ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jun 23, 2020 , 01:18:19

సోయా సాగు ఇలా..

సోయా సాగు ఇలా..

  • సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు
  • సూచనలు పాటించాలంటున్న వ్యవసాయశాఖ అధికారులు
  • సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడులు
  • సూచనలు పాటించాలంటున్న వ్యవసాయశాఖ అధికారులు

జక్రాన్‌పల్లి: మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న సోయాసాగు చేసే రైతులు సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సోయా సాగుకు అనువైన నేలలు, పంటను ఆశించే తెగుళ్ల నివారణ తదితర అంశాలపై సూచనలు ఇస్తున్నారు. 

అనువైన నేలలు

సోయాసాగుకు నల్ల రేగడి నేలలు అనువైనవి. ప్రభుత్వం రాయితీపై జే - 335 రకం విత్తనాలను రైతులకు అందజేస్తున్నది. వంద రోజుల నుంచి 110 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.

విత్తన శుద్ధి

కిలో విత్తనాలను 2.5 గ్రాముల థైరమ్‌ లేదా మాంకోజెచ్‌ అనే శిలీంధ్రనాశినితో శుద్ధి చేయాలి. లేదా విత్తనాన్ని శిలీంధ్రనాశినితో శుద్ధి చేసి రైజోబియం కల్చర్‌ని పట్టించి ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. ఇలా చేస్తే బాక్టీరియా సోయా వేరుపై ఉండే బుడిపెల్లో నివసిస్తూ గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరించి పంటకు మేలు చేస్తుంది. 

విత్తే సమయం

తొలకరి తర్వాత జూన్‌ మొదటి వారం నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు ఎకరాకు 25 నుంచి 30 కిలోలు మాత్రమే వాడాలి. వేసవి దుక్కి మెత్తగా వచ్చే వరకు రెండు సార్లు దున్నాలి. తర్వాత చదును చేసి విత్తనం వేసే పరికరంతో విత్తుకోవాలి. 

సాగునీటి యాజమాన్యం

సోయాను ముఖ్యంగా వర్షాధారంగా సాగుచేస్తారు. పూత, గింజ కట్టే దశలో మొక్క బెట్టకు గురైతే పంట దిగుబడి తగ్గుతుంది. పూత, గింజ కట్టే దశలో నీరందించాలి.

పంటను ఆశించే పురుగులు

పొగాకు లద్దెపురుగు: ఈ పురుగులు ఆకులను జల్లెడగా మార్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నివారణకు ఎసిఫెట్‌ మందును 100 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్‌ 250 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు తీవ్రత అధికంగా ఉంటే విషపు ఎరలను పెట్టాలి.

ఆకుమడత పురుగు

పంట ఎక్కువగా ఉన్న పరిస్థితిలో ఆకుమడత పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకు అంచులను పత్రహరితాన్ని కొరికి నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు ఎకరానికి ఎసిఫెట్‌100 గ్రాములు లేదా క్లోరిపైరిఫాస్‌ 250 మిల్లీ లీటర్లను కలిపి పిచికారీ చేయాలి. 

మొవ్వకుళ్లు తెగులు

సోయాకు ఇది వైరస్‌ తెగులు వంటిది. ఇది తామరపురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొవ్వ, ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి మొక్క ఎదుగుదలను అరికట్టి కాయలు ఏర్పడకుండా చేస్తుంది. తెగులు లేత మొక్కలపై వచ్చినప్పుడు తీవ్ర నష్టం ఉంటుంది. తెగులును తట్టుకునే ఎరువులను వాడాలి. 

కలుపు నివారణ

కలుపును నివారించేందుకు మిథాలిన్‌ అనే కలుపుమందును ఎకరాకు 1.4 లీటర్ల చొప్పున విత్తిన 24 గంటల్లోపు పిచికారీ చేయాలి. లేదా విత్తిన 20 నుంచి 25 రోజుల్లో ఇమాజిత్‌ఫైర్‌10 శాతం అనే కలుపు మందును 250 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేయాలి. సోయా వర్షాధార పంట కావడంతో నీటి లభ్యత ఉన్నచోట విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి, కాయ దశలో మరోసారి నీటి తడులను ఇస్తే అధిక దిగుబడులు పొందవచ్చు.logo