపర్చగా సగానికి ఎక్కువ కేంద్ర పథకాల అమలుపై ఎంపీ అర్వింద్‌ నేతృత్వంలో లోతైన చర్చ జరుగకపోవడం కొసమెరుపు.

వ్యవసాయ బీమాకు ధీమా కరువు...

వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు బీమా పథకాలను అమలు చేస్తోంది. ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా ఈ రెండింటి పరిధిలో రైతులు చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఇందుకోసం బీజేపీ ఎంపీలు, సంబంధిత పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారం శూన్యం. అంతో ఇంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ రెండు బీమా పథకాలపై ప్రచారం చేస్తున్నది. 2014-15 నుంచి నేటి వరకు ఆరేండ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 5లక్షల 9వేల మంది మాత్రమే బీమా పరిధిలోకి వచ్చారు. ఆయా బీమా కంపెనీలకు రైతులు చెల్లించిన ప్రీమియం రూ.100.97 కోట్లు. ముఖ్యంగా ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత బీమా పథకాల్లో కేంద్రం ఇచ్చే గడువుపై అస్పష్టత నెలకొంది. రైతన్నలకు ఉపయోగపడే పంటల బీమా వంటి ప్రధాన అంశాలపై దిశ మీటింగ్‌లో ఎంపీ అర్వింద్‌ చర్చించనే లేదు.logo