శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Jun 24, 2020 , 02:45:06

మిడతల పని పట్టేందుకు.. అధికార యంత్రాంగం సిద్ధం

మిడతల పని పట్టేందుకు.. అధికార యంత్రాంగం సిద్ధం

జిల్లా, మండల, గ్రామ కమిటీల ఏర్పాటు

గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు

మోర్తాడ్‌ : మిడత.. అనే పేరు వినగానే రైతులు వణికిపోతున్నారు. అనుకోని పరిస్థితుల్లో మిడతల దండు పంట పొలాలపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. మిడతల దండు వస్తే జరిగే నష్టం అంతాఇంతా కాదు. దీంతో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయడంతో పాటు మిడతల దండును అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.

కమిటీల కర్తవ్యం.. 

మిడతలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అవి ఎటువైపు ఉన్నాయి, మన ప్రాంతానికి ఎంతదూరంలో ఉన్నాయనే విషయాలను గమనిస్తూ ఉండాలి. మనప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటే రైతులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఫైర్‌ ఇంజిన్లు, స్ప్రేయర్లు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. గ్రామాల్లో మైకుల ద్వారా, దండోరా వేయించాలి.  పవర్‌ స్ప్రేయర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు అందుబాటులో ఉంచుకోవాలి. అధికారులకు సమాచారాన్ని అందించడంతో పాటు పక్క గ్రామాల వారికీ సమాచారాన్ని అందించాలి.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు 

మిడతల దండు ఒకవేళ దాడి చేస్తే అరికట్టేందుకు అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిడతల దండు వస్తే పరిస్థితులు ఏవిధంగా ఉంటాయి, పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి, అరికట్టేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఖాళీ డబ్బాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారా పెద్దపెద్ద శబ్దాలు చేస్తే మిడతలు చెదిరిపోతాయి. 15 లీటర్ల నీటిలో 45 మి.లీ వేపనూనె కలిపి పిచికారీ చేయడం ద్వారా మిడతలు పంటను తినలేవు. క్వినాల్‌పాస్‌ 15శాతం డీపీ లేదా మిథైల్‌పారథియాన్‌ 2శాతం డీపీ రసాయన పొడిని హెక్టారుకు 25 కిలోల చొప్పున చల్లాలి. ఖాళీ ప్రదేశాల్లో మిడతలు వాలితే మలాథియాన్‌ 96శాతం యూఎల్‌వీ లేదా ఫెనిట్రోథియాన్‌ 96శాతం యూఎల్‌వీ లీటరు నీటిలో కలిపి ఒక హెక్టారుకు చల్లాలి. ఈ విధంగా చేయడం ద్వారా మిడతలను అరికట్టవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.  

కమిటీలో  సభ్యులెవరంటే..

జిల్లా కమిటీ :  జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, డాట్‌ సెంటర్‌ కో-ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం ఉన్నతాధికారి, డీఎఫ్‌వో, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌, పోలీస్‌కమిషనర్‌, డీపీవో తదితరులు ఉంటారు. 

మండల స్థాయి కమిటీ :  తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్సై, ఏవో, అటవీశాఖ అధికారి, ఎంపీపీ, జడ్పీటీసీ, రైతుబంధు సమితి మండల కో -ఆర్డినేటర్‌, ్ల రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, చురుకుగా ఉండే రైతులు.

గ్రామ స్థాయి కమిటీ :  ఏఈవో, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, గ్రామానికి కేటాయించిన కానిస్టేబుల్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్‌, చురుకుగా ఉండే రైతులు.


logo