శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Jun 25, 2020 , 00:48:40

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20,21 పనుల్లో వేగం పెంచాలి

కాళేశ్వరం ప్రాజెక్టు  ప్యాకేజీ 20,21 పనుల్లో వేగం పెంచాలి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కోటి ఎకరాల మాగాణికి సాగు నీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు, తీరుతెన్నులపై ఇరిగేషన్‌ అధికారులతో వేల్పూర్‌లో బుధవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20,21లో పనులను వేగవంతం చేసి నిజామాబాద్‌ జిల్లాలో సాగునీటి సౌక ర్యం లేని ప్రాంతాలకు గోదావరి జలాలను పారించాల్సిందేనని స్పష్టం చేశారు.ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలకు గోదావరి నీటిని లిఫ్టుల ద్వారా తీసుకురావడానికి ఉద్దేశించిన ప్యాకేజీ 20, 21 పనుల పురోగతిపై మంత్రికి ఇరిగేషన్‌ అధికారులు వివరించారు. పునరుజ్జీవ పథకం ద్వా రా ప్రతి సంవత్సరం కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీని నిం పడం ఖాయమని మంత్రి అన్నారు. 

వేగం పెంచాలి...

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21 పనులు పూర్తయితే ఆర్మూ ర్‌ నియోజకవర్గంలో ఏడు వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80వేలు, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో లక్షా 10వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్యాకేజీ 21-బీలో భాగంగా నిజాంసాగర్‌ కెనాల్‌ నుంచి వచ్చే నీరు మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌ నుంచి 650 క్యూసెక్కుల సామర్థ్యంతో పైప్‌లైన్‌ ద్వారా ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌, భీమ్‌గల్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు అందివ్వనున్నట్లు తెలిపారు. మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌ పనులు 80శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించగా మిగిలిన పనులు జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మెట్‌పల్లి పైప్‌లైన్‌ పనుల్లో 88వ కిలో మీటరు వద్ద ఎంఎస్‌ పైప్‌లైన్‌, 72వ కిలో మీటరు ఎంఎస్‌ పైప్‌లైన్‌ పని పూర్తయ్యింది. అలాగే 190వ కిలో మీటరు వద్ద డీఐ పైప్‌లైన్‌, 124వ కిలో మీటరు డీఐ పైప్‌లైన్‌ పనులు పూర్తయినట్లుగా మంత్రి చెప్పారు. ప్యాకేజీ 21బీ మెట్‌పల్లి పైప్‌లైన్‌ పనుల్లో వేగం పెంచి ఈ వానకాలం సీజన్‌కు ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, వేల్పూర్‌ మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సిద్ధం కావాలని అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్యాకేజీ 21- ఏలో గడ్కోల్‌ పంప్‌ హౌస్‌ పనుల్లో మట్టి తవ్వడం పూర్తయ్యిందని అధికారులు వివరించారు. పంప్‌హౌస్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి వేముల అధికారులను ఆదేశించారు. రైతు లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పైప్‌లైన్‌ పనులకు ఆటంకం కలిగించకూడదని, పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు.

వర్క్‌ ఏజెన్సీలకు హెచ్చరిక...

చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలో లీకేజీ, ఇతర మరమ్మతు పనులను పూర్తి చేయకపోతే సంబంధిత వర్క్‌ ఏజెన్సీని తొలగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ వానకాలం సీజన్‌లో చౌట్‌పల్లి హన్మంత్‌ రెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలోని అన్ని లైన్లు నెల రోజుల్లోపు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కమ్మర్‌పల్లి వెళ్లే పైప్‌లైన్‌లో తిమ్మాపూర్‌ వద్ద గల పైప్‌లైన్‌, నర్సాపూర్‌కి నీరు వెళ్లే చౌట్‌పల్లి మోటర్‌, రామన్నపేటకి నీరు వెళ్లే మోర్తాడ్‌ మోటర్‌ రిపేర్‌ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు.   కాంట్రాక్ట ర్‌ పనులు పూర్తి చేయకపోతే సంబంధిత ఏజెన్సీని రద్దు చేయించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ ఆత్మారాం, ఈఈలు, డీఈలు, వర్క్‌ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.